Operation HCA : ఆపరేషన్ హెచ్‌సీఏ మొదలైంది
ABN, First Publish Date - 2023-08-01T04:00:42+05:30
అవినీతి, అక్రమాల నిలయంగా మారిపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ప్రక్షాళన మొదలుపెట్టారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హెచ్‌సీఏ ఏకసభ్య కమిటీ సభ్యుడు లావు నాగేశ్వరరావు. నిబంధనలకు విరుద్ధంగా ఒకటికి మించి క్లబ్‌లను అధీనంలో ఉంచుకున్న పలువురు హెచ్‌సీఏ పెద్దలకు నాగేశ్వరరావు షాకిచ్చారు.
57 మల్టిపుల్ క్లబ్‌లపై ఉక్కుపాదం
మూడేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం
రిటైర్డ్ జస్టిస్ నాగేశ్వరరావు ఆదేశాలు
అర్షద్, వివేక్, జాన్‌మనోజ్ సహా పలువురుకి చెక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అవినీతి, అక్రమాల నిలయంగా మారిపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ప్రక్షాళన మొదలుపెట్టారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హెచ్‌సీఏ ఏకసభ్య కమిటీ సభ్యుడు లావు నాగేశ్వరరావు. నిబంధనలకు విరుద్ధంగా ఒకటికి మించి క్లబ్‌లను అధీనంలో ఉంచుకున్న పలువురు హెచ్‌సీఏ పెద్దలకు నాగేశ్వరరావు షాకిచ్చారు. ఐదు నెలల సుదీర్ఘ కసరత్తు, లోతైన దర్యాప్తు అనంతరం హెచ్‌సీఏలోని 57 క్లబ్‌లను మూడేళ్ల పాటు అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారు హెచ్‌సీఏ ఎన్నికల్లో ఎలాంటి పదవులకు పోటీ చేయకుండా నిరోధిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అడ్డంగా దొరికిపోయారు..
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు గుర్తింపునిచ్చే విషయంలో బీసీసీఐ వద్ద నిర్దిష్టమైన విధి విధానాలేమీ లేవు. దీంతో హెచ్‌సీఏ పాలకమండలిలో సుదీర్ఘకాలం పదవులు నిర్వహించిన వారు నిబంధనలు పాటించకుండా తమకు నచ్చిన వారికి అనేక క్లబ్‌లు కేటాయించారు. దీంతో కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఒకటికి మించి (బహుళ) క్లబ్‌లను నిర్వహిస్తున్నారు. అందులో 57 క్లబ్‌లు ఇలా ఉన్నట్టు నాగేశ్వరరావు గుర్తించారు. ఈ క్లబ్‌లలోనూ ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ క్లబ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో సదరు క్లబ్‌లపై మూడేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్టు నాగేశ్వరరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంటే.. క్లబ్‌లు మూడేళ్లపాటు హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోగా... ఆ క్లబ్ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు. దీంతో బీజేపీ నాయకుడు గడ్డం వివేక్, పురుషోత్తం అగర్వాల్, సురేంద్ర అగర్వాల్, అర్షద్ అయూబ్, జాన్ మనోజ్, మహ్మద్ అద్నాన్‌తో పాటు అనేకమంది నాగేశ్వరరావు యార్కర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. అయితే, క్రికెటర్లకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ క్లబ్‌లు హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడడానికి యథావిధిగా జట్లను పంపించే వెసులుబాటు కల్పించారు. అంటే.. సదరు క్లబ్‌ల ఆటగాళ్లను మాత్రం జట్టులోకి తీసుకుంటారు.
Updated Date - 2023-08-01T04:00:42+05:30 IST