తొలిసారి బాదేశారు
ABN, First Publish Date - 2023-08-02T04:58:30+05:30
తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయిన భారత బ్యాటర్లు.. సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో మాత్రం కదం తొక్కారు.
గిల్, ఇషాన్, హార్దిక్, శాంసన్ అర్ధసెంచరీలు
భారత్ 351/5 జూ విండీస్‌తో మూడో వన్డే
టరౌబా (ట్రినిడాడ్): తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయిన భారత బ్యాటర్లు.. సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో మాత్రం కదం తొక్కారు. తొలిసారిగా తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో బ్యాట్లు ఝుళిపించగా, బ్రయాన్ లారా స్టేడియంలో పరుగుల వరద పారింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 11 ఫోర్లతో 85), ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 77)లతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 నాటౌట్), సంజూ శాంసన్ (41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51) అర్ధసెంచరీలతో మురిపించారు. దీంతో వెస్టిండీ్‌సతో మూడో వన్డేలో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగుల భారీస్కోరు చేసింది. షెఫర్డ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇక, లారా స్టేడియంలో ఇదే తొలి పురుషుల వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు కూడా రోహిత్, కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రుతురాజ్, ఉనాద్కట్ బరిలోకి దిగారు. కాగా, ఛేదనలో వెస్టిండీస్ కడపటి వార్తలందేసరికి 8 ఓవర్లలో 3 వికెట్లకు 25 పరుగులు చేసింది. ఈ మూడు వికెట్లు ముకేశ్‌కు దక్కాయి.
అదిరే ఆరంభం: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ కోల్పోయిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఈసారి కూడా ఓపెనర్లు ఇషాన్, గిల్ నుంచి అద్భుత ఆరంభమే లభించగా.. చివర్లో హార్దిక్ సూపర్ ఫినిషింగ్‌కు భారత్ భారీ స్కోరందుకుంది. అలాగే నాలుగో నెంబర్‌లో వచ్చిన శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో అతడున్నంత సేపు రన్‌రేట్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఆరంభం నుంచే ఓపెనర్లు బౌండరీల వేట మొదలెట్టారు. ఇషాన్‌కు రెండో ఓవర్‌లోనే లైఫ్ లభించింది. గిల్ నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదగా.. తర్వాతి ఓవర్‌లో ఇషాన్ మరో రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అటు తొమ్మిదో ఓవర్‌లో వేగం పెంచుతూ గిల్ మూడు ఫోర్లతో 17 రన్స్ రాబట్టాడు. జోసెఫ్, షెఫర్డ్ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌తో ఇషాన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం గిల్ ఈ సిరీస్‌లో తొలి ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే 19వ ఓవర్‌లో 6,4తో దూకుడుగా కనిపించిన ఇషాన్ తర్వాతి ఓవర్‌లోనే కారియాకు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో దిగిన రుతురాజ్ (8) త్వరగానే వెనుదిరగ్గా.. శాంసన్ వచ్చీ రావడంతోనే రెండు సిక్సర్లతో బ్యాట్ ఝుళిపించాడు. ఎక్కువగా తనే స్ట్రయిక్ తీసుకుంటూ, 31వ ఓవర్‌లో 6,4తో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ ఆ వెంటనే షెఫర్డ్ ఓవర్‌లో పెవిలియన్‌కు చేరడంతో మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం విండీస్ స్పిన్నర్లు పట్టు బిగించడంతో మ్యాచ్‌లో వేగం తగ్గింది. దీనికి తోడు 37వ ఓవర్‌ను మెయిడెన్‌గా వేసిన స్పిన్నర్ మోటీ.. తర్వాతి ఓవర్‌లో కీలక గిల్ వికెట్‌ను తీశాడు. హార్దిక్ కాస్త నిదానంగానే ఆడగా, సూర్యకుమార్ (35) రాకతో డెత్ ఓవర్లలో భారత్ పుంజుకుంది. సూర్య 43వ ఓవర్‌లో 4,6.. 46వ ఓవర్‌లో మరో సిక్స్‌తో రెచ్చిపోయాడు. అతడి నిష్క్రమణ తర్వాత హార్దిక్ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో 6,4,6తో 18 రన్స్ రావడంతో స్కోరు 350 దాటింది.
స్కోరుబోర్డు
భారత్: ఇషాన్ (స్టంప్డ్) హోప్ (బి) కారియా 77, గిల్ (సి) కారియా (బి) మోటీ 85, రుతురాజ్ (సి) కింగ్ (బి) జోసెఫ్ 8, సంజూ శాంసన్ (సి) హెట్‌మయెర్ (బి) షెఫర్డ్ 51, హార్దిక్ (నాటౌట్) 70, సూర్యకుమార్ (సి) కారియా (బి) షెఫర్డ్ 35, జడేజా (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 50 ఓవర్లలో 351/5; వికెట్ల పతనం: 1-143, 2-154, 3-223, 4-244, 5-309; బౌలింగ్: సీల్స్ 8-0-75-0, మేయర్స్ 4-0-25-0, జోసెఫ్ 10-0-77-1, మోటీ 10-1-38-1, షెఫర్డ్ 10-0-73-2, కారియా 8-0-58-1.
విండీస్ గడ్డపై ఇరుజట్ల మధ్య
జరిగిన మ్యాచ్‌లో ఇదే అత్యధిక
స్కోరు (351).
అలాగే ఒక్కరూ సెంచరీ చేయకుండా భారత్
నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే.
కరీబియన్ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం అందించిన జోడీగా ఇషాన్-గిల్ (143). రహానె-
ధవన్ (132) ఫీట్‌ను అధిగమించారు.
మూడు వన్డేల సిరీ్‌సలో హ్యాట్రిక్
హాఫ్ సెంచరీలు సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా ఇషాన్.
Updated Date - 2023-08-02T04:58:30+05:30 IST