Viral Video: కష్టాలన్నీ నాకే అని బాధపడే వాళ్లంతా.. ఈ కుర్రాడి వీడియోను తప్పక చూడండి.. ఏ పరిస్థితుల్లో ఇక్కడిదాకా చేరుకున్నాడో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-06-02T18:34:46+05:30
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడో టీనేజర్. అతడు జీవితాంతం మంచానికే పరిమితమయ్యే అవకాశం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. కానీ, కుర్రాడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. పట్టువదలకుండా ప్రయత్నించి మళ్లీ నడక నేర్చుకున్నాడు. చేతికర్ర సాయంతో నడుస్తున్న అతడి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కష్టాలన్నీ నాకే ఎందుకని బాధపడే వాళ్లంతా తప్పక చూడాల్సిన ఓ యువకుడి వీడియో ఇది! అతడి వయసు ఇరవై కూడా దాటలేదు. అయితే, చేతి కర్ర లేకుండా అడుగు కూడా వేయలేని స్థితి అతడిది. కానీ, యువకుడి ముఖంలో చెరగని చిరునవ్వు..ఏదైనా చైయగలనన్న కాన్ఫిడెన్స్! ఇటీవలే పాఠశాల చదువు పూర్తి చేసుకున్న అతడు సగర్వంగా స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు చప్పట్లు కొడుతుండగా అతడు టీచర్ల చేతుల మీదుగా తన పట్టా తీసుకున్నాడు. చిన్న విషయాలకే బెంబేలు పడిపోయే వాళ్లు, కష్టాలన్నీ నాకే అంటూ కుమిలిపోయే వాళ్లున్న నేటి సమాజంలో ఈ యువకుడు ఎంతో మందికి ఆదర్శకంగా నిలుస్తున్నాడు. అతడి జీవితం గురించి తెలుసుకుంటే ఎవరిలోనైనా స్ఫూర్తి రగలకమానదు.
అమెరికాకు చెందిన నోబెల్ హాస్కెల్ ఓ అథ్లెట్. పరుగులో అతడికి అతడే సాటి. క్రాస్ కంట్రీ పరుగుంటే అతడికి ఎంతో ఇష్టం. ఈ క్రీడలో మనోడు మంచి పురోగతి సాధిస్తున్నాడు కూడా. కానీ, 2021లో అతడి జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు మంచానికే పరిమితమయ్యాడు. మెడ విరిగిపోవడంతో నడవలేని స్థితికి వచ్చేశాడు. ఇక అతడు ఎప్పటికీ సాధారణ వ్యక్తి కాలేకపోవచ్చని వైద్యులు తేల్చి చెప్పారు.
కానీ, భవిష్యత్తు ఎన్నడూ ఆశ కోల్పోని అతడు మళ్లీ నడిచేందుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. రెండేళ్ల పాటు రకరకాల ఎక్సర్సైజులు చేస్తూ వైద్యులు చెప్పిన సూచనలను యథాతథంగా పాటిస్తూ ప్రస్తుతం చేతి కర్ర సాయంతో నడిచే స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు, భవిష్యత్తులో ఆరోగ్యం మరింత మెరుగుపరుచుకుని క్రీడల్లో కూడా పాల్గొంటానని నోబెల్ చెప్పాడు. కాగా, చదువు పూర్తయిన సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో నోబెల్ కర్రతో నడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అతడి పోరాటపటిమ చూసి నెటిజ్లను ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated Date - 2023-06-02T18:34:49+05:30 IST