Plants in house: ఇంట్లో ఈ మొక్కలుంటే మనసునిండా పాజిటివిటీ.. ఎంతో ప్రత్యేకమైన మొక్కలివీ..
ABN, First Publish Date - 2023-03-26T16:37:07+05:30
మొక్కల పెంపకం మనసుకు ప్రశాంతతను చేకూర్చుతుంది. ఔట్‌డోర్ కావొచ్చు...
మొక్కల పెంపకం మనసుకు ప్రశాంతతను చేకూర్చుతుంది. ఔట్‌డోర్ కావొచ్చు... ఇండోర్ కావొచ్చు... గదిలోనైనా, ఆఫీస్ టేబుల్ మీదనైనా... ఒక మొక్కను చూడగానే మనసు నిండా పాజిటివిటీ నిండిపోతుంది. ఈ నేపథ్యంలో అటు ఆరోగ్యం... ఇటు అదృష్టం కలిసొచ్చే ఇండోర్ ‘కుబేర’ మొక్కలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోవకే చెందిన మనీప్లాంట్, బాంబూ, తులసి మొక్కల గురించి తెలుసు... పాపులర్ అవుతోన్న మరికొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం..
లక్కీ ప్లాంట్
అదృష్టాన్ని తీసుకువచ్చే మొక్కగా ‘జేడ్’ ప్రసిద్ధి చెందింది. ‘పాజిటివిటీ’ని పెంచే మొక్క కాబట్టి ఆ పేరు. ఎల్లప్పుడూ పచ్చని రంగు ఆకులతో అలరారే జేడ్ మొక్క ఇంట్లో ఉండడం వల్ల అదృష్టమే కాదు... సంపద కూడా పెరుగుతుందనే నమ్మకం ఉంది. పైగా ఈ మొక్క ఇంట్లోని కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. కాస్త సూర్యరశ్మి వచ్చే ప్రదేశంలో ఈ మొక్కను పెంచితే చాలు. అలా దానికదే పెరుగుతుంది. పెద్దగా నిర్వహణ అవసరం లేదు. జేడ్ మొక్క ఆకులు మందంగా, చిక్కని కండతో నాణేలను తలపిస్తాయి. గృహప్రవేశాలు, కొత్త వ్యాపారం ప్రారంభించేప్పుడు బహుమతిగా ఈ మొక్కల్ని అందిస్తారు. ఫెంగ్‌షూయి ప్రకారం మూడు అడుగులకు మించి పెరగకుండా చూసుకోవాలట. పడకగది, హాలు, డైనింగ్ ఏరియా, వంటగది, స్టడీ టేబుల్ మీద ఈ మొక్కను పెంచుకోవచ్చు.
ప్రేమకు గుర్తు
కొండంత నమ్మకం, చిగురంత ఆశ, ఉప్పెనంత ప్రేమ మీదే మానవ జీవితం ముడివేసుకుంది. ఆ మూడింటికీ గుర్తు ‘షామ్‌రాక్’ మొక్కలోని మూడాకులు అంటుంది ఐరిష్ సంప్రదాయం. ఐరిష్ పెళ్లిళ్లలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు తమ పూలబొకేలలో అదృష్టం కోసం ఈ మొక్క ఆకుల్ని ఉంచుకుంటారట. అంతేకాదు... చెడు దృష్టి తగలకుండా తమని కాపాడుతుందనే నమ్మకం వారిది. ఈ మొక్కనే మనం ‘పులి చింతాకు’గా పిలుస్తాం. అయిదు వందలకు పైగా రకాలున్న ఈ మొక్కలో పర్పుల్ షామ్‌రాక్ ‘లవ్ ప్లాంట్’గా పేరుతెచ్చుకుంది. మొదట్లో ఆకుపచ్చగా ఉండే ఆకులు... మొక్క పెరిగేకొద్దీ ఊదా రంగులోకి మారతాయి. ఈ విభిన్నమైన రంగే ఈ మొక్కను ఆకర్షణీయమైన ఇండోర్ ప్లాంట్‌గా మార్చింది. ఈ మొక్కకు ఔషధపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యశాస్త్రం పేర్కొంటోంది.
అన్నీ దూరం
‘ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే మీ జీవితమే మారిపోతుంద’ని వాస్తు శాస్త్రం, ఫెంగ్‌షూయీ కూడా పేర్కొంటున్నాయి. అదే ‘స్నేక్ ప్లాంట్’. శాస్త్రపరంగా ‘సాన్‌సేవీరా’గా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు మెలికలు తిరిగి ఉండడం వల్ల ‘అత్తగారి నాలుక’ అనే పేరు తెచ్చుకుంది. పొడవుగా, పదునుగా ఉండే ఆకులు కత్తిలా ఉండి దుష్టశక్తులను చెండాడుతాయని భావిస్తారు. 2 నుంచి 4 అడుగుల పొడవు పెరిగే ఈ మొక్కకి పసుపు చారల ఆకులు ఉండడం విశేషం. మలినాలను పీల్చుకుని మంచి గాలులను విడుదల చేసే మొక్కగా స్నేక్ ప్లాంట్ ప్రసిద్ధి చెందింది. రాత్రిళ్లు కూడా కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దుమ్ము, ధూళి వల్ల కలిగే ఎలర్జీలను కూడా నివారిస్తుంది. ఆస్తమా ఉన్న వాళ్లకీ మంచిదే.
సుఖ నిద్రకు...
ఏ గదిలో ఉంచినా కూడా మనశ్శాంతిని అందించే గుణం ఉన్న మొక్క ‘పీస్ లిలీ’. అయితే ఇది బెడ్‌రూమ్ మొక్కల్లోనే ప్రముఖమైనదిగా పేరుతెచ్చుకుంది. కిటికీ పక్కనే ఈ మొక్కని పెట్టడం వల్ల గాలిలోని కాలుష్య రేణువుల్ని తొలగించి మంచి గాలిని అందిస్తుంది. సాధారణంగా మనం ఇళ్లలో వినియోగించే వార్నిష్‌లు, పెయింట్‌లు, నెయిల్ పాలిష్ తదితరాల్లో అసిటోన్, ఆల్కహాల్ ఉంటాయి. ఈ వాసనలకు తలనొప్పి, లో బీపీ లాంటి సమస్యలు ఏర్పడతాయి. పీస్ లిలీ ఇలాంటి గాఢమైన వాసనల్ని పీల్చుకుని ఇంటికి రక్షణగా నిలుస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న వారికి చక్కని ఇండోర్ ప్లాంట్ ఆప్షన్ పీస్ లిలీ. ముదురు ఆకుపచ్చ ఆకులు, తెల్లని పూలతో చూడడానికి అందంగా కనిపిస్తుందీ మొక్క. వారానికి ఓసారి నీళ్లు పోసినా చాలు చక్కగా పెరుగుతుంది.
పూల రారాణి
అనాదిగా చైనా చక్రవర్తులు ‘పియోనీ’ పూలని శుభసూచకంగా భావించేవారు. సాహసం, గౌరవం, అదృష్టాన్ని తెచ్చే మొక్కగా పియోనీని జపనీయులు ఈనాటికీ నమ్ముతారు. పియోనీలను ‘క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్’గా పేర్కొంటారు. గుబురుగా పురివిప్పినట్టుగా విచ్చుకునే పియోనీ పూలను చూడడంతో పాజిటివిటీ మనసులోకి ప్రవేశిస్తుంది. దాదాపు నలభై రకాల జాతులున్న పియోనీలలో లేత గులాబీ రంగు పూలు పూసే మొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వివిధ తగవులతో సతమతమతున్న వాళ్లు పియోనీ మొక్కని తమ డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకోవడం మంచిది. ఇల్లాలి ఆరోగ్యానికి మేలు చేసే ఈ మొక్క ఇంట్లో సంతోషం, ప్రశాంతతను తీసుకువస్తుంది.
కాలుష్య నివారిణి
మన వాతావరణానికి సరిగ్గా సరిపోయే మొక్క రబ్బరు. బయటే కాదు ఇళ్లలో కూడా చక్కని పోషణ ఉంటే పదేళ్లకు పైగా బతుకుతుంది. అందాల మొక్కగానే కాదు... గాలిని శుద్ధి చేసే మొక్క ఇది. అందుకే కాలుష్య నివారిణిగా పేరు తెచ్చుకుంది. వ్యాపారంలో పైకి రావడానికి, అభివృద్ధి చెందడానికి రబ్బరు మొక్కలు దోహదపడతాయని వాస్తుశాస్త్రం కూడా పేర్కొంటోంది. అటవీ ప్రాంతంలో వంద సెంటిమీటర్ల పొడవు దాకా రబ్బరు చెట్లు పెరుగుతాయి. అయితే ఇండోర్‌లో పెంచేప్పుడు ఎప్పటికప్పుడు వాటిని కట్ చేస్తూ ఉండాలి. ఇంట్లో ఏ ప్రదేశంలో అయినా కాస్త కేర్ తీసుకుంటే హాయిగా బతికేస్తుందీ రబ్బరు మొక్క. దీని దళసరి ఆకుల వల్ల ఇంటికి వచ్చే అందమే వేరు.
మరింత ఆక్సిజన్ కోసం...
ఆక్సిజన్ స్థాయిని పెంచే గృహాలంకరణ మొక్క ‘అరెకా పామ్’. అన్ని మొక్కల్లా కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకున్నా కూడా మరింత ఆక్సిజన్‌ను విడుదల చేసే గుణం దీని ప్రత్యేకత. గాలిలోని విషవాయువులు, కాలుష్యం, రకరకాల ధూళిని పీల్చుకుని చక్కని ఎయిర్ ప్యూరిఫైయర్‌గా ఈ మొక్క పనిచేస్తుంది. ఇది పెట్ ఫ్రెండ్లీ కూడా. పెంపుడు జంతువులకు ఎలాంటి హాని కలిగించదు. కాకపోతే ఈ మొక్క నిర్వహణకు కాస్త కష్టపడాలి. చక్కటి వెలుతురు, పోషణ ఉంటేనే ఇళ్లలో పెరుగుతుంది. ఆక్సిజన్ కోసం ఆ మాత్రం కష్టపడాల్సిందే కదా.
Updated Date - 2023-03-26T17:35:14+05:30 IST