Young Millionaire: రిస్క్ అని తెలిసీ ఐఐటీ చదువుకు మధ్యలోనే గుడ్‌బై.. ఆ తరువాత 5 నెలల్లోనే రూ.256 కోట్లు సంపాదన.. !
ABN, First Publish Date - 2023-06-18T17:21:23+05:30
రిస్క్ అని తెలిసీ ఐఐటీ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిన ఓ యువకుడు చివరకు తన కలను నిజం చేసుకున్నాడు. చిన్న వయసులోనే కోటీశ్వరుడైపోయాడు. నెటి యువత దూకుడుకు అసలైన ఉదాహరణగా నిలుస్తాడు రాహుల్ రాయ్.
ఇంటర్నెట్ డెస్క్: నేటి యువత చాలా డిఫరెంట్! ఉద్యోగాల వెనుక పరుగులు తీయకుండా తమసొంత కాళ్లపై నిలబడుతూ చిన్న వయసులోనే కోటీశ్వరులైపోతున్నారు. దేశంలో స్టార్టప్ సంసృతి పెరుగుతుండటమే ఇందుకు మంచి ఉదాహరణ. అభిరుచిని ఆదాయవనరులుగా మార్చుకునేందుకు నెటి యువత అస్సలు వెనకాడదు. ఎంతటి రిస్క్ అయినా తీసుకునేందుకు వెనకాడరు. మనం చెప్పుకోబోయే రాహుల్ రాయ్(Rahul Rai) ఇదేది తీరు. బంగారం లాంటి ఐఐటీ చదువును మధ్యలోనే ఆపేశాడు. ఆ తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా కోటీశ్వరుడైపోయాడు.
రాహుల్ రాయ్ చిన్నప్పటి నుంచీ చదువులో టాప్. అందుకే అత్యంత క్లిష్టమైన ఐఐటీ జేఈఈ ఎగ్జామ్‌లో విజయం సాధించాడు. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ సీటు దక్కించుకున్నాడు. కానీ ఆ తరువాత రాహుల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇంజినీరింగ్ చదువు తన అభిరుచికి తగినది కాదని భావించిన అతడు 2015లో ఐఐటీ చదువుకు గుడ్‌బై చెప్పేశాడు. ఆ తరువాత తనకిష్టమైన ఆర్థికశాస్త్రంలో కాలుపెట్టాడు. 2019లో ప్రఖ్యాత వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా సాధించాడు. ఆ తరువాత ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మోర్గన్ స్టాన్లీలో కాలుపెట్టాడు. అక్కడ ఏడాది పనిచేశాక తన కలను నిజం చేసుకునేందుకు మళ్లీ ఇండియాకు తిరిగొచ్చేశాడు.
అప్పటికే ప్రపంచంలో క్రిప్టో ట్రెండ్ కొనసాగుతోంది. దీన్నే తన అవకాశంగా రాహుల్ మలుచుకున్నాడు. కొందరు స్నేహితులతో కలిసి క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు గామా పాయింట్ క్యాపిటల్ పేరిట ఓ హెడ్జ్ ఫండ్‌ను నెలకొల్పాడు. మోర్గన్ స్టాన్లీలో తన ఉద్యోగఅనుభవం ఆధారంగా కంపెనీని లాభాల బాట పట్టించాడు. దీంతో, ఆ రంగంలో రాహుల్ పేరుప్రఖ్యాతులు ఇనుమడించాయి.
ఈ క్రమంలోె, సంస్థ నెలకొల్పిన ఐదు నెలలకే ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్లాక్ టవర్ క్యాపిటల్ నుంచి ఊహించని కబురు వచ్చింది. రాహుల్ కంపెనీని టేకోవర్ చేస్తామని ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు ఏకంగా రూ. 256 కోట్లు ఆఫర్ చేసింది. మునుపెన్నడూ రాహుల్ ఊహించని ఆఫర్ ఇది. అప్పటికి తన ముందు రెండే దార్లు. విలీనం ఆఫర్ తోసిపుచ్చుతూ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లడం లేదా ఆ కంపెనీ ఇచ్చిన ఆఫర్‌కు అంగీకరించడం!
ఈ కఠిన సమయంలో రాహుల్ రాయ్ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించాడు. తన సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించాలనుకున్నాడు. అంతే..మరో ఆలోచన లేకుండా తన కంపెనీని బ్లాక్ టవర్‌లో విలీనం చేశాడు. దీంతో, రాహుల్‌తో పాటూ కంపెనీ సహ వ్యవస్థాపకులు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు. అంతేకాదు.. ఫోర్బ్స్ పత్రిక రూపించిన యువ మిలియనీర్ల ‘30 అండర్ 30’ జాబితాలోనూ రాహుల్ చోటుదక్కించుకున్నాడు.
Updated Date - 2023-06-18T17:24:39+05:30 IST