ఈ తల్లి కష్టం చూడండి.. అమ్మ ప్రేమ అంటే ఇదే.. ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో వైరల్
ABN, First Publish Date - 2023-03-12T18:20:07+05:30
తన పిల్లల కోసం ఓ తల్లి కోడి పడుతున్న ఆరాటం నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తోంది. తల్లి ప్రేమ అంటే ఏంటో చూపిస్తున్న ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలపై తల్లులకు ఉండే ప్రేమానురాగాలకు అంతే ఉండదు. తన పిల్లల బాగుకోసం తల్లి ఎంతటి త్యాగానికైనా వెరవదు. మనుషులే కాదు పశుపక్షాదులూ తమ పిల్లల క్షేమం కోసం అహరహం శ్రమిస్తాయి. ఇక పిల్లల్ని కాపాడే క్రమంలో తల్లి జంతువులు ప్రాణాలు పోగొట్టుకున్ ఉదంతాలు సోషల్ మీడియాలో పలు మార్లు వైరల్ అయ్యాయి. తాజాగా తన పిల్లల కోసం ఓ తల్లి కోడి పడుతున్న ఆరాటం నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తోంది. తల్లి ప్రేమ అంటే ఏంటో చూపిస్తున్న ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఐఏఎస్ అధికారి డా.సుమితా మిశ్రా దీన్ని షేర్ చేశారు. ఈ వీడియో.. తల్లి కోడి తన పిల్లలు వర్షంలో తడవకుండా ఉండేందుకు వాటిల్ని తన రెక్కల కింద దాచింది. వానకు తను తడిసి ముద్దవుతున్నా పట్టించుకోకుండా ఆ కోడి.. పిల్లలు తడవకుండా చాలా జాగ్రత్తగా తన రెక్కలను అడ్డుపెట్టింది(Hen hides chicks under wings). క్షణం కూడా పక్కకు జరగుకుండా పిల్లల కోసం అలాగే నిలబడిపోయింది(Hen shielding babies from rain). ‘‘అమ్మ అంటే ఇదే.. మనుషుల్లోనైనా పశుపక్షాదుల్లోనైనా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది’’ అంటూ డా. సుమిత ఓ కామెంట్ కూడా జతచేశారు.
ఇక ఈ వీడియో ఎంతగా వైరల్ అవుతోందో(Viral Video) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ వీడియోకు 99 వేలకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. తల్లి కోడి పడుతున్న కష్టం చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఏదీ లేదని పలువురు వ్యాఖ్యానించారు. బిడ్డ కోసం తన ప్రాణాలను సైతం అడ్డువేయగలిగే త్యాగశీలికి కోటి దణ్ణాలు అంటూ మరికొందరు రాసుకొచ్చారు.
Updated Date - 2023-03-12T18:20:33+05:30 IST