Success Story: ఒకే ఒక్క ప్రశ్న.. ఇతడి లైఫ్‌నే మార్చేసింది.. పాత ఫోన్‌లతోనే ఏకంగా రూ.50 కోట్ల వ్యాపారం..!
ABN, First Publish Date - 2023-09-04T19:30:40+05:30
గ్రామీణుల అవసరాన్ని అవకాశంగా మలుచుకున్న ఓ ఢిల్లీ వ్యాపారవేత్త కోట్లకు పడగలెత్తాడు. కేవలం రెండేళ్లలోనే తన కంపెనీని ఏటా రూ.50 కోట్ల టర్నోవర్‌కు చేర్చాడు
ఇంటర్నెట్ డెస్క్: అది దేశవిభజన నాటి కాలం. సంపన్నుడైన ఓ వ్యక్తి బంగళా, కారు, డబ్బు అన్నీ పాకిస్థాన్‌తో వదిలేసి భార్యాపిల్లలతో కలిసి ఇండియా వచ్చేశారు. నానా కష్టాలు పడి తన పదకొండు మంది సంతానాన్ని పెంచి పెద్ద చేశాడు. తాను అష్టకష్టాలు పడ్డా పిల్లలకు మాత్రం ఏ లోటూ రానీయలేదు. అప్పుడు ఆయన పడ్డ కష్టం, నాటి విత్తనం నేడు ఫలవంతమైంది. ఆయన మనవడు ప్రస్తుతం ఏటా రూ.50 కోట్ల టర్నోవర్ గల వ్యాపారం నర్వహిస్తున్నాడు(Delhi Business man Neeraj Chopra's Success Story). ఆయనే నీరజ్ చోప్రా.
నీరజ్ చోప్రా తన తాత కష్టాలను తండ్రి ద్వారా విన్నాడు. తండ్రి కష్టాలను ప్రత్యక్షంగా చూస్తూ పెద్దవాడయ్యాడు. అప్పట్లో నీరజ్‌కు పద్ధెనిమిదేళ్లు నిండగానే అతడిని తండ్రి హాంగ్‌కాంగ్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ నీరజ్ తండ్రి ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తుండేవాడు. అలా తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు వెళ్లిన నీరజ్ చైనాతో వ్యాపారంలో అనేక మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంప మంచి పట్టుసాధించాడు. కానీ, భారత్‌లో నీరజ్ పెదనాన్న చనిపోవడంతో అతడు భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల హాంగ్‌కాంగ్ బిజినెస్‌కు స్వస్థి పలకాల్సి వచ్చింది.
ఇక 2014-15 కాలంలో భారత్ క్రమంగా ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లడం ప్రారంభించింది. దీంతో, జనాలకు పవర్ బ్యాంకుల అవసరం పెరిగింది. ఈ అవసరాన్ని వ్యాపారావకాశంగా మలుచుకున్న నీరజ్ పవర్ బ్యాంకుల దిగుమతులవైపు మళ్లాడు. ఆ వ్యాపారం సుమారు అయిదేళ్ల పాటు కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఆయన సెకెండ్ హ్యాండ్ ఫోన్లకు ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలతో పాటూ గ్రామాల్లో డిమాండ్ ఉన్నట్టు గుర్తించారు. అయితే, పవర్ బ్యాంకు వ్యాపారం అనుకున్న స్థాయికి చేరుకోక మునుపే నోట్ల రద్దు అతడి నడ్డి విరిచింది. డబ్బు రాకడ నిలిచిపోవడంతో లక్షల రూపాయల కస్టమర్ల నుంచి వసూలు కాక నష్టాలు వచ్చాయి.
దీంతో, నీరజ్ చూపు పాత మొబైల్ ఫోన్ల వైపు మళ్లింది. స్మార్ట్ ఫోన్లు పాతవయ్యాక ఏమవుతాయోననే ప్రశ్న అతడి మదిలో ఓ ప్రశ్న మెదిలింది. అవన్నీ రకరకాల మార్గాల్లో తిరిగి ఆ యా సంస్థలకే చేరుతాయని నీరజ్ తెలుసుకున్నాడు. కొన్ని ఈ కామర్స్ సంస్థలు పాత వాటిని రిపేర్ చేసి తిరిగి మార్కెట్లో అమ్ముతుంటాయని కూడా గుర్తించాడు. కానీ వాటి కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల వరకూ చేరుకోకపోవడంతో అతడికి మరో అద్భుత వ్యాపారావకాశం కనిపించింది.
అలా పుట్టిందే జోబాక్స్(Zobox) కంపెనీ. తొలుత ఆయన పాత మొబైల్ ఫోన్లనుఈ కంపెనీలో రిపేర్ చేసి(Old mobile phone refurbished) ఫ్రాంచైజ్ మోడల్‌లో చిన్న చిన్న షాపుల ద్వారా విక్రయించే వారు. అయితే, ఖరీదైన ఫోన్లు అమ్ముడుపోకపోవడంతో ఆయనకు నష్టం వచ్చింది. ఇలా పనికాదని ఆయన తన వ్యాపార విధానాన్ని మార్చేశారు. అటుపై కేవలం హోల్‌సేలర్లకు మాత్రమే తన ఫోన్లు విక్రయించడం ప్రారంభించారు. ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో బిజినెస్ ఊపందుకుంది. తొలుత జోబాక్స్స్‌కు రోజుకు కేవలం 100 ఫోన్లకు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. కానీ రెండేళ్లు తిరిగేసరికల్లా రోజుకు 25 వేల ఫోన్ల టర్నోవర్‌కు చేరుకున్నారు. ఏటా కంపెనీ టర్నోవర్ రూ.50 కోట్లకు దాటింది.
గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలో రూ.15 వేలో సంపాదించేవారు ఖరీదైన బ్రాండెడ్ ఫోన్లను కొనలేరని నీరజ్ చోప్రా చెప్పారు. అలాంటి వారు సెకెండ్ హ్యాండ్ ఫోన్లపై మక్కువ చూపుతారని, వారే తమకు అతిపెద్ద మార్కెట్ అని నీరజ్ చెప్పుకొచ్చారు. తాము ఫోన్లు రిపేర్ చేశాక, మళ్లీ రెండేళ్ల పాటు గ్యారెంటీపై విక్రయిస్తామని వివరించారు. రిపేర్ల కోసం కావాల్సిన విడిభాగాల్లో కొన్నింటిని విదేశాల నుంచి కూడా తెప్పిస్తామని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-09-04T19:36:02+05:30 IST