జీపీఎస్ గర్ల్
ABN, First Publish Date - 2023-03-12T09:42:53+05:30
స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, డైరెక్షన్స్ పెట్టుకుని వెళుతున్నప్పుడు ‘20 మీటర్స్......
స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, డైరెక్షన్స్ పెట్టుకుని వెళుతున్నప్పుడు ‘20 మీటర్స్... టేక్ లెఫ్ట్’, ‘రీచ్డ్ యువర్ డెస్టినేషన్’ అంటూ దారి విశేషాలు చెప్పే తియ్యని గొంతు ఎవరిదో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా వినిపించే ఆ గొంతు ఆస్ట్రేలియాకు చెందిన కారెన్ జాకబ్సన్‌ది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగానే కాకుండా రైటర్‌గా, సింగర్‌గా గుర్తింపు పొందిన కారెన్ విశేషాలు ఇవి...
ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) యూనిట్లు, 30 కోట్ల స్మార్ట్‌ఫోన్ డివైజ్‌లలో కారెన్ గొంతు వినిపిస్తోంది. అందుకే ఆమె ‘జీపీఎస్ గర్ల్’గా బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియాలోని ‘మాకే’ నగరంలో జన్మించిన కారెన్ ఏడేళ్ల వయసులోనే పాటలు రాసేది. ప్రముఖ గాయని ఒలీవియా న్యూటన్ జాన్‌ను స్ఫూర్తిగా తీసుకుంది. సంగీతంలో పట్టా పుచ్చుకుంది.
2002లో కారెన్‌కు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆమెరికాలోని ఒక సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన మహిళా వాయిస్ ఓవర్ ఆర్టిస్టు గొంతు కావాలని వెతుకుతోంది. కారెన్ గురించి తెలిసి ఆ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఫోన్ చేశారు.
కారెన్ ఆ ఉద్యోగంలో చేరాక 50 గంటల పాటు తన మాటలు రికార్టు చేసి జీపీఎస్ కోసం వాయిస్ సిస్టమ్‌ను తయారుచేశారు. ప్రస్తుతం ఏ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినా వినిపించేది తన గొంతే. కార్లలో ఉండే జీపీఎస్ సిస్టమ్‌లోనూ కారెన్ గొంతే వినిపిస్తుంది.
కారెన్ గొంతు జీపీఎస్‌లోనే కాకుండా ఇంకా అనేక చోట్ల వినిపిస్తుంది. ఏలివేటర్స్, క్రూయిజ్ షిప్‌లు, సినిమా థియేటర్స్, హోటల్స్, ఆడియో బుక్స్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లలోనూ ఆమె గొంతు వినిపిస్తుంది. యాపిల్‌కు చెందిన డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘సిరి’ని ఆస్ట్రేలియాలో పలకరిస్తే వినిపించేది కారెన్ గొంతే.
కారెన్ తనకొచ్చిన గుర్తింపుతో కాన్ఫరెన్స్‌లలో, ఈవెంట్లలో స్పీకర్‌గానూ పాల్గొంటూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్పీకర్‌గానూ, కన్సర్ట్ ఫర్‌ఫార్మర్‌గానూ రాణిస్తున్నారు.
కారెన్ స్వయంగా పాటలు రాసి, పాడతారు. ఆమె విడుదల చేసిన ఆల్బమ్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. పాటలను తన యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు.
జీపీఎస్ అవకాశం రాక ముందు టెలివిజన్, రేడియో కార్యక్రమాల కోసం కారెన్ తన గొంతును అందించారు. బ్రిస్బేన్, సిడ్నీ నగరాల్లోని స్టూడియోల్లో జింగిల్స్ పాడేవారు.
Updated Date - 2023-03-12T09:43:42+05:30 IST