NRI: బ్రిటన్‌లో షాకింగ్ ఘటన.. ఆసుపత్రిలో సిక్కు వృద్ధుడిపై నర్సుల జాత్యాహంకారం
ABN, First Publish Date - 2023-10-02T21:59:02+05:30
బ్రిటన్‌లో జాత్యాహంకారానికి సంబంధించి తాజాగా ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మరణశయ్యపై ఉన్న ఓ సిక్కు వృద్ధుడిపై ఆసుపత్రిలోని నర్సులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. ది ఇండిపెండెంట్ పత్రిక గత వారం ఈ సంచలన కథాన్ని ప్రదర్శించింది.
ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో జాత్యాహంకారానికి (Racism) సంబంధించి తాజాగా ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మరణశయ్యపై ఉన్న ఓ సిక్కు వృద్ధుడిపై (Old sikh man) ఆసుపత్రిలోని నర్సులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. ఆయన గడ్డాన్ని గ్లోవ్స్‌తో కట్టి, తగని సపర్యలు చేయకుండా మూత్రంలోనే వదిలేసి నరకం చూపించారు. మతపరమైన కారణాల వల్ల ఆయన తినకూడదని ఆహారాన్ని అందించారు. నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో (NMC) చెందిన ఓ కీలక డాక్యుమెంట్‌లోని సమాచారం ఆధారంగా ది ఇండిపెండెంట్ పత్రిక గత వారం ఈ సంచలన కథాన్ని ప్రదర్శించింది.
ఈ కథనం బ్రిటన్‌లో ఒక్కసారిగా కలకలం రేపడంతో నర్సింగ్ కౌన్సిల్ దర్యాప్తునకు ఆదేశించింది. ఎన్‌ఎంసీలోని కీలక వ్యక్తి ఈ ఘటనపై పత్రికకు గోప్యంగా సమాచారం అందించారు. జాత్యాహంకారం 15 ఏళ్లుగా వ్యవస్థీకృతమైనా ఎన్‌ఎంసీ తన సిబ్బందిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలను సిబ్బంది తమ అభిప్రాయాలకు అనుగుణంగా అన్వయించే వారని చెప్పుకొచ్చారు. అయితే, ఘటన జరిగిన ఆసుపత్రి, బాధితుడి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. తను జాతివిద్వేషాన్ని ఎదుర్కొంటున్నానంటూ మరణశయ్యపై ఉన్న వృద్ధుడు ఓ నోట్‌లో అధికారికంగా పేర్కొన్నా సంబంధిత నర్సులు మాత్రం యథాతథంగా తన విధులు కొనసాగించారని పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ ధోరణులపై ఎన్‌ఎంసీ చర్యలు తీసుకోవాలని ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కోరినట్టు పత్రిక పేర్కొంది.
Updated Date - 2023-10-02T22:01:47+05:30 IST