ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dr. Narmada Reddy : 40 ఏళ్లలో... 178 దేశాలు తిరిగాం

ABN, First Publish Date - 2023-08-02T04:52:15+05:30

పెళ్లయ్యాక భార్యా భర్త కలిసి హనీమూన్‌కు వెళ్లడం సహజమే. కానీ ఆ తరువాతే ఎటూ కదిలే తీరిక ఉండదు వాళ్లకు. ఇల్లు, పిల్లలు, వాళ్ల చదువులు, బాధ్యతల్లో తలమునకలైపోతారు. కానీ నర్మదా రెడ్డి, ఇంద్రా రెడ్డి దంపతులు మాత్రం...

పెళ్లయ్యాక భార్యా భర్త కలిసి హనీమూన్‌కు వెళ్లడం సహజమే.

కానీ ఆ తరువాతే ఎటూ కదిలే తీరిక ఉండదు వాళ్లకు.

ఇల్లు, పిల్లలు, వాళ్ల చదువులు, బాధ్యతల్లో తలమునకలైపోతారు.

కానీ నర్మదా రెడ్డి, ఇంద్రా రెడ్డి దంపతులు మాత్రం... పెళ్లయిన నాటి నుంచి పర్యటిస్తూనే ఉన్నారు. నలభై ఏళ్ల ‘ప్రయాణం’ వారిది.

ఇప్పటికి 178 దేశాలు చుట్టొచ్చారు. ఏడు ఖండాలనూ సందర్శించారు.

ఈ సుదీర్ఘ యాత్రా విశేషాలను నర్మదారెడ్డి ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘ఒక విధంగా భూమి మీద నెలవైన ఏడు ఖండాలనూ చుట్టొచ్చాను. ప్రపంచంలోని ప్రాచీన, ఆధునిక వింతలను, సప్త సముద్రాలను చూసొచ్చాను. పారే నదిలా నిత్యం మేమూ ప్రయాణిస్తుండాలి. తద్వారా కొత్త ప్రదేశాలను, సరికొత్త సంస్కృతులను పరిచయం చేసుకోవటం అంటే చాలా ఇష్టం. అదే మమ్మల్ని 178 దేశాలు పర్యటించేలా చేసింది. మా యాత్రానుభవాలు మమ్మల్ని విశ్వమానవుల్ని చేశాయి. ఈ విదేశీ యానాలు మా ఆలోచనల విస్తృతిని పెంచాయి. మనసు పొరల్లో దాగిన అంతరాలను, అపోహలను తుడిచిపెట్టాయి. సాటి మనుషుల పట్ల ప్రేమానురాగాలను పెంచాయి. చైనాలోనూ పాకిస్తాన్‌లోనూ మనలాంటి మనుషులే ఉంటారనే సత్యాన్ని కళ్లకు కట్టాయి. ప్రపంచమనే కుటుంబంలో మనుషులమంతా తోబుట్టువులమనే స్పృహను కలిగించాయి మా పర్యటనలు. మమ్మల్ని ఇంతలా ప్రభావితం చేస్తూ, చలనంలో ఉంచుతున్న యాత్రాసక్తి నా చిన్నతనంలోనే మొదలైంది. అప్పటి నుంచి కొత్త ప్రదేశాలు సందర్శించడమంటే నాకు ఇష్టం. మా నాన్న బాల్‌రెడ్డి ఆర్మీ అధికారి కావడంతో బదిలీల పుణ్యమా దేశమంతా తిరిగేవాళ్లం. బహుశా అలా నాలో అభిరుచి మొదలైంది అనుకుంటా. నాకు ఇంటర్‌లోనే ఇంద్రారెడ్డితో పెళ్లి అయింది.

ఆయన నిర్మాణరంగ వ్యాపారి. అయినా, కొత్త ప్రదేశాలు చూడటమంటే నా భర్తకు కూడా చాలా ఇష్టం. ఇరువురి అభిరుచి ఒక్కటే కావడంతో, ఎక్కడికెళ్లినా కలిసే వెళతాం. నలభై ఏళ్ల కిందటే హనీమూన్‌ పేరుతో బెంగళూరు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలన్నీ తిరిగాం. తర్వాత భారతదేశంలోని దాదాపుగా అన్నీ రాష్ట్రాలు సందర్శించాం. అదే సమయంలో బ్యాంకాక్‌తో మా తొలి విదేశీ ప్రయాణం ప్రారంభమైంది. అది మొదలు ఒక్క కరోనా కాలం మినహా మరెన్నడూ మా యాత్రలు ఆగలేదు. మాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. ఓ వైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ చదువునూ కొనసాగించాను. డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ పూర్తి చేశాను. గాయనిగా, ఇంకోవైపు ఫ్యామిలీ కౌన్సెలర్‌గానూ వ్యవహరిస్తూ నా భర్తతో కలిసి దేశాలు పర్యటించాను. నేను, నా భర్త కలిసి సందర్శించినన్ని దేశాలు బహుశా మరే జంట చూసుండదేమో!

అంటార్కిటికా ప్రయాణం...

పెళ్లి అయిన నాటి నుంచి ప్రతి మూడు నెలలకొకసారైనా పర్యాటకానికి వెళ్లడం మా జీవితంలో భాగమైంది. ప్రపంచంలోనే అత్యధిక రైల్వే లైన్‌ ట్రాన్స్‌ సైబేరియన్‌లో మాస్కో నుంచి మంగోలియా మీదగా చైనాకు ఆరు రోజులు ప్రయాణించడం... అందులోనే భిన్నమైన ఎనిమిది టైమ్‌ జోన్లను చూడటం ఓ మధురానుభూతి. అంటార్కిటికా వెళ్లడం నాకు లభించిన అరుదైన అవకాశం. నిజానికి అదొక పెద్ద సాహస యాత్ర. అక్కడ కార్‌విల్లా దీవిలో కిల్లర్‌ వేల్స్‌ (తిమింగళాలు)ను చూడటం, పోర్ట్‌లాక్‌రారు 36 అడుగుల ఎత్తైన మంచు కొండ ఎక్కడం, ఇస్పరాంజా దీవి సందర్శన... ఇలా ఒక్కటికాదు అంటార్కిటికా ప్రయాణం నాకు బోలెడన్ని జ్ఞాపకాలను ఇచ్చింది.


విశ్వమానవ ప్రేమతత్వం...

ఓసారి మా ఆయనతో కలిసి గ్రీస్‌ వెళ్లినప్పుడు... పొరపాటున మా సూట్‌కేసులన్నీ మరో దేశానికి వెళ్లాయి. మా వెంట హ్యాండ్‌ బ్యాగ్‌ ఒక్కటే మిగిలింది. అందులో రెండు జతల వస్త్రాలు, ఖర్చులకు డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో అక్కడే స్థిరపడిన ఓ బంగ్లాదేశ్‌ అబ్బాయి పరిచయం అయ్యాడు. మేము అక్కడున్న ఆరు రోజులు అతనే దగ్గరుండి మరీ మాకు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపించాడు. అంతేకాదు, వరి అన్నం తినకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది అక్కడ ఇండియన్‌ ఫుడ్‌ దొరక్కపోవడంతో అప్పటికి అన్నం తిని నాలుగు రోజులవుతుంది. మరి నా బాధ అతనికెలా అర్థమైందో కానీ, ఓ రోజు మా కోసమే చికెన్‌ బిర్యానీ వండించి తీసుకొచ్చాడు. అది చూసిన నాకు ప్రాణం లేచివచ్చినట్టు అయింది. ఇవాల్టికి రోజూ అన్నం తినేప్పుడు బంగ్లాదేశ్‌ అబ్బాయిని జ్ఞాపకం చేసుకుంటుంటా. మరో సందర్భంలో కుటుంబమంతా కలిసి నార్వే వెళ్లినప్పుడు... చికెన్‌ షాపు దగ్గర పరిచయమైన ఓ పెద్దాయన, మమ్మల్ని భోజనానికి పిలిచాడు. ‘ఆ... ఏం వెళతాంలే’ అనుకొని మా పాటికి మేము ఉంటే, మరుసటి రోజు హోటల్‌కు వచ్చి మరీ మమ్మల్ని వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే దూర ప్రాంతాల్లో ఉంటున్న ఆయన పిల్లలను కూడా పిలిపించాడు. అక్కడికెళ్లాక తెలిసింది, మమ్మల్ని తన పిల్లలకు పరిచయం చేస్తూ, ‘కుటుంబమంటే వీరిలా కలిసి మెలిసి ఉండాలి’ అని చూపించడం కోసమే ఆహ్వానించాడని. మా పట్ల అంత ఆప్యాయత కనబరిచిన ఆ పెద్దాయన పుట్టి, పెరిగిందంతా పాకిస్తాన్‌లో అని తర్వాత మాకు తెలిసింది. మరో సందర్భంలో చైనాలోని టెర్రకోట ఆర్మీ బొమ్మలను చూసేందుకు వెళ్లినప్పుడూ గమ్మత్తైన అనుభవం ఎదురైంది. అక్కడ ఇంగ్లీషు వచ్చిన వాళ్లు ఒక్కరూ కనిపించక చాలా అవస్థ పడుతున్న మాకు కొద్దిగా ఆంగ్లాన్ని అర్థం చేసుకోగలిగిన ఒక కుర్రాడు పరిచయం అయ్యాడు. అతను మాకు ఆ ప్రదేశమంతా చూపించడమేగాక, హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ ట్రీట్‌ ఇచ్చిమరీ వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌, చైనా అనగానే అవి మన శత్రు దేశాలని, ఆయా దేశస్తులంతా క్రూరులని, దుర్మార్గులని అపోహ పడుతుంటాం. నిజానికి మా యాత్రానుభవాలన్నీ విశ్వమానవ ప్రేమతత్వాన్ని కళ్లకు కట్టాయి.

వాళ్లను చూసి చాలా నేర్చుకోవాలి

ఇప్పటికి నేను వెళ్లిన దేశాలలో చాలా వరకు నాకు నచ్చింది, నన్ను అమితంగా ఆకట్టుకున్నవి అంటే... మరుగుదొడ్ల పరిశుభ్రత, స్థానికుల సివిక్‌ సెన్స్‌. నిరుడు అనుకుంటా, కొలంబియా అటవీ మార్గం గుండా జీపులో వెళుతున్నప్పుడు... చిన్న చాక్లెట్‌ రేపర్‌ను బయటకు విసిరేశా. అంతే... అది గమనించిన డ్రైవర్‌, జీపును కిలోమీటరు వెనక్కి మళ్లించి మరీ ఆ రేపర్‌ తీసి జేబులో వేసుకోవడం చూసి గిల్టీగా ఫీలయ్యాను. పరిసరాల పరిశుభ్రతకు వాళ్లిచ్చే విలువ అలాంటిది మరి. పాతికేళ్ల కిందటే ప్యారి్‌సలో తడిచెత్త పొడిచెత్త కాన్సెప్టు చూశాను. చెత్తబుట్ట అందుబాటులో లేని సమయాల్లో పిల్లల ముక్కు చీదిన నేప్కిన్స్‌ను కూడా తల్లితండ్రులు హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచడం చూసి, బయట దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉందనుకున్నాను.

తక్కువ ఖర్చుతో ...

మేము 45 ఏళ్లుగా విదేశీ యాత్రలకు వెళుతున్నాం. ఇంటర్నెట్‌ లేని రోజుల్లో అయితే, ముందుగా మేము వెళ్లే దేశం చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలన్నీ కొని చదివేవాళ్లం. టూర్‌ ప్యాకేజీలు చూసి ఎంపిక చేసుకుంటాం. విమానం టికెట్లును ఆరు నుంచి మూడు నెలల ముందు బుక్‌ చేయడంతో వాటిల్లోనూ కొంత రాయితీ లభిస్తుంది. మా ప్రతి ప్రయాణం పక్కా ప్రణాళికతో కూడినది కనుక వీలైనంత తక్కువ ఖర్చుతో వెళ్లి వస్తాం. అంతెందుకు, ఒక్కొక్కరికి 16వేల రూపాయలతో ఐర్లాండ్‌ వెళ్లివచ్చాం. నార్వే, స్కాట్లాండ్‌ తదితర దేశాలలో 14 రోజుల పర్యాటకానికి మాకు అయిన ఖర్చు రూ.48వేలు మాత్రమే. ఇలా వీలైనంత తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ప్రదేశాలు తిరిగివచ్చేలా ప్లాన్‌ చేసుకుంటాం.

అక్కడ ఇల్లరికం వెళతారు

ప్రకృతి సౌందర్యారాధన ఒక్కటే మా విదేశీ పర్యాటకాల ప్రధాన ఉద్దేశం కాదు. మేమెళ్లిన ప్రతి దేశంలోని ప్రత్యేక సందర్శనీయ స్థలాలతో పాటు స్థానికుల సంస్కృతి, జీవన విధానం తెలుసుకుంటాం. అలా ఉత్తర ఆఫ్రికాలోని నమీబియా దేశం వెళ్లినప్పుడు... అడవుల్లోని గిరిజన తెగలతో కలిసి ఒక రోజు గడిపాం. రెండు లక్షల జనాభా కలిగిన ఆ ప్రాంతంలో ఇవాల్టికి స్త్రీ, పురుషులంతా ఆకులు, జంతు చర్మాలనే వస్త్రాలుగా ధరించడం చూసి బాధేసింది. వారంతా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోడానికి అనువుగా ఒంటికి రోజూ ఎర్రమట్టి పూసుకుంటారు. మలేషియా దగ్గరలోని ఓ చిన్న దీవిలో అయితే మన ఆచారానికి పూర్తి భిన్నంగా వివాహమయ్యాక అబ్బాయిలు ఇల్లరికం వెళ్లడం చూస్తాం. ఇజ్రాయిల్‌లో 18 నుంచి 20 ఏళ్ల మధ్య అమ్మాయిలందరికీ రైఫిల్‌లో శిక్షణ ఇస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, విశేషాలను తెలుసుకోవడం మా యాత్రలో భాగం.

ప్రపంచాన్ని చుట్టిరావడమే లక్ష్యం

భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతాలే కాదు... శ్రీలంక, జర్మనీ, ఈజిప్టు, వియత్నాం, ఇజ్రాయిల్‌, ఇటలీ, టర్కీ, ఫిలిప్పీన్స్‌, కొరియా, అండమాన్‌ యుద్ధక్షేత్రాల్లో పర్యటించాం. అమెజాన్‌, నయాగరా, సిర్‌దారియా, తగూస్‌, జాంబేజీ, నైలునది తీరాలలో విహరించాం. స్పెయిన్‌లోని కానరీ ద్వీపాల మొదలు క్యూబా, పోర్టోరికో, సెయింట్‌ ఽథామస్‌, సెయింట్‌ మార్టిన్‌, కొలంబియా, పనామా ఇలా 500 ఏళ్ల కిందట క్రిస్టోఫర్‌ కొలంబస్‌ తిరిగిన దేశాలన్నింటినీ ఇప్పుడు మేము పర్యటించాం. అదొక ప్రత్యేకమైన అనుభూతి. అలా విదేశీ యాత్రలకు వెళ్లి రావడమేగాక ఆ అనుభవాలను పుస్తకాలుగానూ రాయడం నాకు అలవాటు. అలా ఇప్పటివరకు నాలుగు యాత్రా సంపుటాలు ప్రచురించాను. విదేశాల్లోని మా రైలు ప్రయాణ ముచ్చట్లతో ‘చుక్‌చుక్‌ రైల్లో మా యాత్ర’ పుస్తకం త్వరలో రానుంది. ప్రపంచంలోని 195 దేశాలలో ఇప్పటి వరకు 178 దేశాలను చుట్టొచ్చాం. మిగిలిన వాటిల్లో వెళ్లగలిగిన అన్ని దేశాలనూ వీలైనంత తొందరగా చూసి రావాలనేది మా కోరిక. కొందరికి డబ్బు కూడబెట్టడం జీవితాశయం అయితే, మాకు మాత్రం ప్రపంచాన్ని చుట్టిరావడమే ధ్యేయం.’’

ఆరోగ్యం - ఆహారం

ఇన్ని దేశాలు తిరగాలంటే డబ్బుకన్నా కూడా ప్రధానంగా కావాల్సింది ఆరోగ్యం. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌ ఆడటం నా రోజూవారీ జీవితంలో భాగం. ఇప్పటికి రోజుకి ఒక గంట బ్యాడ్మింటన్‌ ఆడతాను. కరోనా కాలంలో మాస్టర్స్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో భాగంగా స్పెయిన్‌లో ఆడాను. అంతకు ముందుగా గోవాలో జాతీయ స్థాయిలో ఆడి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాను. దీవులు, సముద్ర తీర ప్రాంతాలు, మంచు ప్రదేశాలు, కొండలు, పర్వతాలు, ఎడారులు... ఇలా ఏ ప్రాంతానికెళ్లినా, ఎంత ప్రయాణించినా బడలిక, అలసట లాంటివి అనిపించవు. బహుశా.! నా బ్యాడ్మింటన్‌ ప్రాక్టీసే అందుకు కారణం కావచ్చు. మేము ఎక్కడికి వెళ్లినా బియ్యం, చింతపండు, ఉప్మారవ్వతో పాటు కొన్ని మసాలాలు, ఎలక్ట్రికల్‌ కుక్కర్‌ వెంట తీసుకెళతాం. అక్కడ ఉన్నన్ని రోజులూ స్థానికంగా దొరికే కూరగాయలతో ఉప్మా, పలావ్‌ లాంటివి వండుకుంటాం. వీలైనంత తక్కువ సార్లు మాత్రమే హోటల్‌లో తింటాం.

సాంత్వన్‌ / ఫొటో: ఆర్‌ రాజ్‌కుమార్‌

Updated Date - 2023-08-02T04:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising