విశ్వ చైతన్య యాత్ర
ABN, First Publish Date - 2023-06-16T05:26:10+05:30
సప్త మోక్ష పురాలలో సుప్రసిద్ధమైనది, శ్రీ ఆది శంకరులు నెలకొల్పిన చతురామ్నాయాలలో గోవర్ధన పీఠానికి నెలవైనది, శ్రీ రామానుజాచార్యులు ప్రకటించిన 108 దివ్య క్షేత్రాలలో శ్రీరంగం అంతటిది, పురాణేతిహాసాల్లో ప్రముఖంగా ప్రస్తావితమైననదీ పురుషోత్తమ క్షేత్రం.
సప్త మోక్ష పురాలలో సుప్రసిద్ధమైనది, శ్రీ ఆది శంకరులు నెలకొల్పిన చతురామ్నాయాలలో గోవర్ధన పీఠానికి నెలవైనది, శ్రీ రామానుజాచార్యులు ప్రకటించిన 108 దివ్య క్షేత్రాలలో శ్రీరంగం అంతటిది, పురాణేతిహాసాల్లో ప్రముఖంగా ప్రస్తావితమైననదీ పురుషోత్తమ క్షేత్రం. వ్యావహారికంలో పూరీ. ద్వాపర యుగాంతంలో ఈ భువిపై బలరామునితో, సోదరి సుభద్రతో కలిసి... సమస్త లోకాలకూ నాథుడైన జగన్నాథుడు ఈ క్షేత్రంలో అవతరించాడని ప్రతీతి. జగత్పాలకుడైన ఆ పరమాత్ముడికి ప్రతి ఏటా ఆషాఢ శుద్ద విదియనాడు రథోత్సవం జరుగుతుంది. లక్షలాదిమంది భక్తి ప్రపత్తులతో తరలివచ్చే ఈ అద్భుతమైన యాత్రను చూడడానికి రెండు కళ్ళూ చాలవు. జగన్నాథుడి రథయాత్ర అనేక ప్రత్యేకతల సమాహారం.
అక్షయ తృతీయ రోజున ఆలయంలోని మూలమూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి, రథాల నిర్మాణానికి అంకురార్పణ చేస్తారు. ప్రతి సంవత్సరం పాత రథాలను మారుస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు విడివిడిగా రథాలు నిర్మిస్తారు. అవి రథయాత్ర నాటికి సర్వాలంకృతంగా సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథం పేరు ‘నందిఘోష’. ఈ పదహారు చక్రాల రథం ఎత్తు 44.2 అడుగులు. ఎరుపు, పసుపు వస్త్రాలతో కనిపించే ఈ రథానికి నాలుగు నల్లని అశ్వాలు ఉంటాయి. సారథి పేరు దారుకుడు. రథంపైన ఉండే కలశం పేరు త్రైలోక్య మోహిని. బలభద్రుడి (బలరాముడి) రథం ‘తాళధ్వజ’. 43.3 అడుగుల ఎత్తు. చక్రాలు పధ్నాలుగు. ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. నాలుగు తెల్లటి గుర్రాలు ఉంటాయి. రథ కలశం పేరు ఉణ్ణని. దీనికి సారథి మాతలి. సుభద్ర రథం పేరు ‘పద్మ ధ్వజం’ లేదా ‘దర్పదళన్’. ఇది పన్నెండు చక్రాలతో 42.3 అడుగుల ఎత్తులో, ఎరుపు, నలుపు వస్త్రాలతో అలంకరించి ఉంటుంది. నాలుగు ఎర్రని అశ్వాలు ఉంటాయి. రథ కలశం పేరు నాగాంబిక. రథసారథి అర్జునుడు. రథాల్లోని ప్రతి చక్రం మంత్రనిక్షిప్తమై ఉంటుంది. అశ్వాల పేర్లు కూడా మంత్రపూరితమైనవే. రథ నిర్మాణం, వస్త్రాలంకరణ... ఇలా అన్నీ సంప్రదాయికంగా అనాదిగా వస్తున్నవే.
నలుపు వర్ణంలో జగన్నాథుడు, శ్వేత వర్ణంలో బలభద్రుడు, పసుపు ఛాయలో సుభద్రాదేవి... ఈ ముగ్గురు మూల విరాట్టులను దయితపతులు (గిరిజన పూజారులు) ‘పాహుండి’ అనే పద్థతిలో రథాలపైకి చేరుస్తారు. ఆ తరువాత నిర్వహించే ‘చెర్రా పెహరా’ అనే కార్యక్రమంలో... మూడు రథాలనూ పూరీ మహారాజు బంగారు చీపురుతో ఊడ్చి, సుగంధ జలాలతో కల్లాపి జల్లుతారు. అనంతరం పూరీ శంకరాచార్యులు తొలి పూజ చేసిన తరువాత... రథాలు యాత్రకు సిద్ధమవుతాయి. ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించాదేవి మందిరానికి... ముందుగా బలభద్రుని రథం, వెనుక సుభద్ర రథం, ఆ వెనుక జగన్నాథ రథం బయలుదేరుతాయి. భక్తులు వాటిని మోకులతో లాగుతూ... మందిరానికి చేరుస్తారు.. జగన్నాథ మందిరాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్నుని భార్య పేరుతో నిర్మించినదే గుడించా మందిరం. ఈ యాత్రను ‘బోడోదండా’ అంటారు. రథాలు సూర్యాస్తమయానికల్లా గుడించా మందిరానికి చేరుకోవాలి. అలా కానప్పుడు, మార్గమధ్యంలో నిలిపివేస్తారు. మర్నాడు సూర్యోదయం తరువాత మందిరానికి చేరుస్తారు.
గుడించా మందిరంలో ఎనిమిది రోజులు విడిది చేసిన దేవతామూర్తులు... తొమ్మిదో రోజున తిరుగు ప్రయాణం చేస్తారు. ఆ రోజు ఏకాదశి. దాన్ని ‘బహుదా యాత్ర’ అంటారు. తెలుగువారు ‘మారు రథయాత్ర’గా పిలిచే ఈ రోజున... తొలి రథయాత్ర మాదిరిగానే కార్యక్రమాలు జరిపిస్తారు. ఆ సాయంకాలానికి రథాలన్నీ ఆలయం దగ్గరకు చేరుకుంటాయి. ఆ రాత్రి, మరుసటి రోజు ఆలయం ముందే ఉంటాయి. జగన్నాథుణ్ణి, ఆయన సోదరీ సోదరులను మణిమయమైన బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను ‘స్వర్ణవేష’ అని పిలుస్తారు. భక్తులందరూ రథాలను ఎక్కి దగ్గరగా దర్శనాలు చేసుకోవచ్చు.
దీనిపై ఎలాంటి నియంత్రణలూ ఉండవు. త్రయోదశి నాడు... సుగంధ ద్రవ్యాలు కలిపిన తియ్యని మజ్జిగను పెద్ద కుండలతో ముగ్గురు మూర్తులకూ పెదవులు తాకే విధంగా ఆరగింపు చేసి, దాన్ని రథాల ముందు పారబోస్తారు. దాన్ని ఎవరూ స్వీకరించరు. అది దివి నుంచి రథయాత్ర తిలకించడానికి వచ్చిన పితృదేవతలకు ప్రసాదంగా సమర్పించినదిగా పరిగణిస్తారు. దీన్ని ‘అధరపానా’ అని పిలుస్తారు. అనంతరం మూలవిరాట్టులను రథాల నుంచి దించి, రత్న వేదికపైకి చేరుస్తారు. పాలలో చక్కెర, సుగంధ ద్రవ్యాలు కలిపిన పాయసం లాంటి ప్రసాదాన్ని నివేదిస్తారు. అనంతరం దాన్ని ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. ‘జై జగన్నాథ’ అంటూ భక్తులు చేసే నినాదాల మధ్య రథయాత్ర ముగుస్తుంది.
శ్రీ జగన్నాథుడికి మూడు గంటలకు ఒకసారి చొప్పున రోజుకు ఆరుసార్లు నివేదనలు జరుగుతాయి. నలభై రకాల పిండి వంటలను మట్టి పొయ్యిల మీద, కట్టెలతో... శ్రీ మహాలక్ష్మి సన్నిధి ఎదుట వండుతారు. దీని కోసం ఆధునిక యంత్రాలు కాకుండా... రోలు, రోకలి లాంటివే ఉపయోగిస్తారు. నివేదనల తరువాత ప్రసాదాలను భక్తులకు పంచుతారు. ఆలయం బయట పెద్ద గంగాళాలతో అన్న ప్రసాదాలు ఉంచుతారు. శ్రీ జగన్నాథుడి సన్నిధిలో ‘మడి, తడి’ అంటూ ఉండవు. అందరూ ప్రసాదాన్ని తీసుకోవడం, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. అందుకనే ‘సర్వం శ్రీజగన్నాథం’ అనే నానుడి పుట్టింది. ఇక రథాల నిర్మాణం, వస్త్రాలంకరణల్లోనూ ఆధునిక పద్ధతులకు చోటు ఉండదు. మేకులు లాంటివి ఉపయోగించరు. చేనేత వస్త్రాలనే వినియోగిస్తారు. జగన్నాథుడి ఆలయంలో ప్రవేశానికి, పూజలకు రుసుములు ఉండవు. అందరూ రత్నవేదికను తాకి, కానుకలు సమర్పించుకోవచ్చు. శ్రీ జగన్నాథుడిని స్తుతిస్తూ ‘జగన్నాథాష్టకా’న్ని ఆది శంకరాచార్యులు రచించారు. అదే ఈనాటికీ సుప్రభాతంగా కొనసాగుతోంది.
‘రథేన వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే’ అన్నారు పెద్దలు. ఒక్కసారైనా రథారూఢుఢైన జగన్నాథుణ్ణి దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల విశ్వాసం.
(20న శ్రీ జగన్నాథ రథోత్సవం) ఆయపిళ్ళ రాజపాప
Updated Date - 2023-06-16T05:26:10+05:30 IST