ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tammareddy Bharadwaja: ఈ పద్థతి మారాలి

ABN, First Publish Date - 2023-06-11T02:45:04+05:30

గతవారం నిర్మాతలం ఎందుకు భయపడుతున్నాం అనేది ప్రస్తావించాను కానీ దాని గురించి వివరంగా చెప్పలేదు. గతంలో సినిమాలు తీసే రోజుల్లో డిస్ర్టిబ్యూటర్‌కు కథ వినిపించేవాళ్లం. వాళ్లు అరవై శాతం పెట్టేవాళ్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భరద్వాజీయం

గతవారం నిర్మాతలం ఎందుకు భయపడుతున్నాం అనేది ప్రస్తావించాను కానీ దాని గురించి వివరంగా చెప్పలేదు. గతంలో సినిమాలు తీసే రోజుల్లో డిస్ర్టిబ్యూటర్‌కు కథ వినిపించేవాళ్లం. వాళ్లు అరవై శాతం పెట్టేవాళ్లు. నలభై శాతం నిర్మాతలు పెట్టేవారు. ఆ అరవై శాతం డిస్ర్టిబ్యూటర్లకు గ్యారెంటీడ్‌ మనీ. అంటే నిర్మాతలు వంద శాతం పెట్టుబడి పెట్టినట్టే. ఎందుకంటే వాళ్లకు రికవర్‌ అవ్వకపోతే ఖర్చులతో సహా మన దగ్గర నుంచి వసూలు చేసేవారు. వీళ్లూ ఇచ్చేవారు. లేదంటే తరువాతి సినిమాలో వసూలు చేసేవారు. మొత్తానికి వాళ్లకేమీ నష్టం ఉండేది కాదు కానీ నిర్మాతలకు మాత్రం పూర్తి రిస్క్‌ ఉండేది. అందుకనే చాలా జాగ్రత్తగా చేసేవాళ్లం. పెట్టుబడి పెట్టేవారు కాబట్టి డిస్ర్టిబ్యూటర్లు కూడా అప్పుడప్పుడు రష్‌ చూసేవారు. సలహాలు, సంప్రతింపులు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో థియేటర్‌ రెవెన్యూ ఒక్కటే. ఆ తరువాత వీడియో క్యాసెట్లు వచ్చాయి. దాని నుంచి డీవీడి అయింది. డీవీడీ నుంచి శాటిలైట్‌ అయింది. కొంత కాలానికి డీవీడీ పేమెంట్‌, శాటిలైట్‌ పేమెంట్‌ రావడం మొదలయ్యాయి. ఇప్పుడు ఓటీటీ, హిందీ డబ్బింగ్‌ వచ్చాయి. వీటన్నిటి నుంచి డబ్బులు వస్తున్నాయి. దీంతో పెద్ద కంపెనీలన్నీ వాటి మీద ఆధారపడి, సినిమాలను డబ్బింగ్‌కు కూడా పనికొచ్చేట్టు తీస్తున్నారు.

డబ్బింగ్‌ అంటే మూడు ఫైట్స్‌, నాలుగైదు పాటలు తప్పనిసరిగా ఉండేలా చూసుకొంటున్నారు. ఓటీటీ కంటెంట్‌ మరో విధంగా ఉండాలి. దాని కోసం కొన్ని ఉండేలా చేస్తున్నారు. ఓవర్‌సీస్‌ మార్కెట్‌ కూడా వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చివరకు ప్రేక్షకుడి కోసం తీసే సినిమా లేకుండా పోయింది. పాత డిస్ర్టిబ్యూషన్‌ సిస్టమ్‌లో డబ్బు మొత్తం మన రిస్క్‌. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మనకేమీ రిస్క్‌ లేదు. శాటిలైట్‌, ఓటీటీ డబ్బులు తిరిగి ఇవ్వక్కర్లేదు. కాబట్టి థియేట్రికల్‌ కలెక్షన్స్‌ వస్తే వచ్చాయి... లేకపోతే లేదు. చాలా సినిమాలకు వీటివల్ల బ్రేక్‌ ఈవెన్‌ వచ్చేస్తోంది. కొంతమందికి లాభంతో పాటు థియేట్రికల్‌ కలెక్షన్‌ మిగులుతోంది కూడా. దీంతో నిర్మాతకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఎందుకంటే మార్కెట్‌ హీరోతోనే అవుతోంది. హీరోను చూసే సినిమా కొంటున్నారు. కనుక నిర్మాతలు చచ్చినట్టు హీరో మాట వినాలి. దాంతో కంటెంట్‌ కంటే ముందు హీరో ముఖ్యమైపోయాడు. ‘బలగం, విరూపాక్ష’ లాంటి కొన్ని సినిమాలు కంటెంట్‌తోనే నడుస్తున్నాయనుకోండి.

ఈ మధ్య పబ్లిసిటీ లేదని ఒక భయం మొదలైంది. ఆ పబ్లిసిటీ కోసం బ్లాక్‌మెయిలింగ్‌ దాకా వెళ్లిపోయింది. అంతకుముందు పత్రికలు మాత్రమే ఉండేవి. తరువాత టీవీ, ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చాయి. ఇప్పుడు రేటింగ్‌లు ఇస్తున్నారు. అది ఓవర్‌సీస్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఈ చెప్పేదంతా కొన్ని సినిమాల గురించే. మిగిలిన సినిమాలకు ఏ మార్కెట్టూ లేదు. ఒకటి రెండు శాతం సినిమాలు థియేటర్లలో ఆడేస్తాయి. వాటిల్లో ఎనభై శాతం అసలు విడుదల కావు. ఇలా అన్నీ బేరీజు వేసుకున్నప్పుడు ఎవరు కొంటారు? ఎవరు కొనరనే భయంలో గడుపుతున్నాం. ఈ భయంలో హీరోలు కూడా ‘దాంట్తో పబ్లిసిటీ లేదు... దీంట్లో లేదు. ఇది కావాలి. అది కావాలి’ అని అడుగుతుండేవారు. ఒకానొక స్టేజ్‌లో వాళ్లకూ అర్థమైంది... ‘మనం బ్లాక్‌మెయిలింగ్‌లోకి వెళ్లిపోతున్నాం. ఆపేద్దాం’ అనుకున్నారు. ఇది రెండు మూడేళ్ల కిందట జరిగింది. కానీ చేయలేకపోయారు. మళ్లీ ఇప్పుడు ‘ఈ బ్లాక్‌మెయిలింగ్‌ అనేది లేకుండా పోవాలి. ఆపేయాలి’ అనే ఒక నిర్ణయానికి హీరోలు వచ్చారు. నిర్మాతలకు చెప్పారు. వాళ్లూ ధైర్యంగా ఉన్నారు. నెమ్మదిగా అభిమానులు ఇందులోకి ఎంటరయ్యారు. దాంతో ట్విట్టర్‌ వార్‌ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలు మొదలయ్యాయి. ఎవరెవరు ఎంత తీసుకొంటున్నారు అనే స్థాయికి చర్చలు చేరుకున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

ఏదైనా బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగకూడదని ఎప్పుడైతే హీరోలు అనుకున్నారో, ఆ రోజు నుంచి నిర్మాతకు మంచి జరుగుతుంది. ఎందుకంటే పబ్లిసిటీ డెబ్భై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెళుతోంది. ఫలానావాడికి ఫలానా ఇవ్వాలనే భయంతో పేమెంట్స్‌ ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. ఆ భయమనేది పూర్తిగా పోవాలి. ఆ భయానికి హీరోలు, అభిమానులు ఎవరూ మద్దతునివ్వడంలేదు. దీంతో నిర్మాత బంధవిముక్తుడు అయిపోయాడు. ఇప్పటి నుంచైనా నిర్మాతలు భయాన్ని వీడి ధైర్యంగా ముందుకు వెళితే కచ్చితంగా ఖర్చుకు ఖర్చు తగ్గుతుంది. బహుశా రాబోయే రోజుల్లో ఫొటోలకు కూడా కాపీరైట్స్‌ పెడతారేమో! పెట్టాలంటే చాలా ఉంటాయి. కానీ పెడితే ప్రమోషన్‌ లేకుండా పోతుందని మళ్లీ వాళ్లకు భయం ఉంటుంది.

కాబట్టి ఏదిఏమైనా సామరస్యంగా ఉండాలి. మీడియాలో అందరూ దుర్మార్గులేమీ కాదు. మంచివాళ్లూ ఉన్నారు. పరిశ్రమకు మీడియా వంద శాతం కావాలి. అదే సమయంలో మీడియాకు పరిశ్రమ కూడా వంద శాతం కావాలి. కనక పరస్పర అవగాహనతో వెళ్లాలి కానీ, ఒకరినొకరు భయపెట్టి పీక్కుతినే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. వాళ్లు లొంగారు కదా అని వీళ్లు, వీళ్లు వంగారని వాళ్లు ఎక్కి తొక్కకూడదు. అంతా సామరస్యంగా సాగిపోతే అటు పరిశ్రమ, ఇటు మీడియా బాగుంటాయి. రెండిటినీ నమ్ముకున్నవాళ్లు కూడా బాగుంటారు. ఒక ప్రెస్‌మీట్‌ పెడితే రెండు మూడొందల మంది వస్తున్నారు. ఏంచేయాలో తెలియని పరిస్థితి. దాన్ని అడ్వాంటేజ్‌ తీసుకొనేవారు ఇంకొంతమంది తయారవుతున్నారు. ఇవన్నీ లేకుండా పోవాలంటే... మీడియా మిత్రులు, సినీ నిర్మాతలు అందరి కలిసి దీన్ని ఒక కొలిక్కి తెచ్చి, ఒక పద్ధతిగా చేసుకొంటే ఇరు వర్గాలకూ మంచిది.

-తమ్మారెడ్డి భరద్వాజ

(సినీ రచయిత, దర్శకుడు)

Updated Date - 2023-06-11T02:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising