ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shri Krishnashtami : సంకీర్తనం... భగవద్ధామానికి మార్గం

ABN, First Publish Date - 2023-08-31T23:52:16+05:30

దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవతారం దివ్యమైనది, అలౌకికమైనది. శ్రావణ బహుళ అష్టమి రోజున ఆయన ఈ లోకంలో అవతరించాడు. ఆ ఆవిర్భావ తిథిని ‘జన్మాష్టమి’గా, ‘శ్రీకృష్ణాష్టమి’గా మనం వేడుక

దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవతారం దివ్యమైనది, అలౌకికమైనది. శ్రావణ బహుళ అష్టమి రోజున ఆయన ఈ లోకంలో అవతరించాడు. ఆ ఆవిర్భావ తిథిని ‘జన్మాష్టమి’గా, ‘శ్రీకృష్ణాష్టమి’గా మనం వేడుక చేసుకుంటున్నాం. సకల లోకేశ్వరుడైన ఆ భగవంతుడికి తను ఈ భువిలో అవతరించడం కోసం ఇక్కడి నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన ఈ అవతారంలో తన తల్లితండ్రులైన దేవకీ వసుదేవులకు సర్వాలంకార భూషితుడైన విష్ణుమూర్తిగా దర్శనం ఇచ్చాడని ‘శ్రీమద్భాగవతం’ చెబుతోంది. ఆ తరువాత త్లలి దేవకి వినతిపై మానవమాత్రుడైన పసిపిల్లవాడుగా మార్పు చెందాడు. శ్రీకృష్ణుడి అసాధారణమైన ఈ ఆవిర్భావం ఆశ్చర్యం కలిగించదు. ఇంతకీ శ్రీకృష్ణుడిగా భగవంతుడు ఈ భూమిపై అవతరించడానికి కారణం ఏమిటి? మనకు ప్రాపంచిక వాస్తవాలను గుర్తు చేయడానికి. మనల్ని జనన, మరణ క్లేశాల నుంచి దాటించడానికి. శాశ్వతమైన, నిరంతరాయమైన ఆనందాన్ని పొందాలనే మనలోని అంతర్గతమైన కోరికను గుర్తు చేయడానికి. సనాతనమైన మన నిజ స్వరూప స్థితిని తెలియజేయడానికి.

‘మనమందరం ఈ భౌతిక దేహాలం కాదు. ఆత్మస్వరూపులం’ అని భగవద్గీత రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివరించాడు. ‘‘ఏ విధంగానైతే దేహంలోని జీవాత్మ వరుసగా బాల్యం, యౌవనం, వృద్థాప్యాలలోంచి సాగిపోతుందో... అదే విధంగా మరణ సమయంలో... ఆ జీవాత్మ మరో దేహంలోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయంలో భ్రాంతికి లోనవ్వరు’’ అన్నాడు. ఆత్మస్వరూపులమైన మనమందరం శాశ్వతత్వం, నిరంతర ఆనందం, సంపూర్ణ జ్ఞానం కోసం పరితపిస్తున్నాం. కానీ ఈ భౌతిక ప్రపంచం ఆ తపనలను తీర్చలేదు. అంటే... మనది కాని ఏదో పరాయి ప్రదేశంలో ఉంటున్నాం. ఈ అంశం గురించి అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకుడు ఆచార్య శ్రీల ప్రభుపాదులు వివరిస్తూ... మన పరిస్థితి నీటిలోంచీ బయటకువచ్చి, నేల మీద పడిన చేపలా ఉందంటారు. చేప సంతోషం కోసం నేల మీద ఎన్ని ఏర్పాట్లు చేసినా... అది ఎప్పటికీ అక్కడ సంతోషంగా ఉండలేదు.


మనమందరం మొదట భగవంతుడు లేదా శ్రీకృష్ణుడితోనే కలిసి ఉన్నామనీ, కొన్ని కారణాల రీత్యా ఈ ప్రపంచానికి ప్రయాణికులుగా వచ్చామనీ కూడా భగవద్గీత వెల్లడిస్తున్నది. మన నిజమైన నివాసం వైకుఠం లేదా గోలోకధామం. కానీ ప్రస్తుతం ఈ భౌతిక శరీరంతో, ఈ ప్రపంచంలో చిక్కుకొని ఉన్నాం. భగవంతుడు శాశ్వతమైనట్టే... ఆయన ధామం కూడా శాశ్వతమైనది. ఆ ధామానికి చెందిన మనమందరం శాశ్వతమైన ఆత్మస్వరూపులం. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించామో... భౌతిక దేహమనే దుస్తులను ధరించవలసి వచ్చింది. వాస్తవానికి మనం ఈ ప్రపంచానికి చెందినవారం కాదు. ఈ విషయాలను మరచిపోయి... ఈ ప్రపంచంలోని లౌకిక వ్యవహారాలలో చిక్కుకొని జీవిస్తున్నాం. మన నిజమైన స్వరూపాన్ని మళ్ళీ మనకు గుర్తు చేయడానికి శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. ముఖ్యంగా... మనల్ని మళ్ళీ తన నివాసానికి ఆహ్వానించడానికి వస్తాడు. తన నివాసంలో శాశ్వతమైన, నిత్యయవ్వనమైన, ఆనందమయమైన జీవితాన్ని పొందేందుకు ప్రేమపూర్వకంగా శ్రీకృష్ణుడు ఇచ్చిన పిలుపే ‘భగవద్గీత’.

లోకంలో అధర్మం ప్రబలి, ధర్మం క్షీణించినప్పుడల్లా తాను అవతరిస్తానని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు. జీవుని సనాతన ధర్మమైన భగవత్ర్పేమను తిరిగి పెంపొందించడానికి భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు. ‘మరి కలహాలు, కల్మషాలతో కూడిన ప్రస్తుత యుగంలో కూడా శ్రీకృష్ణుడు అవతరించి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడా?’ అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అదృష్టవశాత్తూ శ్రీ కృష్ణుడు ఈ లోకంలో మన మధ్యనే ఉన్నాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు దివ్యమైన మానవరూపంలో అవతరించాడు. ‘కలికాలే నామరూపే కృష్ణావతార’... ప్రస్తుత కలియుగంలో ఆయన తన నామరూపంలో అవతరిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఈ యుగంలో కృష్ణావతారం శబ్దరూపంలో ఉంటుంది. సర్వశక్తిమంతుడైన భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలలో అవతరించగలడు. కొన్నిసార్లు స్వయంగా తన నిజ రూపంలో, మరికొన్నిసార్లు ఆలయాల్లో అర్చామూర్తిగా, ఇంకొన్నిసార్లు శబ్దరూపంలో అవతరిస్తాడు. ఈ రూపాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. మనం గుడిలోని భగవంతుని వద్దకు వెళ్ళినా, భగవన్నామాన్ని జపించినా... శ్రీకృష్ణుణ్ణి ముఖాముఖి దర్శిస్తున్నామనే అర్థం.

ప్రస్తుత యుగధర్మమైన భగవన్నామ సంకీర్తనను ప్రచారం చేయడానికి... అయిదు వందల ఏళ్ళ క్రితం పశ్చిమబెంగాల్‌ ప్రాంతంలో శ్రీచైతన్య మహాప్రభువుగా శ్రీకృష్ణుడు అవతరించాడు. హరినామ సంకీర్తనమే కలిగుయంలోని అవాంతరాలను అధిగమించి, భగవద్ధామాన్ని తిరిగి పొందగలిగే ఏకైక మార్గమని శ్రీ చైతన్యులు బోధించారు.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ రామ హరే హరే

ఇతి షోడశక నామ్నాం కలి కల్మష నాశనమ్‌

నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే

‘‘ఈ పదహారు నామాలే కలి కల్మషాలను నాశనం చేయగలవు. సకల వేదాలనూ వెతికినా ఇంతకన్నా ఉత్తమమైన ఉపాయం మరొకటి కనిపించదు’’ అంటోంది ‘కలిసంతరణ ఉపనిషత్తు’. అత్యంత సరళమైన ఈ మార్గాన్ని అనుసరించి, నిత్యం ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపించగలిగితే... ఈ లోకంలో శాంతి సౌభాగ్యాలతో జీవించి, మన నిజనివాసమైన భగవంతుడి సన్నిధానాన్ని తప్పక చేరుకోగలం.

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984 (శ్రీకృష్ణాష్టమి సందర్భంగా)

Updated Date - 2023-08-31T23:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising