ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dr. Jayaprada Ramamurthy : ఆ వేణుగానం... జయప్రదం

ABN, First Publish Date - 2023-02-07T23:52:39+05:30

గోపాలుడి వేణు గానానికి గోపికలు ఎంతలా మంత్రముగ్ధులయ్యారో తెలియదు కానీ... ఆమె వేణునాదానికి మనసు మైమరిచిపోతుంది. గుండె సరికొత్త లయను శృతి చేసుకొంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలుడి వేణు గానానికి గోపికలు ఎంతలా మంత్రముగ్ధులయ్యారో తెలియదు కానీ...

ఆమె వేణునాదానికి మనసు మైమరిచిపోతుంది.

గుండె సరికొత్త లయను శృతి చేసుకొంటుంది.

తెలుగునాట తొలి మహిళా ఫ్లూట్‌ కళాకారిణిగా చరిత్ర లిఖించి... మోహన మురళీరవంలా జనులను సమ్మోహితులను చేస్తున్నారు

డాక్టర్‌ జయప్రద రామమూర్తి.

‘జయ’ప్రదంగా సాగిపోతున్న తన శబ్ద లయ విన్యాస విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు...

ఆదరణ తగ్గలేదు...

సంగీతంలో నేను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. నేను నిత్య విద్యార్థిని. అదేసమయంలో సంగీతం ప్రతి ఒక్కరికీ చేరాలనేది నా అభిలాష. ఫలానా స్థాయి వేదికలపైనే వాయించాలనే నియమం ఏదీ పెట్టుకోలేదు. నేను ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తుంటాను. శాస్త్రీయ సంగీతానికి జనాదరణ లేదంటే నేను ఒప్పుకోను. మంచి సంగీతానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండు వేల మందికి పైగా వచ్చారు. నేను ఫ్లూట్‌ వాయిస్తుంటే నాలుగు గంటలైనా ఎవరూ కదల్లేదు. విశ్వనాథ్‌ గారి సినిమాలు ఎలా చూస్తారో... అలాగే ఆస్వాదించారు. సినిమా సంగీతమే కాదు... శాస్త్రీయ సంగీతానికి కూడా ఆదరణ ఉందని అలాంటి ప్రదర్శనలు చూసినప్పుడు అర్థమవుతుంది. ముంబయిలో అయితే చౌరాసియా తదితరులు కార్యక్రమాలకు అమితాబ్‌ లాంటి సినీ స్టార్స్‌ వస్తారు.

చిన్న కళాకారుల కార్యక్రమాలకు జనం రారనడం సరికాదు. మాస్కో వెళ్లినప్పుడు అక్కడ నేనెవరికీ తెలియదు. కానీ హాలు నిండిపోయింది.

‘‘సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం మాది. అమ్మ ప్రేమ రామమూర్తి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. కేంద్ర ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు గ్రహీత. మంగళంపల్లి బాలమురళికృష్ణ గారి శిష్యురాలు. నాన్న వెంకటరమణ రామమూర్తి ముంబయిలోని ‘బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ (బార్క్‌)లో శాస్త్రవేత్తగా పనిచేశారు. మేము ఇద్దరు పిల్లలం. పుట్టిందీ పెరిగిందీ హైదరాబాద్‌లోనే. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ రాగాలు వింటూ ఎదిగాను. కానీ ప్లూట్‌ మీద మమకారం ఎలా కలిగిందో తెలియదు. దాని గురించి నాకు ఎవరూ చెప్పింది లేదు. ఎవరూ తెచ్చి ఇచ్చింది లేదు. ఒక కలలా వచ్చి... ‘నేను వాయించగలను’ అనే దైవిక స్ఫూర్తిని రగిలించింది. అప్పుడు నా దగ్గరున్న యాభై రూపాయల పాకెట్‌ మనీతో ఎంతో ఇష్టంగా ఒక ఫ్లూట్‌ కొన్నా. అదే నా తొలి మురళి. ఇప్పటికీ అది నా దగ్గర ఉంది. మొదట్లో శిక్షణ లాంటివేవీ తీసుకోలేదు. నా అంతట నేనే వాయించడం నేర్చుకున్నా.

చెన్నై వెళ్లి...

అమ్మ విద్వాంసురాలైనా తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని భావించింది కానీ, సంగీతాన్ని ప్రొఫెషనల్‌గా తీసుకోవాలని కోరుకోలేదు. అందుకు కారణం... నాన్న చనిపోయిన తరువాత కుటుంబాన్ని నెట్టుకురావడంలో ఆమె పడిన ఇబ్బందులు. అమ్మ ఆకాంక్షకు తగ్గట్టుగానే నేను చదువులో కూడా టాప్‌లో ఉండేదాన్ని. కామర్స్‌లో పీహెచ్‌డీ చేశాను. అయితే ఫ్లూట్‌ మీద నాకున్న ఆసక్తిని చిన్నప్పుడే అమ్మ అర్థం చేసుకుంది. మరింత నైపుణ్యం సాధించాలంటే గురువు మార్గదర్శనం ఉండాలని భావించింది. దాంతో నన్ను చెన్నై తీసుకువెళ్లి పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ నటేశన్‌ రమణి గారి దగ్గర చేర్పించింది. అక్కడకు వెళ్లినప్పుడు ఆయన అన్నారు... ‘నువ్వు ఇప్పటికే ఫ్లూట్‌ బాగా వాయిస్తున్నావు కదా! ఇంకా శిక్షణ ఎందుకు’ అని! ‘ఎంత వచ్చినా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది’ అన్నాను.

పన్నెండేళ్లకే ప్రదర్శనలు...

గురువు గారి మార్గదర్శనంలో... పన్నెండేళ్లప్పుడే వేదికలెక్కి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. నా మొదటి ప్రదర్శన సికింద్రాబాద్‌ గణపతి గుడిలో. గణేశ్‌ నవరాత్రుల సమయం అది. అనుకోకుండా జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి వరుస కార్యక్రమాలు. టీటీడీ, దూరదర్శన్‌, రేడియోలతో పాటు దేశంలోని వివిధ నగరాలు, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ తదితర దేశాల్లో జరిగిన సంగీత ఉత్సవాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఇస్తున్నాను. ఏదో సరదాగా నేర్చుకున్నానని అనుకున్నారు కానీ, నేను ఇంత దూరం వస్తానని, అంతర్జాతీయ స్థాయి కళాకారిణి అవుతానని నాడు ఎవరూ ఊహించలేదు. ఏదైనా పట్టుదలగా ప్రయత్నించాలి. ఇప్పుడు అలా కాదు... ఆర్భాటంగా అరంగేట్రం చేస్తున్నారు. తరువాత వదిలేసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఏ కళ అయినా బలవంతం చేసి నేర్పించేది కాదు. ఇష్టంతో నేర్చుకోవాల్సింది. సంగీతంలో నాకు ఎలాంటి డిగ్రీలూ లేవు. ఏ పరీక్షలూ రాయలేదు. కానీ నేడు అత్యుత్తమ కళాకారిణిగా గుర్తింపు పొందానంటే కారణం... కళ పట్ల ఉన్న ప్రేమ. సంగీతం ఒక కోర్సు కాదు. సహజంగా ప్రతిభ ఉన్నవారే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరనేది నా అభిప్రాయం.

అప్పటికి నేనే...

ఫ్లూట్‌ అనగానే సహజంగా గుర్తుకువచ్చేది మగవారే. మహిళలు చాలా అరుదుగా కనిపిస్తారు. నేను ఫ్లూట్‌ పట్టినప్పుడైతే ఎవరూ లేరు. నా ముందు తరంలో తమిళనాడులో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉండేవారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా ఫ్లూటి్‌స్టను నేను. ప్రస్తుతం కూడా దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకున్న మహిళలు ఇక్కడ కనిపించడంలేదు. హిందుస్తానీ సంగీతంలో ఒకరిద్దరు ఉన్నారు. నేను నేషనల్‌ స్కాలర్‌షి్‌ప్సకు ఎగ్జామినర్‌గా వెళుతుంటాను. అక్కడ నేను గమనించిందేమంటే అమ్మాయిలు ఎక్కువగా వీణ, తరువాత వయోలిన్‌ నేర్చుకొంటున్నారు. అమ్మాయిలు ఫ్లూట్‌ వాయించడం తక్కువ. అలాగే అబ్బాయిలు వీణ నేర్చుకోవడం అరుదు. ఫ్లూట్‌ వాయించడం అంత సులువు కాదు. చేతుల వరకే కాకుండా... ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా సంబంధించింది. ఒక గాయకుడికి, ఒక వాయిద్య కళాకారుడికి ఉండాల్సిన రెండు లక్షణాలు ఒక ఫ్లూటి్‌స్టకు ఉండాలి. ఫ్లూట్‌ వాయించాలంటే చాలా బలం కావాలి. ఈ కారణాల వల్ల కూడా అమ్మాయిలు ఫ్లూట్‌ తీసుకోవడంలేదేమో!

అంతేకాదు... సాధారణంగా మగవారు వాడే ఫ్లూట్‌ ఫింగర్‌ ప్లేస్‌మెంట్స్‌ దూరంగా ఉంటాయి. రంధ్రాలు పెద్దవి. అదే ఫ్లూట్‌ నేను వాయించాలంటే కష్టం. ఎందుకంటే నా వేలు చిన్నది కాబట్టి, క్లోజ్‌ చేసి వాయించలేను. పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా గారు వాయించే పొడవాటి వెదురు కర్రలలాంటివి నాకు అందవు. అందుకే నేను ప్రత్యేకంగా చేయించుకొంటాను. ఖరీదు కూడా ఎక్కువే. ఒక్కొక్కటీ 25 వేల రూపాయలు ఉంటుంది. అసోం, మహరాష్ట్ర నుంచి తెప్పించుకొంటాను.

మధుర జ్ఞాపకాలెన్నో...

నాకు నచ్చిన ఫ్లూటి్‌స్టలు మా గురువు రమణి గారు, చౌరాసియా గారు. చాలా ఏళ్ల కిందట బంగ్లాదేశ్‌ ఢాకాలో జరిగిన ఉత్సవంలో చౌరాసియా గారితో కలిసి ప్రదర్శన ఇచ్చా. అప్పుడు నేను జూనియర్‌ ఆర్టి్‌స్టని. ఆయన ఎంత బిజీ అంటే... ఇక్కడ ప్రదర్శన ఇచ్చి, మళ్లీ ముంబయి వెళ్లి వాయించి వచ్చేవారు. ఆ ఉత్సవం నా కార్యక్రమంతో మొదలై... గురువు గారితో ముగిసింది. బాలమురళీకృష్ణ, జాకీర్‌ హుస్సేన్‌లాంటి పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చారు. లక్షమంది ఆహూతులు. ఆ ఉత్సవం నాకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

అలాగే నేను ప్రపంచ రికార్డు సాధించినప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. అప్పటి వరకు నాకు తెలియదు... ప్రధాని కార్యాలయం అంత అధునాతనంగా, అంత పెద్దగా ఉంటుందని! నేను ఉన్నది భారత్‌లోనేనా అన్న సందేహం కలిగింది. చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గారు. మరిచిపోలేని అనుభూతి అది. ఆ తరువాత వివిధ కార్యక్రమాల కోసం ప్రధాని కార్యాలయానికి మూడు నాలుగుసార్లు వెళ్లాను. ఇది నాకు లభించిన అదృష్టం.

కేఆర్‌ నారాయణ్‌, ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు వారి ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాను. వారి ముందు ప్రదర్శన ఇచ్చాను. ప్రణబ్‌ ముఖర్జీ గారు అయుతే లేచి వచ్చి నన్ను అభినందించారు. విదేశాల్లో కూడా ఇలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. సంగీతమే సర్వస్వమై సాగుతున్న నా జీవితంలో ప్రతిష్టాత్మక పురస్కారాలెన్నో అందుకున్నాను. అవి వెల కట్టలేనివి.

సినిమాల్లో అలా...

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిగారి ప్రోద్బలంతో నేను సినిమా రంగంలో కూడా అడుగుపెట్టాను. అదికూడా విచిత్రంగా జరిగింది. అప్పుడే తిరుపతిలో ఒక ప్రాజెక్ట్‌ ముగించుకుని హైదరాబాద్‌ వచ్చాను. రాగానే కీరవాణి గారి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఓం నమోవెంకటేశాయ’ చిత్రం కోసం పిలిచారు. తిరుపతి నుంచి రావడం, ఆ శ్రీనివాసుడి చిత్రం కోసం పిలుపు రావడం చూశాక ఆ ఏడుకొండలవాడే నన్ను దీవించాడని అనిపించింది. అప్పటి నుంచి కీరవాణి గారు ఆయన ప్రతి ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. తరువాత ‘వకీల్‌సాబ్‌’ చిత్రంతో నాకు బాగా పేరు వచ్చింది. తమన్‌గారు మంచి అవకాశం ఇచ్చారు. ‘వకీల్‌సాబ్‌’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో మా ప్రదర్శన చూసి పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ముందు నుంచి నాకు చిరంజీవి గారి కుటుంబంతో అనుబంధం ఉంది. అలాగే కె.విశ్వనాథ్‌ గారితో పని చేశాను. ఆయన ‘శంకరాభరణం’ తమిళంలో డబ్బింగ్‌ చేశారు కదా! ఎస్‌పీ బాలు గారు ఆ వయసులో అదే అనుభూతితో, అదీ తమిళంలో పాడడం చాలా గొప్ప విషయం. ప్రస్తుతం కోటి గారు ఓ ప్రాజెక్ట్‌ కోసం పిలిచారు.

ఆ సంస్క ృతి మారాలి...

ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పెద్ద పెద్ద ఆర్టి్‌స్టలను పిలిచి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లో వేరే రాష్ట్రం నుంచి ఒక స్టార్‌ గాయకుడిని తెచ్చి, పది లక్షలు ఇచ్చారు. నేను వాళ్లకు చెప్పాను... ‘అతడు ఎంతో సంపాదించుకున్నాడు. ఆ పది లక్షలను సరిగ్గా విభజిస్తే వంద మంది చిన్న కళాకారులు బతుకుతారు. వాళ్లకు మీరు జీవితం ఇచ్చినవారవుతారు’ అని! ఈ సంస్కృతి మారాలి. చిన్న కళాకారులైతే జనం రారనడం సరికాదు. మాస్కో వెళ్లినప్పుడు అక్కడ నేనెవరికీ తెలియదు. కానీ హాలు నిండిపోయింది. నిలుచొని నాకు చప్పట్లు కొట్టారు. ఎలా వచ్చారు అంతమంది? అలాగే మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా వస్తారు. అది నిర్వాహకుల గొప్పదనం. ముంబయిలో ‘సుర్‌సాగర్‌’ లాంటి బీచ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తుంటారు. అలాంటి అధునాతన కళా సంస్కృతి ఇక్కడ కూడా రావాలి. ఆ రోజు దగ్గరలోనే ఉంది.’’

హనుమా

Updated Date - 2023-02-07T23:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising