లాక్‌డౌన్‌లో 10వేల కేక్‌లు చేశా!
ABN, First Publish Date - 2023-10-21T16:28:43+05:30
‘హలో... రండి కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకొందాం’... ఎక్కడో విన్నట్టు ఉంది కదూ! యూట్యూబ్‌లో ‘స్వప్న వైట్ల’ చానల్ ఫాలో అయ్యేవారికి ఈ పలుకరింపు కొత్తేమీ కాదు.
‘హలో... రండి కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకొందాం’... ఎక్కడో విన్నట్టు ఉంది కదూ! యూట్యూబ్‌లో ‘స్వప్న వైట్ల’ చానల్ ఫాలో అయ్యేవారికి ఈ పలుకరింపు కొత్తేమీ కాదు. షెఫ్‌గా కెరీర్ మొదలుపెట్టి... దేశవిదేశాల రుచులు వంటబట్టించుకుని... ఇప్పుడు ఆన్‌లైన్‌లో వండి వారుస్తున్నారు స్వప్న వైట్ల. బిజీ లైఫ్‌లో పరుగులు తీసే మహిళలకు... పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టాలని తపించే అమ్మలకు... సులువుగా అయిపోయే రెసిపీలను అందిస్తున్న ఆమె... ఇంతకీ షెఫ్ ఉద్యోగం వదిలి యూట్యూబ్‌కు ఎందుకు వచ్చినట్టు? అదే ప్రశ్న ‘నవ్య’ అడిగితే... స్వప్న ఇలా చెప్పుకొచ్చారు.
‘‘కుటుంబం మద్దతు ఉంటే ఒక ఆడపిల్ల ఏదైనా సాధించగలదని చెప్పడానికి నేనే ఉదాహరణ. చిన్నప్పుడు అమ్మా నాన్న... పెళ్లయ్యాక భర్త, అత్తమ్మ... వీళ్లందరి సహకారం, ప్రోత్సాహంతోనే ఇవాళ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగాను. మా అమ్మావాళ్లది మెదక్ దగ్గర చేగుంట అయినా... నేను పుట్టింది, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మాది పెద్ద కుటుంబం. ఐదుగురు సంతానం. మా అమ్మ చాలా బాగా వండుతుంది. తనకు నేను సాయం చేస్తుండేదాన్ని. అలా నాకు కూడా వంట మీద మక్కువ పెరుగుతూ వచ్చింది. అయితే షెఫ్ అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. డిగ్రీ పూర్తయ్యాక... ఒక రోజు టీవీలో స్ర్కోలింగ్ వస్తోంది... హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించి. అందరిలా డిగ్రీ అయిపోయింది... ఉద్యోగం చేయాలి... అని అనుకోలేదు. ఏదైనా కాస్త భిన్నంగా, కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తానని నాన్నకు చెప్పాను. ఆయన మొదట వద్దన్నారు. కానీ పిల్లలను ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తరువాత ఒప్పుకున్నారు. హైదరాబాద్ ‘ఐఐహెచ్‌ఎం’లో చేరాను. 2006లో కోర్సు పూర్తయింది. మంచి సంబంధం రావడంతో ఆ వెంటనే నాకు పెళ్లి చేశారు.
అలా మొదలైంది...
పెళ్లి తరువాత మావారు రాజేష్ వైట్ల తో యూకే వెళ్లాను. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్. తను ఆఫీ్‌సకు వెళుతుంటే నేను ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. మా అపార్ట్‌మెంట్స్‌లోనే కింద హోటల్ ఉంది. ఒక రోజు ఆ హోటల్‌కు వెళ్లాను. అందులో షెఫ్ దగ్గర కాంటినెంటల్ వంటలు నేర్చుకున్నాను. కొన్ని రోజుల తరువాత నాకు అక్కడే ఉద్యోగం ఇచ్చారు. అలా రెండున్నరేళ్లు గడిచిపోయాయి. మావారికి బదిలీ కావడంతో భారత్‌కు వచ్చాం. కొంత కాలానికి మా నివాసం అమెరికాకు మారింది. అక్కడ ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ అనే రెస్టారెంట్‌లో దాదాపు నాలుగేళ్లు షెఫ్‌గా పని చేశాను.
దుబాయ్ నుంచి వచ్చి...
అమెరికా నుంచి భారత్‌కు వచ్చాక... సంజయ్ తుమ్మ అని మా అత్తమ్మ వాళ్ల సోదరుడు. ఆయన షెఫ్... ఒక రోజు మా ఇంటికి వచ్చారు. ‘‘నువ్వు షెఫ్ కదా. నా ‘వారెవా’ చానల్‌కు రావచ్చు కదా’ అన్నారు. అలా కెమెరా ముందు వంటలు చేయడం మొదలైంది. ఏడాదిన్నర తరువాత మేం దుబాయ్ వెళ్లాం. అక్కడ మూడేళ్లున్నాం. ఆ సమయంలో ఓ ప్రముఖ తెలుగు చానల్‌లో నాకు అనుకోని అవకాశం వచ్చింది. శివరామకృష్ణన్ అని షెఫ్... ‘వారెవా’లో చేస్తున్నప్పుడు ఆయన నా వంటలు చూసి, ఈ అవకాశం ఇప్పించారు. దుబాయ్ నుంచి నెలకు రెండు రోజులు హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసి వెళ్లేదాన్ని. ఏడాదిన్నర తరువాత గోవాకు... అక్కడ రెండేళ్లు ఉన్నాక హైదరాబాద్‌కు వచ్చాం. ఆ చానల్‌లో నా షో ఇప్పటికీ టాప్ రేటింగ్‌లో నడుస్తూనే ఉంది. రోజూ ఉదయం అరగంట వస్తోంది. ఆ షో ద్వారానే నేను చాలామందికి తెలిశాను.
స్నేహితురాలి సూచనతో...
ఒకసారి నా స్నేహితురాలు యషు అంది... ‘అందరూ యూట్యూబ్ చానల్ పెడుతున్నారు. మనం కూడా స్టార్ట్ చేద్దాం’ అని. సరేనన్నాను. ‘స్వప్న వైట్ల’ అని నా పేరుతోనే గత ఏడాది సెప్టెంబర్‌లో చానల్ ప్రారంభించాం కానీ, పెద్దగా పట్టించుకోలేదు. అయితే నా పెళ్లి రోజున మా జంట, నా స్నేహితురాలి జంట కలిసి రాజమండ్రి వెళ్లాం. అక్కడ రోడ్డు మీద కర్రపెండలం దుంప కనిపించింది. ఆ షాట్ తీసి మా చానల్‌లో పెడితే బాగా వైరల్ అయింది. ఆ ఉత్సాహంతో రెగ్యులర్‌గా వీడియోలు అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాం. వీడియో ఓపెన్ అవ్వగానే ‘హలో’ అనే నా పలుకరింపు వినిపిస్తుంది. ‘రండి... కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం’ అని ప్రతి వీడియోలో చెబుతాను. అది నెటిజనులకు బాగా కనెక్ట్ అయింది. చెప్పినట్టుగానే ప్రతి కామెంట్‌కూ సమాధానం ఇస్తాం. నేను వంట చేస్తే, యషు షూట్ చేస్తుంది. మొన్నటి వరకూ అన్నీ మేమే చూసుకున్నాం. ఇప్పుడు నిధి అని మరొక అమ్మాయిని తీసుకున్నాం. తను ఎడిటర్. షూటింగ్ కోసం ఎక్కడికైనా సరే... మేం కారు వేసుకుని వెళ్లిపోతాం.
మూడు లక్షలు...
క్రమంగా మా చానల్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఏడాదిలో దాదాపు మూడు లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్ వచ్చారు. వెజ్, నాన్‌వెజ్ వంటలతో పాటు స్వీట్స్ తయారీ కూడా చూపిస్తున్నాను. నా వంటల్లో నాకు బాగా ఇష్టమైంది బిర్యానీ. ఏ బిర్యానీ అయినా సరే... అద్భుతంగా వండుతాను. కుకింగ్‌తో పాటు కిచెన్ టిప్స్, ట్రావెలింగ్‌కు సంబంధించిన కంటెట్ కూడా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం పది గంటలకు కుకరీ వీడియో అప్‌లోడ్ అవుతుంది. ప్రమోషన్ వీడియోలైతే మధ్యాహ్నం ఒంటి గంటకు పెడతాను. ఇప్పటి వరకు మొత్తం 1,200 వీడియోలు ఉన్నాయి నా చానల్‌లో. వ్యూస్ కూడా లక్షల్లో వస్తున్నాయి. పని ఒత్తిడిలో తీరిక దొరకని ఉద్యోగస్తులైన మహిళలకు సులువుగా, తక్కువ సమయంలో, కొద్దిపాటి ఆహార పదార్థాలతో వండుకొనే వంటలే ఎక్కువగా చూపిస్తాను. అలాగే నేను బేబీ ఫుడ్ బాగా చేస్తాను. వాటికి చాలామంది అభిమానులు ఉన్నారు.
ఎక్కడికి వెళ్లినా గౌరవిస్తున్నారు...
మొదట నేను ఇంట్లోనే రకరకాల వంటలు వండేదాన్ని. విదేశాలకు వెళ్లడం, అక్కడ హోటల్స్‌లో పని చేయడంవల్ల చాలా నేర్చుకున్నాను. అక్కడ షెఫ్ అంటే ఎంతో ప్రత్యేకంగా చూసేవారు. ఇక్కడ కూడా ఎంతో గౌరవిస్తున్నారు. బీటెక్‌లు, ఎంటెక్‌లు చదివినవారు కూడా నన్ను చూసి గొప్పగా చెప్పుకొంటున్నారు. దీని అంతటికీ కారణం వంట మీద నాకు ఉన్న ప్రేమ. చిన్నప్పటి నుంచి నాకు వంట చేయడం ఇష్టం. తరువాత అభిరుచిగా మారింది. అందరికీ వండి పెట్టడం, బాగుందని వాళ్లు తృప్తిగా తిని వెళ్లడం... నాకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయి. ఇంట్లోనే కాదు... ఎక్కువ మందికి కూడా నేను వండగలను. బిర్యానీతో పాట కేక్‌లు అద్భుతంగా చేస్తాను. లాక్‌డౌన్ సమయంలో మా అబ్బాయి పుట్టినరోజుకు కేక్ చేసి, పక్కింటి వాళ్లకు పంపించాం. అది తిని వాళ్లు ‘ఆర్డర్ ఇస్తే చేస్తారా’ అని అడిగారు. అక్కడి నుంచి కాలనీవాళ్లందరూ ఆర్డుర్లు ఇచ్చారు. ఒక్క లాక్‌డౌన్‌లోనే పది వేల కేక్‌లు చేసుంటాను.’’
ఆవిడ సహకారమే లేకపోతే...
యూట్యూబ్, టీవీ షోస్, ప్రమోషన్ షూట్స్... ఉదయం లేచింది మొదలు నాకు అసలు తీరికే దొరకదు. ఒక్కోసారి ఇంట్లోవాళ్లతో గడిపే సమయం ఉండడంలేదు. అయినా ఇవన్నీ చేయగలుగుతున్నానంటే అందుకు నా భర్త, మా అత్తమ్మ శకుంతల సహకారమే కారణం. ముఖ్యంగా అత్తమ్మ... నేను ఉన్నా లేకపోయినా మా పిల్లలిద్దర్నీ చూసుకొంటుంది. వాళ్లకు కావల్సినవన్నీ సమకూరుస్తుంది. మా పెద్దబ్బాయి ధృవ్ వైట్ల ఏడు, చిన్నవాడు విధు వైట్ల ఐదో తరగతి చదువుతున్నారు. నా కోరిక ఒక్కటే... ఓ ఇరవై ఏళ్ల తరువాత ఊరికి దూరంగా ఒక పెద్ద ఫామ్‌హౌస్ తీసుకొని, అందులో చిన్న హోటల్ పెట్టుకొని, ప్రశాంతంగా జీవించాలి. అలాగే వీలైనన్ని ప్రదేశాలు చుట్టిరావాలి. నేను షెఫ్‌నే కాదు... సూపర్ డ్రైవర్‌ని కూడా. నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఎంత దూరమైనా డ్రైవింగ్ చేయగలను.
గోవా ట్రిప్... సూపర్ హిట్...
ఏటా వేసవి సెలవులకు మేం పిల్లలతో గోవా వెళతాం. గత ఏడాది వెళ్లినప్పుడు అక్కడి జీవన విధానం, సంస్కృతి, సంత... ఇవన్నీ షూట్ చేసి, ఒక సిరీ్‌సలా చూపించాను. అది బాగా క్లిక్ అయింది. గోవాకు వెళ్లాలనుకొనే తెలుగువారికి ఆ వీడియో ఒక గైడ్‌లా మారిపోయింది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతం ప్రత్యేకత గురించి వివరిస్తూ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను.
హనుమా
Updated Date - 2023-10-21T16:28:43+05:30 IST