Sri Shankara Jayanti : అద్వైతమూర్తి
ABN, First Publish Date - 2023-04-21T00:17:10+05:30
‘‘వ్యాసుడు శ్రీ నారాయణ స్వరూపుడైతే... ఆది శంకరులు ఈశ్వర స్వరూపం. మానవజాతికి అపారమైన సేవ చేయడానికీ, ప్రపంచంలోని కష్టాన్నీ, దుఃఖాలనూ ప్రతిఘటించడానికీ అవతరించిన...
25న శ్రీ శంకర జయంతి
‘‘వ్యాసుడు శ్రీ నారాయణ స్వరూపుడైతే... ఆది శంకరులు ఈశ్వర స్వరూపం. మానవజాతికి అపారమైన సేవ చేయడానికీ, ప్రపంచంలోని కష్టాన్నీ, దుఃఖాలనూ ప్రతిఘటించడానికీ అవతరించిన శ్రీ శంకరులు... సత్యం, జ్ఞానం కన్నా మిన్న లేదని ప్రవచించారు. ప్రాపంచిక బాధా నివారకాలైన ఉపదేశాలను మానవాళికి అందించారు.’’
- కంచి మహాస్వామి
పుణ్య దంపతులైన శివగురు, ఆర్యాంబలకు కేరళలోని కాలడిలో... ఎనిమిదేళ్ళ ఆయుర్దాయంతో ఆదిశంకరులు జన్మించారు. ఆపత్సన్యాసం స్వీకరించి, పరివ్రాజకుడై, సద్గురువు కోసం సంచరిస్తూ... నర్మదా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ గోవింద భగవత్పాదులను సేవించి.. క్రమ సన్యాసాన్నీ, ‘శంకర భగవత్పాదాచార్యులు’ అనే యోగపట్టాన్నీ పొందారు. గురువు ఆదేశం మేరకు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించారు. విశ్వనాథుడి అనుగ్రహంతో వేదవ్యాసుడి దర్శనం లభించింది. వ్యాసుడి ఆజ్ఞ మేరకు... ప్రస్థానత్రయానికి భాష్యాలనూ, ప్రకరణ గ్రంథాలనూ రచించారు. అనంతరం... వైదిక మతోద్థరణ కోసం, సనాతన సంస్కృతిని పరివ్యాప్తం చెయ్యడానికి దేశ సంచారం చేయాల్సిందిగా వ్యాసుడు ఆదేశించారు. పుట్టుకతో ప్రాప్తించిన ఎనిమిదేళ్ళ ఆయుర్దాయం... నిజ సన్యాసం స్వీకరించడంతో పదహారేళ్ళకు పెరిగింది. తన ఆదేశాలను ఆచరణలో పెట్టడానికి వీలుగా... ఆ ఆయుర్దాయాన్ని వ్యాసులవారు ద్విగుణీకృతం చేశారు. ఈ ముప్ఫై రెండేళ్ళ జీవన కాలంలోనే... శాఖోపశాఖలుగా చీలిపోయి, అస్తవ్యస్తంగా ఉన్న హిందూ ధర్మాన్ని శ్రీ శంకరులు ఒక తాటి మీదకు తెచ్చారు. వైదిక ధర్మాన్ని పునరుజ్జీవింపజేశారు. ఆపత్సన్యాసానికి అనుమతించిన తల్లికి... తనను తలచుకున్న వెంటనే వస్తాననీ, ఆమె అవసాన సమయంలో కుమారునిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాననీ శంకరులు మాట ఇచ్చారు. తల్లి కైవల్యం పొందినప్పుడు... పండితుల అభ్యంతరాన్ని సైతం లెక్క చెయ్యకుండా స్వయంగా అంత్యక్రియలు జరిపి, మాతృభక్తికి ఆదర్శంగా నిలిచారు.
శంకరుల కాలం నాటికి అవైదిక మతాల విజృంభణ కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో... వేటికవిగా ఉన్న వివిధ శాఖలన్నిటినీ ఒక తాటి పైకి తెచ్చి, వాటిలోని ఛాందస భావాలను శ్రీ శంకరులు నిర్మూలించారు. ‘షణ్మత స్థాపనాచార్యులు’గా వినుతికెక్కారు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోని క్షేత్రాలనూ సందర్శించారు. అనేక ఆలయాలను పునరుద్ధరించారు. కొన్నిటిలో శ్రీ చక్రాలనూ, యంత్రాలనూ ప్రతిష్ఠించి, నిత్య నైమిత్తిక కర్మలనూ, పూజా విధానాలనూ నిర్దేశించారు. తద్వారా ఆలయ వ్యవస్థను పటిష్టం చేశారు. శ్రీ శంకరులు మానవీయతకు మారుపేరు. ఆపత్సన్యాసం స్వీకరించగానే భిక్షకు వెళ్ళినప్పుడు, దీనురాలైన ఒక గృహిణి సిగ్గుతో, సంకోచంతో ఒక ఉసిరికాయను భిక్షాపాత్రలో సమర్పించడం గమనించారు, ఆయన హృదయం చలించింది. శ్రీ మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంతో అర్చించి, ఆ ఇంటి దారిద్ర్యాన్ని రూపుమాపిన కరుణా సముద్రులు శంకరులు. వైదిక ధర్మ పరిరక్షణ కోసం ఆనాటి పండితులతో శంకరులు వాద, ప్రతివాదాలు చేశారు. ప్రత్యర్థులందరూ ఆయన కన్నా వయసులో పెద్దవారే. ఆ పండితులను ఓడించినప్పటికీ, వారి పట్ల అమితమైన గౌరవ ప్రతిపత్తులు ప్రదర్శించారు. ఉదాహరణకు మండనమిశ్రునితో వాదించి, గెలిచి, అతని ప్రతిభకు మెచ్చి, తాను సంకల్పించిన చతురామ్నాయాలలో శృంగేరి పీఠానికి తొలి అధిపతిగా నియమించారు. తమ వాద ప్రతివాదాలకు న్యాయ నిర్ణేతగా ఉన్న మండనమిశ్రుని భార్య ఉభయభారతి సాక్షాత్తూ శారదాదేవేనని గ్రహించి... శృంగేరి పీఠంలో శారదామాతగా కొలువై ఉండాలని అర్థించారు. ఆయనది అద్భుతమైన మేధాశక్తి. అనేక ప్రకరణ గ్రంథాలు, ఇరవై మూడు భాష్య గ్రంథాలు, తాను దర్శించిన దేవీ దేవతలపై అసంఖ్యాకంగా స్తోత్రాలు, లహరులు రచించారు. తన పాండితీ వైభవంతో సంస్కృత వాఙ్మయాన్ని పరిపుష్ఠం చేశారు. వైదిక మతం వర్థిల్లడానికీ, తాను సూత్రీకరించిన అద్వైత సిద్ధాంత వ్యాప్తికి భారతదేశం నాలుగు దిక్కులా చతురామ్నాయాలను (పీఠాలను) స్థాపించారు. అవి: పశ్చిమాన ద్వారక, తూర్పున పూరీ, ఉత్తరాన బదరి, దక్షిణాన శృంగేరి పీఠాలు. వాటి నిర్వహణకు కావలసిన అన్ని అంశాలనూ... పీఠ నియమాలు, వ్యాప్తి చేయాల్సిన ధార్మిక అంశాలు, పీఠ నామం, పఠించాల్సిన వేదం, మహావాక్యం, పీఠంలో అధిష్ఠాన శక్తి, తీర్థం, క్షేత్రం, యోగపట్టం మొదలైనవన్నిటినీ శంకరులు నిర్దేశించారు. తొలి పీఠాధిపతులుగా తన నలుగురు శిష్యులను నియమించారు.
తాను కంచిలోని కామాక్షీ పీఠాన్ని అధిరోహించి, ఏకామ్రేశ్వరుని సేవించి... కొంతకాలం కామాక్షీ ఏకామ్రేశ్రుల సన్నిధిలో గడిపారు. ఆ పీఠాన్ని ముఖ్య శిష్యునికి ‘సరస్వతి’ యోగపట్టంతో అనుగ్రహించి, తిరిగి ఉత్తరదేశ యాత్రకు వెళ్ళారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన పండితులను పరాజితులను చేసి, కాశ్మీరంలో ఉన్న శారదాదేవి మందిరంలోని సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించారు. తన గురువైన గోవింద భగవత్పాదుల గురువు శ్రీ గౌడపాదులను సందర్శించాలనే కోరిక అప్పటికే చాలాకాలంగా శంకరుల మనస్సులో మెదులుతోంది. ఆయనలోని ఆ ఆకాంక్ష మరీ అధికం కావడంతో... ఆ సంకల్ప శక్తి ఫలితంగా... శ్రీ గౌడపాదులు సాక్షాత్కరించారు. శంకరులు ఆనంద పారవశ్యంతో పాదాభివందనం చేశారు. అప్పుడు గౌడపాదులు ‘‘శంకరా! నీ ఆయువు పూర్తి కావస్తున్నది. నీ కృషి ఫలించింది. నీ అవతారాన్ని శివదర్శనంతో పూర్తి చేసుకొని, కైవల్యం పొందు’’ అని ఆదేశించారు. ఆ ఆనతి మేరకు శ్రీ శంకరులు కేదారనాథ్ వెళ్ళి, శివుణ్ణి దర్శించారు. ఉత్తరంగా పయనించి, అనంత విశ్వంలో లీనమయ్యారు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం- నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్
ఎ. సీతారామారావు
Updated Date - 2023-04-21T00:17:10+05:30 IST