Sadhguruvani : తలరాత మనమే రాసుకోవచ్చు
ABN, First Publish Date - 2023-09-22T03:34:07+05:30
"మన విధిని, అంటే మన తలరాతను మనమే రాసుకోగలమా?’’ అనే ప్రశ్న నాకు ఎదురయింది. ఇది చాలా ఆసక్తికరమైన, అవసరమైన ప్రశ్న. దీనికి నేను చెప్పే సమాధానం: అవును. మన తలరాత మనమే రాసుకోవచ్చు, రాసుకోవాలి కూడా!
"మన విధిని, అంటే మన తలరాతను మనమే రాసుకోగలమా?’’ అనే ప్రశ్న నాకు ఎదురయింది. ఇది చాలా ఆసక్తికరమైన, అవసరమైన ప్రశ్న. దీనికి నేను చెప్పే సమాధానం: అవును. మన తలరాత మనమే రాసుకోవచ్చు, రాసుకోవాలి కూడా! ఎందుకంటే ‘మానవుడు’ అనే మాటకు అదే అర్థం. మిగతా అన్ని జీవులకు నిర్దిష్టమైన జీవచక్రం ఉంటుంది. దానివల్ల వాటికి సమస్య లేదు. ఎందుకంటే వాటి పరిమితి అంతవరకే. మీ జీవితాన్ని గమనిస్తే... వాటికన్నా మీరు భిన్నంగా చేస్తున్నవి పెద్దగా ఏవీ లేవు. అవి జన్మిస్తాయి, మీరూ జన్మిస్తారు. అవి పెరుగుతాయి, మీరూ పెద్దవుతారు. అవి పునరుత్పత్తి చేస్తాయి, మీరూ చేస్తారు. అవి మరణిస్తాయి. మీరూ మరణిస్తారు. మరి దీనిలో పెద్ద తేడా ఏమీ లేదు కదా?
కానీ ఇవే పనులు మనం ఎరుకతో చేయవచ్చు. మానవునిగా జీవించడంలోని ప్రాధాన్యత అదే. మీరు మీ చేతిని ఎరుకతో ఉపయోగిస్తే... అది మీరు ఎలా చెబితే అలా చేస్తుంది. మీరు ఒక ఆలోచనను ఎరుకతో తీర్చిదిద్దుకుంటే... అది ఎలా కావాలంటే అలా మారుతుంది. మీ ఆలోచన మీరు చెప్పినట్టు విన్నట్టయితే.. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోగలరు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు... ఇక మీ జీవితం ఆనందాన్ని వెతకడంలో నిమగ్నం కావలసిన అవసరం ఉండదు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు... ప్రజలు సాధారణంగా గొప్పగా పరిగణించే విషయాలైన ప్రశాంతత, సంతోషం అనేవి అసలు పెద్ద విషయాలే కావని అనిపిస్తుంది. అదే కనుక జరిగితే... మీ జీవితం మొత్తం ఎంతో సజావుగా సాగుతుంది.
మీకు ఎప్పుడూ ఏదో కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఏదో సాధించాల్సిన అవసరం లేకపోతే, మీ జీవితం సంపూర్ణంగా ఉంటే... చాలా హాయిగా ఉంటుంది. అప్పుడు మీకు ఉద్యోగం చేయడం, సంపాదించడం, ప్రేమలో పడడం, కేవలం సంతోషంగా ఉండడం... ఇవేవీ పెద్ద విషయాలుగా అనిపించవు. ఎందుకంటే మీరు కేవలం కూర్చొని... మీలో మీరు అత్యంత ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు కాబట్టి. మీ జీవితం ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? సహజంగానే మీకు అవగాహన లేని విషయాలను అన్వేషిస్తారు. ఆధ్యాత్మిక పద్ధతులు, చింతన ఈ విధంగానే మొదలవుతాయి. అప్పుడు మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు... అనవసరమైన వాటికోసం, వాటివల్ల లభించే సంతోషం కోసం పాకులాడరు. మీకు దేని గురించీ చింత ఉండదు. ఏదో జరిగిపోతుందనే ఆందోళన ఉండదు. ప్రతి పనీ సంపూర్ణంగా చేస్తారు. ఏం జరిగినా సరే... మీరు బాగుంటారని మీకు తెలుసు. అందువల్ల సహజంగానే మీరు అన్ని పనులూ అద్భుతంగా చేయగలరు. ఎందుకంటే మీకు స్వార్థం ఉండదు. కాబట్టి ఏది అవసరమో దాన్ని సునాయాసంగా చేసేస్తారు. ఇతరులకు కష్టంగా అనిపించేది... మీరు చాలా ఉల్లాసంగా చేస్తారు. మీ తలరాతను మీరు రాసుకోవడం అంటే అదే!
సద్గురు జగ్గీవాసుదేవ్
Updated Date - 2023-09-22T03:34:07+05:30 IST