Onions: ఉల్లాసంగా... ఉల్లికాడలతో!
ABN, First Publish Date - 2023-02-24T22:53:56+05:30
ఏ కూరలో అయినా ఉల్లిపాయల టచ్‌లేనిదే టేస్ట్ రాదు. ఉల్లిపాయలతోనే కాదు లేత ఉల్లికాడలతో కూడా రుచికరమైన ఆహారాన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు.
వంటిల్లు
ఏ కూరలో అయినా ఉల్లిపాయల టచ్‌లేనిదే టేస్ట్ రాదు. ఉల్లిపాయలతోనే కాదు లేత ఉల్లికాడలతో కూడా రుచికరమైన ఆహారాన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు.
ఉల్లికాడల చికెన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు:
చికెన్- అరకేజీ, అల్లం, వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు, పసుపు- టీస్పూన్, ఉప్పు- రుచికి తగినంత, కారం- 2 టీస్పూన్లు, ఉల్లికాడలు- 20, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర- టీస్పూన్, బిర్యానీ ఆకు-1, పచ్చిమిర్చి- 3(సన్నగా తరగాలి), ధనియాలపొడి- 2 టీస్పూన్లు, గరంమసాలా- టీస్పూన్, చికెన్ మసాలా పొడి- టీస్పూన్
తయారీ విధానం:
బౌల్‌లో శుభ్రం చేసిన చికెన్ తీసుకుని అందులోకి టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి బాగాకలపాలి. దీన్ని మారినేట్ చేసుకుని పెట్టుకోవాలి.
ఉల్లికాడలు, ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్‌లో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కదుపుతూ వేయించుకోవాలి. పది ఆకులు కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లికాడలను వేసి అవి మెత్తగా అయ్యేవరకూ వేపాలి. టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. మార్నేట్ చేయించిన చికెన్ ముక్కలను వేసి మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత కప్పు నీళ్లు పోసి హైఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి పది నిముషాలు కుక్ చేయాలి. దీనికి ఉప్పు, రెండు టీస్పూన్ల కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత హైఫ్లేమ్‌లో ఉంచి పది నిముషాల పాటు కుక్ చేయాలి. తర్వాత చికెన్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. రెండు నిముషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చికెన్ మిశ్రమాన్ని కదపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని అన్నంతో లేదా చపాతీతో తినేయాలి.
గ్రీన్ పీనట్ మసాలా కర్రీ
కావాల్సిన పదార్థాలు
ఉల్లికాడలు- 200 గ్రాములు, పల్లీలు- గుప్పెడు, మిరియాలు- పావు టీస్పూన్, వెల్లుల్లి- 10 రెబ్బలు, నూనె- టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు-3, ఆవాలు- పావు టీస్పూన్, జీలకర్ర- పావు టీస్పూన్, ఉప్పు- తగినంత, కరివేపాకు- 20, అల్లం,వెల్లుల్లి పేస్ట్- అరటీస్పూన్, పసుపు- చిటికెడు, పచ్చిమిర్చి- 3(సన్నగా తరగాలి), ధనియాలు- అరటీస్పూన్, గరం మసాలా- అరటీస్పూన్, కారంపొడి- అరటీస్పూన్, పెరుగు- 2 టీస్పూన్లు
తయారీ విధానం
ఉల్లికాడలను సన్నగా తరగాలి. వాటికి ఉండే ఉల్లిపాయలను కూడా సన్నగా తరగాలి. పల్లీలను వేయించి చిన్నరోలులో దంచి పక్కనబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే రోలులో మిరియాలు దంచి అందులో వెల్లుల్లిని కూడా వేసి దంచి.. ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నూనె వేసి ఎండు మిరపకాయలను సన్నగా తుంచి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేశాక తరిగిన ఉల్లిపాయలను వేసి గరిటెతో కదుపుతూ వేయిస్తుండాలి. తగినంత ఉప్పు, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లో నిముషం పాటు వేయించాక అల్లం,వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి ముక్కలను వేసి మిశ్రమంలో కలపాలి. ఇందులో క్రష్ చేసిన మిరియాలు, వెల్లుల్లి మిశ్రమం వేసి గరిటెతో తిప్పుతూ వేయించాలి. గరంమసాలా, కారం, ధనియాలపొడి వేశాక పెరుగు వేసి మిశ్రమాన్ని బాగా వేయించాలి. ఇందులో ఉల్లికాడల ముక్కలు వేసి బాగా కలపాలి. ఉప్పును సరిచూసుకున్న తర్వాత పల్లీల పొడి వేసి రెండు నిముషాలు వేయించాక.. స్టవ్ ఆఫ్ చేయాలి. గ్రీన్ ఆనియన్ పీనట్ మసాలా కర్రీని చపాతీ లేదా జొన్నరొట్టెలతో తింటే రుచికరంగా ఉంటుంది.
ఉల్లికాడల పకోడి
కావాల్సిన పదార్థాలు
ఉల్లికాడలు- కట్ట, శనగపిండి- కప్పు, గరం మసాలా- టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి-2, ఉప్పు- తగినంత, నూనె- డీప్ ఫ్రైకి సరిపడ
తయారీ విధానం
బౌల్‌లో సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి అందులో పచ్చిమిర్చి, శనగపిండి, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో నీళ్లుపోసి పకోడాలకు తగినట్లు కలపాలి. ప్యాన్‌లో నూనె వేసి పకోడిలను చేసుకోవాలి. వేడివేడిగా సాయంత్రంపూట ఈ ఆహారాన్ని చేసుకుని స్నాక్స్‌లా తినాలి.
పనీర్ హరా ప్యాజ్
కావాల్సిన పదార్థాలు
సన్నగా తరిగిన ఉల్లికాడలు- 100 గ్రాములు, నూనె- 3 టేబుల్ స్పూన్లు, పనీర్ క్యూబ్స్- 200 గ్రాములు, జీలకర్ర- టీస్పూన్, గార్లిక్ పేస్ట్- 2స్పూన్లు, ఉల్లికాడల వైట్ పార్ట్- అరకప్పు(సన్నగా తరగాలి), సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 2టీస్పూన్లు, తరిగిన టమోటా ముక్కలు- పావు కప్పు, ధనియాల పొడి- టీస్పూన్, టమోటా కెచప్- 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి- 2 టేబుల్ స్పూన్లు, పసుపు- అర టీస్పూన్, ఉప్పు- తగినంత, గరం మసాలా- అరటీస్పూన్, హోల్ మిల్క్- అరకప్పు, ఎక్కువ క్రీమ్ ఉండే మలై- పావు కప్పు
తయారీ విధానం
ప్యాన్‌లో వేసిన నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను వేసి అన్నివైపులా గోల్డెన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి. వీటిని బౌల్‌లో వేసి కొద్దిగా నీళ్లను పోసి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన నూనెలో జీలకర్ర వేసి కదపాలి. గార్లిక్ పేస్ట్, ఉల్లికాడలకు ఉండే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గరిటెతో బాగా కదుపుతూ రెండు నిముషాలు వేయించాక టమోటా ముక్కలు, టమోటా కెచప్ వేసి మరో రెండు నిముషాలు మిశ్రమాన్ని వేయించాలి. ధనియాలపొడి, కారం పొడి, పసుపు, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి మూడు నిముషాల పాటు మిశ్రమాన్ని కదుపుతూ వేయించాలి. మసాలా డ్రై అయితే సరిపడ నీళ్లను వేసుకోవాలి. వెంటనే పనీర్ ముక్కలు, హోల్ మిల్క్, మలై, తరిగిన ఉల్లికాడలు వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. పనీర్ ముక్కలను తీసిన తర్వాత మిగిలిన నీళ్లనూ ఇందులో వేయాలి. ఉప్పును సరిచూసుకుని వేడివేడిగా ఈ కర్రీని చపాతిలో లేదా అన్నంతో తినొచ్చు.
Updated Date - 2023-02-24T22:53:57+05:30 IST