ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR Centenary Celebration : ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవం ఓ ప్రపంచ రికార్డ్‌

ABN, First Publish Date - 2023-06-11T02:51:19+05:30

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు యన్‌.టి.రామారావు శతజయంతి ఉత్సవాలు మే 28న ముగిసినా, ఇప్పటికీ దేశవిదేశాల్లో ఏదో రూపేణా ఎన్టీఆర్‌శతజయంతిని పురస్కరించుకొని వేడుకలు సాగుతూ ఉండడం విశేషం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు యన్‌.టి.రామారావు శతజయంతి ఉత్సవాలు మే 28న ముగిసినా, ఇప్పటికీ దేశవిదేశాల్లో ఏదో రూపేణా ఎన్టీఆర్‌శతజయంతిని పురస్కరించుకొని వేడుకలు సాగుతూ ఉండడం విశేషం! గత సంవత్సరం మే 28న ఆరంభమైన ఎన్టీఆర్‌శతజయంతి ఉత్సవం ఈ ఏడాది మే 28 దాకా సాగింది. ఈ సంవత్సర కాలంలో యన్టీఆర్‌పై అభిమానంతో ఎందరెందరో ఎన్నెన్నో పుస్తకాలు, చిత్రపటాలు విడుదల చేసి ఆనందించారు. అలా అగణితంగా సాగిన ఎన్టీఆర్‌శతజయంతి ప్రస్థానంలో మరపురానిది, భావితరాలు సైతం మరచిపోలేని విధంగా తెనాలిలో ఎన్టీఆర్‌చిత్ర ప్రదర్శన సాగింది. గత సంవత్సరం మే 28 నుండి ఈ యేడాది మే 28 దాకా ఎన్టీఆర్‌నటించిన 265 చిత్రాలను ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతివారం ఐదు చిత్రాలు, శని, ఆదివారాల్లో ఎన్టీఆర్‌సినీ, రాజకీయ జీవితాలపై సదస్సులు, రోజుకొక కళాకారునికి సన్మానం జరిగాయి. అలా ఒక్క రోజు కూడా కుంటుపడకుండా ఏడాదిపాటు ఈ ఉత్సవాలను నిర్వహించి ప్రపంచ చరిత్రలో ఓ అరుదైన అధ్యాయాన్ని లిఖించారు. ఈ అరుదైన ఘనతకు కర్త, కర్మ, క్రియ అనదగ్గవారు ముగ్గురు... మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ప్రముఖ రచయిత డాక్టర్‌ బుర్రా సాయిమాధవ్‌, ఎన్టీఆర్‌వీరాభిమాని,

నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు. ఈ ఘనత వెనుక వారి కృషి, దీక్ష, పట్టుదల ఎలాంటిదో ‘నవ్య’ పాఠకుల కోసం.

ప్రపంచంలో ఎక్కడా జరగలేదు - ఆలపాటి

‘ఎన్టీఆర్‌వల్లే తెలుగు నేలపై రాజకీయ చైతన్యం వచ్చింది. ఆయన నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ద్వారానే నేను రాజకీయాల్లో రాణించాను. అందువల్ల ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని భావించాను. బుర్రా సాయిమాధవ్‌, కొమ్మినేని వెంకటేశ్వరరావు నన్ను కలసి, యేడాది పాటు అభిమానులకు ఉచితంగా సినిమాలు ప్రదర్శించాలన్న సంకల్పం వివరించారు. పైనున్న పెద్దాయన ఆశీర్వాద బలంతో ఏ ఆటంకమూ కలుగకుండా శతజయంతి సాగింద’ని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ అంటే ప్రాణం- సాయిమాధవ్‌

‘ఎన్టీఆర్‌ నటించిన సినిమాలను ఏడాది పాటు ప్రదర్శించాలన్న ఆలోచన మిత్రులు కొమ్మినేని వెంకటేశ్వరరావుది. ఎన్టీఆర్‌ గారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలన్న ఆలోచన గురించి నాకు చెప్పారు. నేను యన్టీఆర్‌ వీరాభిమానిని. ఆయన కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. అందువల్ల మరోమాట లేకుండా సరే అన్నాను’ అని బుర్రా సాయిమాధవ్‌ అన్నారు. ప్రతి నెల చివరి శనివారం రంగస్థల ప్రముఖులకు సన్మానంతో పాటు ఎన్టీఆర్‌ రంగస్థల అవార్డు, పదివేల నగదు బహుమానం అందించామని, చివరి ఆదివారం యన్టీఆర్‌తో అనుబంధం ఉన్న సినీ ప్రముఖుల్లో ఒకరికి సన్మానంతో పాటు ఎన్టీఆర్‌ చలనచిత్ర అవార్డు, బంగారు పతకం అందించామని చెప్పారు. కె.రాఘవేంద్రరావు, జయసుధ, జయప్రద, జయచిత్ర, ప్రభ, రాజశ్రీ, భారతీ విష్ణువర్ధన్‌, రాజేంద్రప్రసాద్‌, అశ్వనీదత్‌, మురళీమోహన్‌ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారన్నారు. ఘంటసాల, సావిత్రి, బి.నాగిరెడ్డి, పీతాంబరంలకు ఎన్టీఆర్‌ జీవితంలో ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా వారి వారసులను సన్మానించడం అందరి అభినందనలూ అందుకుందని ఆయన భావించారు. ఈ ఎన్టీఆర్‌ అవార్డును అందుకోవడానికి యాభై సంవత్సరాల తరువాత ఎనభై ఏళ్ళ వయసులో నటి ఎల్‌.విజయలక్ష్మి అమెరికా నుండి వచ్చి, అన్నగారి అభిమానుల అభినందనలూ అందుకున్నారని సాయిమాధవ్‌ అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎన్టీఆర్‌ దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు, ఆయనతో కలిసి నడిచిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి రాజకీయనాయకులు పాల్గొనడం విశేషం. ‘ప్రతి నెలా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు విచ్చేసి, వారి చేతుల మీదుగా అందరినీ సన్మానించడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలచింది’ అని సాయిమాధవ్‌ తెలిపారు.

ఈ జన్మకు ఇది చాలు- కొమ్మినేని

‘మాకు తెలిసి ప్రపంచంలోనే ఏ నటునికీ జరగని విధంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను నిర్వహించగలిగాం. ఎన్టీఆర్‌ అభిమానిగా జన్మించడమే ఓ అదృష్టంగా భావించే మాకు ఈ శతజయంతి ఉత్సవాల నిర్వహణయే చాలు ఈ జన్మకు’ అంటూ తన వీరాభిమానాన్ని ప్రదర్శించారు కొమ్మినేని వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్‌ మొత్తం 302 చిత్రాలలో నటించగా, వాటిలో 280 తెలుగు సినిమాలు. అందులో 265 చిత్రాలను సంపాదించగలిగామని కొమ్మినేని చెప్పారు. అందుకోసం 2021లోనే ఓ ప్రణాళిక ప్రారంభించామని, అప్పటి నుంచీ ఎన్టీఆర్‌ చిత్రాలను సేకరిస్తూ వచ్చామని, వాటిలో సరిగా లేని ప్రింట్లను డిజిటలైజ్‌ చేయించి మరీ నవతరం ప్రేక్షకులకు ప్రదర్శించామని, అందుకోసం ఓ స్పెషల్‌ ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

తెనాలిలో ఒకప్పుడు ఎన్టీఆర్‌ నిర్మించి, తరువాత అమ్మేసిన రామకృష్ణ థియేటర్‌ ప్రస్తుతం పెమ్మసాని రామకృష్ణ థియేటర్‌గా చెలామణీ అవుతోందని, తమ సంకల్పం వారికి వివరించగానే థియేటర్‌ యాజమాన్యం కూడా ఆనందంగా ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవం ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ విధంగా ప్లాన్‌ చేశామని, అందుకే ఈ అంశాన్ని ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో నమోదు చేయించడానికి పంపించామని, తప్పకుండా గిన్నిస్‌ రికార్డ్‌ నమోదు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే గ్రాండ్‌ ఫినాలే ఫంక్షన్‌ భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని చెప్పారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా జేజేలు అందుకున్న ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ అడగక్కర్లేదు. ఆయన ‘ప్రపంచరత్న’.

- కె.రాఘవేంద్రరావు

నా సినీ, వ్యక్తిగత జీవితాలు రెండూ ఎన్టీఆర్‌ గారిని ఆదర్శంగా తీసుకొనే రూపుదిద్దుకున్నాయి. నాకు లభించిన కీర్తి మొత్తం ఆయన వల్లనే లభించింది. అందుకే ఎన్టీఆర్‌ శతజయంతి అవార్డు అ దుకోవడానికి అమెరికా నుండి ఈ వయసులో కూడా ఇక్కడకు వచ్చాను.

- ఎల్‌.విజయలక్ష్మి

ఎన్టీఆర్‌ గారి సినీపర్వంలో కలర్‌ అధ్యాయం మొదలయ్యాక ఆయనతో ఎక్కువ చిత్రాలలో నటించే అదృష్టం నాకు కలిగింది. ఎన్టీఆర్‌ చివరి సినిమాగా విడుదలైన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లో ఆయనతో నటించే భాగ్యమూ నాకే దక్కింది.

- జయసుధ

నేను చిన్నతనం నుంచీ ఎన్టీఆర్‌ అభిమానిని. ఆయన ‘నర్తనశాల’ చూసిన తరువాతే నాట్యంపై ఇష్టం పెంచుకున్నాను. ఎన్టీఆర్‌ గారితో నటించిన తొలి సినిమా ‘అడవిరాముడు’తోనే స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్నాను. ఎన్టీఆర్‌ గారు స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’తోనే నా రాజకీయ జీవితం మొదలయింది. ఎన్టీఆర్‌ గారితో విడదీయరాని బంధం నాది.

- జయప్రద

Updated Date - 2023-06-11T02:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising