ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mulaga.: ములగ... వాత రోగాలకు ఔషధం

ABN, First Publish Date - 2023-09-08T23:49:13+05:30

శిగ్రు మూల ఫల పుష్పమిశ్రితం తైలపక్వమృదకెథ సాధితమ్‌! క్షిప్తసైంధవరజః సహింగుణాజాయతె సురభిదీపనం వసోః!! ‘శిగ్రు’ అంటే ములక్కాడల్ని ‘శోభాంజనం’ అని మనవాళ్లు పిలుస్తారు. ‘మోరింగా’ అని ఇంగ్లీషువాళ్లు అంటారు. తమిళంలో ‘మురున్‌ కాయ్‌’ను తెలుగులో మునక్కాయ్‌ అని, హిందీవాళ్లు ‘మునగ’ అని పిలుస్తారు. కొన్ని శతాబ్దాలుగా భారతీయుల ఆహారంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. క్షేమశర్మ ములక్కాడల్ని, వేళ్లని, పూలనీ కలిపి వండాలన్నాడు. వీలైతే లేత ములగాకుల్ని కూడా చేర్చుకుని వండితే నాలుగు రెట్లు అదనంగా పని చేస్తాయి.

శిగ్రు మూల ఫల పుష్పమిశ్రితం తైలపక్వమృదకెథ సాధితమ్‌!

క్షిప్తసైంధవరజః సహింగుణాజాయతె సురభిదీపనం వసోః!!

‘శిగ్రు’ అంటే ములక్కాడల్ని ‘శోభాంజనం’ అని మనవాళ్లు పిలుస్తారు. ‘మోరింగా’ అని ఇంగ్లీషువాళ్లు అంటారు. తమిళంలో ‘మురున్‌ కాయ్‌’ను తెలుగులో మునక్కాయ్‌ అని, హిందీవాళ్లు ‘మునగ’ అని పిలుస్తారు. కొన్ని శతాబ్దాలుగా భారతీయుల ఆహారంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. క్షేమశర్మ ములక్కాడల్ని, వేళ్లని, పూలనీ కలిపి వండాలన్నాడు. వీలైతే లేత ములగాకుల్ని కూడా చేర్చుకుని వండితే నాలుగు రెట్లు అదనంగా పని చేస్తాయి.

ములక్కాడల కూర ఇలా...

ములక్కాడలను, దాని వేరుని, పూలని తీసుకుని శుభ్రపరచండి. వేరుని, కాడల్ని ముక్కలుగా తరగండి. ఒక బాండీలో కొద్దిగా నూనె తీసుకుని ఈ ముక్కల్ని వేసి, కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా చేస్తే కాడలు, పూలూ వాటి ఆకారం చెడకుండా ఉంటాయి. తరువాత వీటిని నీళ్లలో వేసి, తగినంత సైంధవ లవణం, ఇంగువ కలిపి బాగా మెత్తపడేదాకా ఉడికించాలి. ఉడికిన ముక్కల్ని ఇవతలకు తీసి కోరుకున్న సుగంధ ద్రవ్యాలను చేర్చి కూరగా చేసుకోవచ్చు. శనగపిండి, జొన్న పిండి లేదా మొక్కజొన్న పిండిని నీటితో కరిగించి కలిపి కొద్దిసేపు వేగనిస్తే చాలా కమ్మగా ఉంటుంది.

ములగాకుల కారప్పొడి...

ములగాకులను దంచి కారప్పొడిగా చేసుకుని అన్నంలో రోజూ తినవచ్చు. రోజుకి 10-15 గ్రాముల వరకూ తీసుకోవచ్చు. లేదా టీ కాచుకుని తాగవచ్చు. ములక్కాడలు, పూలు, వేళ్లతో కాచిన సూపు లేదా చారు చాలా శక్తివంతంగా పని చేస్తుంది.

ములక్కాడల పాయసం...

ములక్కాడల పైన గట్టి పొరను చెక్కి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పాలలో వేసి పాయసం వండుతారు. ఏలకులు, పచ్చకర్పూరం జీడిపప్పు లాంటివి తోడుగా ఉండటాన ఈ పాయసం చాలా మృదువుగా పని చేస్తుంది. ముఖ్యంగా సంతానం లేని పురుషుల్లో జీవ కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది.

ములక్కాడలు, పూలు, వేళ్లను కలిపి వండిన కూర తీక్షణంగా పని చేస్తుంది. వేడి చేస్తుంది. శీతల శరీర తత్త్వం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. వాత రోగాలకు ఇది ఔషధం.

స్నాయువులు అనేవి జాయింట్లను బిగించే కండరాలు. అవి శిథిలం కావటం వలన కీళ్లనొప్పులు వస్తాయి. ములక్కాడల కూర ఈ స్నాయువులను శక్తిమంతం చేయటం ద్వారా వాపు, నొప్పుల్ని తగ్గిస్తుంది. వాత వ్యాధులన్నింటిలోనూ ఉపయోగపడుతుంది. నులి పురుగుల్ని చంపుతుంది. కఫాన్ని హరిస్తుంది. గడ్డల్ని కరిగిస్తుంది. లివర్‌ స్ప్లీన్‌లలో వచ్చే వాపుల్ని పోగొడ్తుంది. ములక్కాడల్ని డ్రమ్ములు వాయించే కర్రముక్కలనటం ద్వారా ఇంగ్లీషువాడు దాని ప్రాముఖ్యతని విస్మరించాడు. డ్రమ్ములకన్నా డ్రమ్ము కర్రలకన్నా ముందే ములక్కాడలు పుట్టాయి. డ్రమ్ము కర్రల్ని ములక్కాడలనాలే గానీ, ములక్కాడల్ని డ్రమ్ముస్టిక్స్‌ అనటం తగదు.

కొవ్వు తగ్గిస్తుంది...

ములక్కాడలు, పూలు, దాని వేర్లు, బెరడు, లేత చిగుళ్లు... ఇలా ఈ చెట్టు పంచాంగాలకూ ఒకే విధమైన గుణాలున్నాయి. ఈ పంచాంగాలలో దొరికినవాటిని తీసుకుని నీళ్లలో వేసి సగం నీళ్లు మరిగేంతసేపు ఉడికించి, ఆ నీటిని రోజుకొకసారి చొప్పున భోజనానికి ముందు తాగుతుంటే బీపీ తగ్గుతుంది. రక్తంలో కొవ్వు తగ్గుతుంది. ఒంట్లో బద్ధకం వదులుతుంది. ఉత్సాహం నిండుతుంది. లైంగిక అనాసక్తి కూడా పోతుంది. నెలసరి సమస్యలు తగ్గుతాయి. నడుము, మోకాళ్ల నొప్పులకు ఇది మంచి ఉపాయం. మైగ్రేన్‌ తలనొప్పికి చక్కని నివారణ కూడా. యువతీ యువకుల్లో సహజంగా కలిగే మొటిమల సమస్యను ఇది నివారిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఉబ్బరం తగ్గుతుంది. గ్యాస్‌ సమస్యలకు ఇది చక్కని నివారకం. లివర్‌, స్ల్పీన్‌ పాంక్రియాజ్‌ లాంటి సున్నితమైన అవయావాలలో ఏర్పడే వాపులు, ఇతర సమస్యలను ఇది నివారిస్తుంది. ఎముక పుష్టినిస్తుంది. మెనోపాజ్‌ దాటిన స్త్రీలకు దీని అవసరం ఎక్కువ.

వెంటనే పని చేస్తాయి...

ములక్కాడలు నలుపు, తెలుపు, ఎరుపు... మూడు రంగుల్లో ఎక్కువగా దొరుకుతాయి. మూడింటిలోనూ నల్ల ములక్కాడలు కారపు రుచిలో ఉంటాయి. ఎక్కువ శక్తిదాయకంగా పనిచేస్తాయి. తక్కినవి సౌమ్యంగా ఉంటాయి. ములక్కాడలకున్న తీక్షణ గుణంవల్ల ఇవి తీసుకున్న వెంటనే శరీరం అంతా వ్యాపించగలుగుతాయి. కొద్దిగా వేడి చేస్తాయి. తేలికగా అరుగుతాయి. రుచిని కలిగిస్తాయి. క్షార గుణం కలిగినవి. ఎసిడిటీని నివారిస్తాయి. వగరు రుచి కూడా ఉండటం, ఆహార పీచు అధికంగా కలిగింది కావడంవల్ల షుగరు వ్యాధి మీద, స్థూలకాయం మీద కూడా ములక్కాడలు, పూలు, వేళ్లు, ఆకులు ప్రభావం చూపుతాయి.

కంటి చూపును మెరుగు పరుస్తాయి. పురుషుల్లో జీవ కణాలను పెంపు చేస్తాయి. హృదయానికి శక్తినిస్తాయి. రక్తం పలుచబడేలా చేస్తాయి. అందుకే రక్తస్రావం అయ్యేప్పుడు వీటిని వాడకూడదు. గర్భవతులకు కూడా వీటిని పెట్టకుండా ఉంటేనే మంచిది.

కఫాన్ని, వాతాన్ని తగ్గించటంలో గొప్ప ఔషధంగా పని చేస్తాయి. లివర్‌, స్ప్లీన్‌ అవయావాలలో కలిగే చీము గడ్డలను కరిగిస్తాయి. వాపులను కూడా కరిగిస్తాయి. కడుపులో నులిపురుగుల్ని చంపుతాయి. విష దోషాల్ని హరిస్తాయి. అధికంగా తింటే వేడి చేస్తాయి.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - 2023-09-08T23:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising