Jamuna : సెలవు తీసుకొన్న సత్యభామ
ABN, First Publish Date - 2023-01-27T22:57:20+05:30
పట్నం పిల్లగా పెంకితనం ఇవన్నీ తన కొంగుకు చుట్టేసుకొని, పాతికేళ్ల పాటు కథానాయికగా అలరించిన అలనాటి అందాల తార జమున (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
చలాకీ పాత్రల్లో చిలిపిదనం
గడుసు పాత్రల్లో గాంభీర్యం
పల్లెపడుచు అమాయకత్వం
పట్నం పిల్లగా పెంకితనం ఇవన్నీ తన కొంగుకు చుట్టేసుకొని, పాతికేళ్ల పాటు కథానాయికగా అలరించిన అలనాటి అందాల తార జమున (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1952లో ‘పుట్టిల్లు’ ద్వారా తెరంగేట్రం చేసిన జమున కథానాయికగా స్టార్ హోదా అనుభవించారు. దాదాపు 150 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, హరనాథ్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు.... ఇలా దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టారు. సత్యభామ పాత్రలకు జమున ప్రసిద్ధి. ‘ఆంధ్రా నర్గీ్‌స’గా పేరు తెచ్చుకొన్న జమునది ముక్కుసూటి వ్యవహారం. ఎవరికీ తలొంచేవారు కాదు. ఈ వ్యక్తిత్వమే జమునని మిగిలిన కథానాయికల మధ్య ప్రత్యేకంగా నిలిపింది. రాజకీయాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. పార్లమెంటు సభ్యురాలిగా, నాటక అకాడమీ అధ్యక్షురాలిగా తనలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించుకొన్నారు.
పేరు వెనుక కథ
1936 ఆగస్టు 30న హంపీలో జన్మించారు జమున. తండ్రి పేరు నిప్ఫాణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. జమున పేరు వెనుక ఓ కథ ఉంది. కౌసల్యాదేవి తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చాక జమున కడుపున పడింది. ‘ఆడపిల్ల పుడితే.. జానాబాయి అనే పేరు పెడతా’ అని కౌసల్య మొక్కుకొన్నారు. అనుకొన్నట్టుగానే హంపీలోని పుణ్యక్షేత్రాల్ని దర్శించుకొనే సమయంలో.. కాన్పు అయ్యింది. ఆడపిల్ల పుట్టింది. నక్షత్రం ప్రకారం.. ఓ నది పేరు పెట్టాలని జ్యోతిష్యులు సలహా ఇచ్చారు. హంపీలో యమున ప్రవహిస్తుంది. అలా.. జానాబాయి, యమున రెండూ కలిసొచ్చేలా జమున అనే పేరు పెట్టారు. తొలి చూలు సంతానం కావడం, పుణ్యక్షేత్రాల దర్శనంలో పుట్టడంతో జమునని అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. తండ్రి వ్యాపార రీత్యా మకాం దుగ్గిరాలకు మార్చారు. అక్కడే జమున హైస్కూలు విద్యాభ్యాసం మొదలైంది. చదువులోనే కాదు.. ఆటపాటల్లోనూ జమున ఫస్టే. అంతర్జిల్లా పాటల పోటీల్లో జమునకు మొదటి బహుమతి వచ్చింది. అప్పటి నుంచీ నటన, గానం, సంగీతంలపై మక్కువ ఏర్పడింది. ‘ఛల్లో ఢిల్లీ’ నాటకంలో వసుంధర పాత్ర పోషించారు. అప్పట్లో ప్రజా నాట్యమండలి ఉధృతంగా పనిచేస్తోంది. వాళ్ల దృష్టి జమునపై పడింది. వారి ‘మా భూమి’ నాటకంలో కీలక పాత్ర పోషించారు జమున. బుర్ర కథా పితామహుడు నాజర్ ఆధ్వర్యంలో జమున శిక్షణ తీసుకొంది. సంగీతం అంటే జమునకు మక్కువ. చిన్నప్పుడే హార్మోనియం, వీణ నేర్చుకొన్నారు.
తొలి సినిమా ఆగిపోయింది
దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణకు చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయన కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయన సిఫార్సు మేర ‘జై వీర భేతాళ’ అనే జానపద చిత్రంలో కథానాయికగా జమునకు అవకాశం వచ్చింది. అందులో గుమ్మడి కథానాయకుడు. స్కూలు ఫైనల్ పరీక్షల్ని సైతం పక్కన పెట్టి, అమ్మానాన్నలతో మద్రాస్ బయల్దేరింది జమున. ‘జై వీర భేతాళ’లో మంచి వేషమే. ఈ సినిమాతో కెరీర్ మలుపు తిరుగుతుందనుకున్నారు జమున. కానీ దురదృష్టవశాత్తూ ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే.. జమున నిరాశ పడలేదు. ఆ వెంటనే ప్రజానాట్యమండలికి చెందిన రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’లో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ‘వద్దంటే డబ్బు’ ఆఫర్ వచ్చింది. అయితే ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. తొలి సినిమా ఆగిపోవడం, రెండు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో జమున కెరీర్ ఏమవుతుందో? అని అమ్మానాన్న బెంగపడ్డారు. కానీ ‘మా గోపీ’ చిత్రం ఆర్థికంగా విజయం సాధించడంతో పాటు జమునకూ మంచి పేరు తీసుకొచ్చింది. ‘నిరు పేదలు’, ‘మిస్సమ్మ’, ‘వదిన గారి గాజులు’, ‘అంతా మనవాళ్లే’ ఇలా వరుస విజయాలతో జమున పేరు మార్మోగిపోయింది. ఏ పాత్రకైనా జమున సరితూగుతుందన్న గుర్తింపు తెచ్చుకొంది. ‘దొంగరాముడు’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మూగ నోము’, ‘రాము’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘నాదీ ఆడజన్మే’, ‘పూల రంగడు’, ‘రాముడు - భీముడు’... ఇలా ఒకటా రెండా? పదుల సంఖ్యలో సూపర్ హిట్లు పడ్డాయి. అన్నపూర్ణ, జగపతి, సురేశ్ ప్రొడక్షన్స్ ఇలా.. పెద్ద పెద్ద సంస్థలన్నీంటిలోనూ జమున విరివిగా చిత్రాలు చేసేవారు. ఎన్టీఆర్‌తో ఏకంగా 31 చిత్రాల్లో కథానాయికగా నటించారు. దాదాపు అన్నీ హిట్లే. అన్నింట్లోనూ రకరకాల పాత్రలు పడ్డాయి. దాంతో జమున కెరీర్ నాన్ స్టాప్‌గా దూసుకుపోయారు.
జమున చీరలొచ్చాయ్!
కథానాయికగా పదేళ్లు చిత్రసీమలో ఉండడం ఓ అరుదైన ఘనత. కానీ.. జమున ఏకంగా పాతికేళ్లు రాణించారు. దానికి కారణం.. విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటన. అల్లరి అమ్మాయిగా, పొగరుబోతు గృహిణిగా, అమాయక ఇల్లాలుగా ఇలా అన్ని పార్వ్శాలూ పలికించారు. సత్యభామ పాత్రలకు ఆమెదే పేటెంట్. సత్యభామ పాత్రని ఎలా చేయాలో భావి తరాలకు ఆమె ఓ పాఠం నేర్పించి వెళ్లారు. ‘వినాయక చవితి’లో తొలిసారి సత్యభామ అవతారం ఎత్తారు జమున. అందులో ఆ పాత్ర సాత్వికంగానే ఉంటుంది. ‘శ్రీకృష్ణ తులాభారం’లో మాత్రం సత్యభామగా జమున విశ్వరూపం చూడొచ్చు. ‘సత్యభామ పాత్రని నువ్వు చేయలేవు..’ అని హితులు, శ్రేయోభిలాషులు ఆమెకు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తే ఓ ఛాలెంజ్‌గా స్వీకరించి ఆ పాత్రని రక్తికట్టించారు. అప్పటి నుంచీ.. సత్యభామ పాత్రంటే జమున గుర్తుకురావడం పరిపాటిగా మారిపోయింది. ‘పండంటి కాపురం’లో రాణీ మాలినీ దేవి.. పాత్ర జమన కెరీర్‌లో మరో కలికితురాయి. పెద్దింటి అమ్మాయిగా ఆ పాత్రలో ఆమె చూపించిన దర్పం.. ఇంకెవ్వరికీ సాటి రాదు. జమున కట్టు బొట్టు కూడా కొత్తగా కనిపిస్తాయి. ఆమె చీరలకు అప్పట్లో ఎంతోమంది అభిమానులు. ‘జమున చీరలొచ్చాయ్’ అంటూ వస్త్ర దుకాణాల దగ్గర బోర్డులు పెట్టేవారంటే... ఆరోజుల్లో జమున క్రేజ్‌ని అర్థం చేసుకోవొచ్చు.
బాలీవుడ్‌లో మెరిసి...
మూడేళ్ల పాటు ఇద్దరు అగ్ర హీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వకుండా జమునని దూరం పెట్టారు. అయినా ఆమె లెక్క చేయలేదు. ఇదే సమయంలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు. అక్కడ 12 చిత్రాల్లో నటించారు. ‘మిలన్’ ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా కట్టబెట్టింది. అప్పుడే చాలామంది ముంబైకి మకాం మార్చేయమని సలహా ఇచ్చారు. కానీ జమున వినలేదు. తెలుగు చితస్రీమని వదల్లేదు. ‘గుండమ్మ కథ’తో జమున హవా మళ్లీ తెలుగు నాట మొదలైంది. కథానాయికగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తిరుపతిలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న రమణారావుని వివాహం చేసుకొన్నారు జమున. పెళ్లి తరవాత కూడా పదేళ్ల పాటు కథానాయికగా అగ్ర స్థానంలోనే ఉన్నారు. ఆ తరవాత వంశీ కృష్ణ, స్రవంతి పుట్టారు. అటు పిల్లల్ని చూసుకొంటూ, ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకొంటూ, సినిమాల్లోనూ రాణించారు. ఆ తరవాత.. రాజకీయాల్లో చేరారు. కాంగ్రె్‌సపై అభిమానంతో ఆ పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజమండ్రి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎంపికయ్యారు. అయితే ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో పదవి పోయింది. కొంతకాలం తరవాత కాంగ్రె్‌సకి గుడ్ బై చెప్పి, బీజేపీలోకి వచ్చారు. అక్కడా ఎంతో కాలం ఉండలేకపోయారు. కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎనలేని సేవలు చేశారు జమున. రాష్ట్రమంతా తిరిగి పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారు. వాళ్లకు ఇళ్లస్థలాలు మంజూరు చేయడంలో కృషి చేశారు. కొన్ని కాలనీలకు ‘జమున’ పేరు పెట్టడం ఆమె కృషికి నిదర్శనం.
పగలు షూటింగ్.. సాయంత్రం ప్రాక్టీస్
జమున తొలిసారిగా సత్యభామ పాత్రను పోషించిన చిత్రం‘ వినాయకచవితి’. ఆ సినిమాలో పాత్రకు భిన్నంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంలోని సత్యభామ పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఆ పాత్రకు జమునను ఎన్నుకొన్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో ఆమె ఇది రెండో సినిమా. స్ర్కిప్ట్ చదివిన తర్వాత నిర్మాత రామానాయుడుతో ‘సత్యభామ వేషానికి స్థానం నరసింహారావుగారు ప్రసిద్ధి కదా. ఆయన వేసే నాటకాన్ని ఒకసారి చూద్దాంలేకపోతే ఆయన్ని ఒకసారి పిలిపించి పాత్ర గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందేమో.. ఇది ఛాలెంజింగ్ రోల్ కదా’ అని రిక్వెస్ట్ చేశారు. రామానాయుడు స్థానం నరసింహారావు కోసం ప్రయత్నించారు కానీ ఆయన దొరకక పోవడంతో చివరికి సముద్రాల రాఘవాచార్య రాసిన స్ర్కిప్ట్‌ను ఫాలో అవుతూ ఆ సినిమాలో నటించారు జమున.
ఆ సమయంలోనే ‘మిలన్’ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. తనతో పాటు ‘శ్రీకృష్ణ తులాభారం ’ స్ర్కిప్ట్‌ను తీసుకెళ్లారు జమున. సాయంత్రం షూటింగ్ పూర్తి కాగానే రూమ్‌కి తిరిగి వచ్చి , అద్దం ముందు నిల్చుని డైలాగులు చెబుతూ వాటిని టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేసేవారు. సత్యభామ పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి ఆమె ఎంతో సాధన చేశారు. ముఖ్యంగా ‘మీర జాలగలడా నా యానతి’ పాటను కూడా ఎన్నోసార్లు అద్దం ముందు నిలబడి రిహార్సల్స్ చేశారు. సత్యభామ అంటే జమునే.. న భూతో న భవిష్యతి అని ప్రేక్షకులు, పరిశ్రమ చెప్పుకోవడానికి ఆమె చేసిన కృషే కారణం.
జమునకు కుక్కలంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఓ అరడజను బుజ్జి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. దాదాపు తన జీవిత కాలంలో వంద కుక్క పిల్లల్ని పెంచుకొన్నారావిడ.
హంపీ సుందరి
కౌసల్య రాముణ్ణి కన్నది లోకానికి ఒకదైవం కోసం మరో కౌసల్య కైకను కన్నది ఆ రాముణ్ణి అల్లారుముద్దుగా పెంచడం కోసం అమ్మ కడుపు నుండి బయట పడినప్పుడు ఆ కైకపేరు జనాబాయి ముందు కాలానికి జన జీవనంలో స్రవంతిలా ప్రవహిస్తుందని జాతకరత్నలు జనాబాయిని జమునా బాయిని చేశారు జమునకి, యమునకి తేడా ఏముంది కనుక? నటి నదిలా ప్రవహించి నిజమై తేలింది పొగాకు ఆరోగ్యానికి హాని సరే కానీ పొగాకు వ్యాపారం తెలుగుజాతికి సత్యభామను అరణమిచ్చింది అప్పటి సత్రాజిత్తు ఇప్పటి నిప్పణి శ్రీనివాసుడు నిజమే దుగ్గిరాలలో అబ్బరంగా పెరిగిన ఆ మొగ్గ విచ్చుకుని, విరిసిన తర్వాత చలన చిత్ర సీమల్ని సురభిళాలతో ముంచెత్తుతుందని ఎవరనుకున్నారు? ఎవరు కలగన్నారు ‘అన్నయ్య నన్ను బాగా చదివిస్తారనన్నాడు’’ అని కెమెరా ముందు తొలిగా ఆమె పలికిన పలుకులు నిజమయ్యాయో! లేదో! గానీ వెండి తెర నటనలో వశీకరణ విద్యలు ఆమెకు కరతలామలకమయ్యాయి పన్ను మీద పన్నుంటే అందానికి లోపం అంటుంది లోకం అభినయం పైన అభిమానాన్ని నిలబెట్టి అవకరాన్ని అలంకారం చేసిన ప్రతిభా సమున్మేషి ఆమె పుట్టిల్లు నిజంగా, కళాభారతికి పురిటిల్లై కూర్చుంది జానకి వేషం కట్టిన తర్వాతే కదా! ఆనక, కలెక్టర్ పదవికి ఆమె ఆదర్శమై పోయింది రాణీ మాలినీ దేవి జమీందారి దర్జాకి కొలమానాన్ని కూర్చింది శపథం పట్టిన మంగమ్మ పురుషాధిక్యం పైన గెలుపు జెండాలెగరేసింది మిస్సమ్మకు గారాల చెల్లి సినిమా తెరమీదనే కాదు నిఘంటువులకూ ఎక్కి ముగ్ధ అనే మాటకు పర్యాయపదంలా మారింది.
ఆమె మూగనోముకు ఆర్థిక తారతమ్యాలన్నీ తమ అహంకారాలు వీడి ఆ మనో నిబ్బరం ముందు మోకరిల్లాయి మట్టిగడ్డను ముద్దు బిడ్డగా మార్చేసిన బంగారు తల్లిలా తాను మెరిసినప్పుడు ఆ ఒడి కదా! తెలుగు జాతికి మాతృత్వపు కావడి అయ్యింది ప్రజానటి ప్రజాదరణ చూసి అబ్బురపడి రాజకీయ చుట్టరికం కలిపింది వద్దన్నా వచ్చిన అతిథిలా పీఠం తెచ్చుకుని మరీ బైఠాయించింది పంక నిర్మగ్నమైన పరిసరాల్లో కూడా ఆమె పద్మంలా మొలిచింది రంగస్థల కళాకారుల నిర్వాసిత జీవితాలకు ఆమె కృషి భరత వాక్యం పలికింది కృతజ్ఞతకు అర్థంగా ఊరు జమున నగరమై వెలిసింది సినిమాలు, రాజకీయాలు రెండు చక్రాలై పరుగులు తీయించినప్పుడు కౌటుంచిక జీవనం గతుకుల రహదారిలా తోచింది అదీ, ఇదీ ప్రజలకోసమే కదా! ఆలోచన మనసుకు ఊరడింపు పలికింది పున్నమి చంద్రుణ్ణి వెయ్యిసార్లు దర్శించిన హంపీసుందరి సుధాకిరణ స్పర్శతో స్నిగ్ధ సౌందర్య శిల్పమై సొగసు వీనుతూనే ఉంది రుతువులతో మారే కాలంలా మారిపోయే వ్యక్తిత్వం కాదు తనది సంకల్ప బలానికి ఆమె పట్టుకొమ్మ సుద్భావనకు ఆమె చిరునామా నిన్న నేడు రేపు సరిహద్దులు దాటి వగలు పోయే రజత యవనిక పైన ఆమె వన్నె తగ్గని బంగారు బొమ్మ.
డా. వోలేటి పార్వతీశం
Updated Date - 2023-01-27T23:09:01+05:30 IST