Heroines : హీరోయిన్లు హిట్టయ్యారు!
ABN, First Publish Date - 2023-05-28T04:50:43+05:30
హీరో అయినా హీరోయిన్ అయినా హిట్టు కొడితేనే మార్కెట్‌లో డిమాండ్. కొందరు కథానాయికలు ఒక్క హిట్టుకోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుండగా మరికొందరేమో వరుస హిట్లతో
హీరో అయినా హీరోయిన్ అయినా హిట్టు కొడితేనే మార్కెట్‌లో డిమాండ్. కొందరు కథానాయికలు ఒక్క హిట్టుకోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుండగా మరికొందరేమో వరుస హిట్లతో ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌లోకి దూసుకుపోతున్నారు. మొన్నటిదాకా అగ్ర కథానాయికలుగా ఓ వెలుగు వెలిగిన తారల ప్రభ క్రమంగా మసకబారుతుండగా కొత్త హీరోయిన్లు వరుస విజయాల ఊపుతో ఆ స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు కథానాయికలు అపజయాల బాటను వీడి సక్సెస్‌ట్రాక్ ఎక్కారు. వరుస విజయాలతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న కథానాయికలు ఎవరో చూద్దాం.
నాలుగు హిట్లతో అగ్రస్థానంలోకి
ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఇండస్ట్రీని దున్నేస్తున్న హీరోయిన్ ఎవరంటే సంయుక్త మీనన్ పేరే చెప్పాలి. అగ్ర హీరోయిన్లు సైతం ప్లాపులతో సతమతమవతుంటే సంయుక్త మాత్రం వరుసగా నాలుగు హిట్స్‌తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. తాజాగా ‘విరూపాక్ష’ చిత్రం ఘన విజయంతో తనది గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు సంయుక్తా మీనన్. ఈ మలయాళి భామ గతేడాది ‘భీమ్లానాయక్’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆమెకు ఘన విజయం దక్కింది. ఆ చిత్రంలో రానాకు జోడీగా సంయుక్త కనిపించారు. తెరపైన కనిపించింది కొద్దిసేపే అయినా, డైలాగులు తక్కువే అయినా ఎక్స్‌ప్రెషన్స్‌తో పాత్రను పండించిన తీరు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘బింబిసార’ కూడా సూపర్ హిట్ అయ్యింది. చాలా ఏళ్ల తర్వాత కల్యాణ్‌రామ్‌కు దక్కిన హిట్ అది. అలా ఒక్క ఏడాదిలోనే రెండు హిట్లను అందుకొని బిజీ అయ్యారు సంయుక్త. ఇక ఈ ఏడాది ధనుష్ కథానాయకుడిగా వచ్చిన ‘సార్’ చిత్రంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. ఈ పీరియాడిక్ చిత్రంలో గ్రామీణ యువతిగా సంయుక్త నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవలె విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రం ఏకంగా రూ. వంద కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఘన విజయానికి దోహదం చేసిన చాలా అంశాల్లో సంయుక్త నటన ఒకటి. సాయితేజ్ కూడా గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆమెతో జోడీకట్టడం ప్లాపుల్లో ఉన్న హీరోలకు కూడా కలిసొస్తోంది అనే మాట పరిశ్రమల్లో వినిపిస్తోంది. ఇంకా ఒకట్రెండు హిట్లు పడితే టాలీవుడ్ నంబర్‌వన్ హీరోయిన్ స్థానం సంయుక్త వశం కావడం ఖాయంగా అనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అభినయమే ఆమె బలం
‘స్నేహమంటే ఇదేరా’ చిత్రంతో బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు కావ్యా కల్యాణ్‌రామ్. ఆ తర్వాత ‘గంగోత్రి’, ‘బాలు’ లాంటి పలు చిత్రాల్లో బాల నటిగా ఆకట్టుకున్నారు. మధ్యలో నటనకు విరామం ఇచ్చి చదువుపై దృష్టి పెట్టారు. తిరిగి గతేడాది వచ్చిన ‘మసూద’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మసూద’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. తొలి చిత్రంతోనే కావ్య ఖాతాలో ఓ మంచి విజయం నమోదైంది. ఈ ఏడాది ఆమె లీడ్‌రోల్‌లో నటించిన ‘బలగం’ సినిమా ఘన విజయం అందుకొంది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను రాబట్టింది. హీరో మరదలి పాత్రలో ఆమె అభినయానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ‘ఉస్తాద్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కూడా హిట్టయితే కావ్య కూడా టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుంది.
శ్రీలీల మ్యాజిక్
హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తన ధమాకా చూపుతున్నారు శ్రీలీల. తొలి చిత్రం ‘పెళ్లిసందడి’తోనే పరిశ్రమ చూపు తనవైపు తిప్పుకున్నారు. ‘ధమాకా’ చిత్రంతో రవితేజ లాంటి అగ్రహీరో సరసన అవకాశం దక్కించుకొని వంద కోట్ల హీరోయిన్ అనిపించుకున్నారు. రెండు వరుస విజయాలతో హీరోయిన్‌గా శ్రీలీల దశ తిరిగిపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. అగ్రహీరోల సరసన నటిస్తున్నారు. రామ్, నితిన్, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్ సరసన నటిస్తున్నారు. వీటిలో రెండు మూడు భారీ హిట్లు పడినా తెలుగునాట అగ్ర కథానాయికగా శ్రీలీల స్థిరపడడం ఖాయం.
సీనియర్లు సత్తా చాటారు
ఇక సీనియర్ హీరోయిన్ల పరిస్థితి చూస్తే చాలామందికి హిట్ అందని ద్రాక్షగానే ఉంది. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ రెండు మూడు హిట్లు ఖాతాలో వేసుకున్న హీరోయిన్లు సైతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. అలాంటి కథానాయికల్లో ఒకరిద్దరు మాత్రం తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. చాలా కాలంగా తెలుగులో సరైన హిట్ పడక శ్రుతీహాసన్ కెరీర్ గ్రాప్ అమాంతం పడిపోయింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు ఆమె కెరీర్‌కు ప్రాణం పోశాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న ‘సలార్’ చిత్రం హిట్టయితే శ్రుతీహాసన్ కెరీర్ దూసుకెళ్లడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.
‘మహానటి’చిత్రం తర్వాత అరకొర హిట్లతో కెరీర్ నెట్టుకొస్తున్నారు కీర్తిసురేశ్. అయితే నటిగా మాత్రం కీర్తి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ కథానాయికల విజయానికి కమర్షియల్ హిట్స్ కూడా కొలమానమే. అందుకే సరైన క మర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కీర్తికి నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం ఆ లోటు తీర్చింది.
ఒక్క హిట్ పడితే చాలు
ఒక సినిమా హిట్టయితే దానికి పని చేసిన టీమ్ మొత్తానికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అందరి లక్ష్యం సినిమాను హిట్ చేయడమే అయినా దాంతో వచ్చే గుర్తింపు మాత్రం కొందరికే దక్కుతుంది. ముఖ్యంగా ఆ సక్సెస్‌ను ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం హీరో, హీరోయిన్లు, దర్శకుడికి ఎక్కువ ఉంటుంది. డబ్బుతో పాటు ప్రజల్లో చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుంది. అన్నింటికీ మించి ఒక్క హిట్ పడితే దానిపేరు చెప్పుకొని రెండు మూడేళ్లు కెరీర్‌ను లాగించేయవచ్చు. ఇలా చెబుతూ పోతే హిట్ సినిమాలతో కలిగే ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి. హీరోలయినా, హీరోయిన్లయినా ఆ ఒక్క విజయం దక్కించుకోవడం మాత్రం అంత సులభం కాదు. ఏటా లెక్కకు మిక్కిలి సినిమాలు వచ్చినా సరైన హిట్లు డజన్‌కు మించవు. కానీ కొంతమంది హీరోయిన ్ల పరిస్థితి మాత్రం పట్టిందల్లా బంగారమే అనేలా ఉంది. అలాంటి పరిస్థితి ఈ ఏడాది కొద్దిమంది హీరోయిన్లకే దక్కింది. పరిశ్రమలో హిట్ మాత్రమే మాట్లాడుతుంది. ఒకప్పుడు ఎన్ని హిట్లు ఇచ్చాం అనేది ఇప్పుడు లెక్కలోకి రాదు. ఇప్పుడు హిట్ పడితేనే అవకాశాలు వస్తాయి. లేదంటే బీ గ్రేడ్, సీ గ్రేడ్ చిత్రాలతో బండి లాగించాల్సిందే. ఒకప్పటి ఫేమ్ చూపించి హీరోయిన్‌గా నాలుగైదు సినిమాల్లో అవకాశాలయితే తెచ్చుకోవచ్చేమో కానీ అందులో ఒకటో రెండో హిట్‌లు లేకపోతే చాలా త్వరగా కనుమరుగై పోవడం ఖాయం.
Updated Date - 2023-05-28T04:50:43+05:30 IST