ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Doctor Shilpa Pothapragada.: ఈ బంధం ఈనాటిది కాదు

ABN, First Publish Date - 2023-05-15T03:24:17+05:30

‘‘నిజంగా నాకు లభించిన అరుదైన అవకాశం ఇది. గూగుల్‌ మాజీ సీఈఓ ఎరిక్‌ ష్మెడ్‌... ‘ష్మెడ్‌ ఫ్యూచర్స్‌’ పేరుతో ఒక దాతృత్వ సంస్థ నడిపిస్తున్నారు. దాని ద్వారా ఏటా పీహెచ్‌డీ చేసినవారికి ‘ష్మెడ్‌ సైన్స్‌ ఫెలోషిప్‌’ ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది మొత్తం 32 మందిని ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదటి నుంచి ఒకటే కల... మధ్యలో మలుపులేమీ లేవు. అమ్మానాన్న తనను డాక్టర్‌గా చూడాలనుకున్నా... ఆమె మాత్రం కోరి పరిశోధన వైపే అడుగులు వేశారు. కేన్సర్‌ కారక కణాలపై పీహెచ్‌డీ చేసిన ఆమె... ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘ష్మెడ్‌ ఇంటర్నేషనల్‌ ఫెలోషిప్‌’కు భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం జరగాలాంటున్న 31 ఏళ్ల డాక్టర్‌ శిల్ప పోతాప్రగడ... ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

‘‘నిజంగా నాకు లభించిన అరుదైన అవకాశం ఇది. గూగుల్‌ మాజీ సీఈఓ ఎరిక్‌ ష్మెడ్‌... ‘ష్మెడ్‌ ఫ్యూచర్స్‌’ పేరుతో ఒక దాతృత్వ సంస్థ నడిపిస్తున్నారు. దాని ద్వారా ఏటా పీహెచ్‌డీ చేసినవారికి ‘ష్మెడ్‌ సైన్స్‌ ఫెలోషిప్‌’ ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది మొత్తం 32 మందిని ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు. ఒక భారతీయ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఈ ఫెలోషిప్‌ పొందిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. గతంలో భారతీయులైతే ఉన్నారు కానీ... వారంతా అమెరికా, కెనడా తదితర దేశాల్లోని విద్యా సంస్థల నుంచి ఎంపిక అయ్యారు. అంతేకాదు... ఈసారి మన దేశం నుంచి నా ఒక్కదానికే ఈ అవకాశం లభించింది. ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ ఫెలోషిప్‌కు ఎవరికి వారుగా దరఖాస్తు చేయలేం. ఒక ఇనిస్టిట్యూట్‌ తరుఫున ప్రతిపాదన పంపాలి. అలా నేను పీహెచ్‌డీ చేసిన హైదరాబాద్‌ ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌’ (టీఐఎఫ్‌ఆర్‌) నుంచి దరఖాస్తు వెళ్లింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ బోర్డులో అత్యున్నత స్థాయి సైంటిస్ట్‌లు, ప్రొఫెసర్లు ఉంటారు. మనం ఏ టాపిక్‌ అయితే ఎంచుకున్నామో... దాని గురించి వాళ్లు అడుగుతారు. అన్ని వడపోతలూ అయ్యాక, గత నెలలోనే ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ ఫెలోషిప్‌ కింద ఏడాదికి లక్ష డాలర్ల చొప్పున రెండేళ్లు ఉపకార వేతనం ఇస్తారు. నాకు తెలిసి ఇంత పెద్దమొత్తంలో మరెవరూ ఉపకార వేతనం ఇవ్వరు. అంటే ప్రపంచంలో మనకు నచ్చిన ఏ ల్యాబ్‌లోనైనా ఫెలోషిప్‌ చేసుకొనేలా ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం.

మహిళల ఆరోగ్యంపై...

ఈ ఫెలోషిప్‌కు కావల్సింది ఏమిటంటే... మనం పీహెచ్‌డీ ఏ టాపిక్‌ మీదైతే చేశామో అది కాకుండా వేరే టాపిక్‌ ఎంచుకోవాలి. నా పీహెచ్‌డీ కేన్సర్‌ బయాలజీపై చేశాను. కానీ ఫెలోషిప్‌ కోసం టాపిక్‌ మార్చాలి. అందుకే నేను ఇప్పుడు ‘ఉమెన్స్‌ హెల్త్‌’ టాపిక్‌ తీసుకున్నాను. అదే ఎందుకంటే... మహిళలకు రీప్రొడక్టివ్‌ హెల్త్‌కు సంబంధించిన సమస్యలు వస్తాయి కదా..! వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వాటిల్లో చాలా ఆరోగ్య సమస్యలకు ఇప్పటికీ సరైన మందులు లేవు. లేదా ఇవి ఎందుకు వస్తున్నాయనే దానిపై పూర్తి అవగాహన లేదు. కనుక అందులో నేను పరిశోధన చేయదలుచుకున్నాను.

దానికి ప్రత్యామ్నాయంగా...

ప్రస్తుతం ఏ పరిశోధన అయినా ల్యాబ్‌లో ఎలుకల మీదనే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే... ఎలుకల్లో రీప్రొడక్టివ్‌ సైకిల్‌కు, మహిళల్లో సైకిల్‌కూ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దానివల్ల ఎలుకలపై పరీక్షించిన మందులు మహిళలకు సరిగ్గా పని చేయవు. కనుక దీని కోసం నేను ‘ఆర్గాన్‌ ఆన్‌ చిప్‌’ పేరుతో ఒక కొత్త సిస్టమ్‌ను అభివృద్ధి చేయదలిచాను. అంటే ఒక చిన్న చిప్‌ మీద మానవ కణాలను (హ్యూమన్‌ సెల్స్‌) తీసుకొని, వాటిని ఒక ఆర్గాన్‌లా గ్రో చెయ్యడం. దీనివల్ల కచ్చితమైన ఫలితాలు వస్తాయి. సరైన మందులు వాడే అవకాశం లభిస్తుంది. జంతువులపై అధ్యయనానికి ఇది ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాను. ఈ అంశం మీదనే నా ఫెలోషిప్‌ ఉంటుంది.

ఇంకా నిర్ణయించుకోలేదు...

అయితే నా ఫెలోషిప్‌ ఎక్కడ చేయాలన్నది ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం అమెరికాలోని ల్యాబ్స్‌తో చర్చలు నడుస్తున్నాయి. వాళ్లు కూడా ఇంటర్వ్యూలు చేస్తారు. వాళ్ల ల్యాబ్‌కు మేము సరిపోతామా లేదా అని! ఈ నెలాఖరుకు ఎక్కడనేది తెలుస్తుందని అనుకొంటున్నాను. ఇదికాకుండా ఎంపికైన వారందరికీ ఏటా ఒక సమావేశం నిర్వహిస్తారు. దానికి శాస్త్ర, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, సామాజికవేత్తలను ఆహ్వానిస్తారు. పరిశోధనలో వాళ్లు మాకు మార్గదర్శనం చేస్తారు. అలాగే ఫెలోషిప్‌ తరువాత మేం ఏం చేయాలనుకొంటున్నామో తెలుసుకొని, అందుకు సహకారం అందిస్తారు. అందుకే అంటున్నాను... ఇది ఒక అరుదైన అవకాశం అని.

ఆసక్తే నడిపించింది...

జీవశాస్త్రంతో అనుబంధం నాకు ఇవాల్టిది కాదు. చిన్నప్పటి నుంచి నాకు బాగా ఆసక్తి ఉండేది. మా అమ్మా నాన్నలు నన్ను మెడిసిన్‌ చదివించి డాక్టర్‌ను చేయాలనుకున్నారు. ఆ మార్గంలోనే నన్ను సన్నద్ధం చేశారు. అయితే చదువుతున్నకొద్దీ, ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేస్తున్నకొద్దీ నాకు బయాలజీపై ఇష్టం అధికమైంది. దాంతో నేను పీహెచ్‌డీ చేయాలనుకున్నాను. నా ఆసక్తి గమనించి అమ్మానాన్న కూడా ప్రోత్సహించారు. ఇక వెనకడుగు వేయలేదు. బీఎస్సీ బయోకెమిస్ట్రీలో చేశాను... కోల్‌కతా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ నుంచి. హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివాను. 2016లో ఎంఎస్సీ అవ్వగానే కేన్సర్‌ బయాలజీపై అధ్యయనం కోసం ‘టీఐఎఫ్‌ఆర్‌’లో చేరాను. ఈ ఏడాది మార్చిలోనే పీహెచ్‌డీ పూర్తయింది. తరువాత బయోటెక్నాలజీ రంగ పరిశ్రమలో సైంటిస్ట్‌గా చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఫెలోషిప్‌ రావడంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి.

కుటుంబ ప్రోత్సాహంవల్లే...

నేను అనుకున్నది సాధించగలుగుతున్నానంటే అందుకు కారణం మా కుటుంబం. మా ఇంట్లో అందరూ సైన్స్‌, పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారే. అందుకే నన్ను ప్రోత్సహించారు. నేను పుట్టి పెరిగిందంతా కోల్‌కతాలో. మా తాతగారు విశాఖపట్టణం నుంచి అక్కడకు వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం మా నివాసం హైదరాబాద్‌లోనే. వాస్తవానికి పీహెచ్‌డీ తరువాత పెళ్లి చేసుకుందామనుకున్నా. కానీ కరోనా వల్ల దానికి బ్రేక్‌ పడింది. ఈలోగా పెళ్లి కుదిరింది. మావారు అభిరత్‌ బత్రా మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయన కూడా నా లక్ష్యాన్ని గౌరవించారు. దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా నా మార్గం సుగమం అయింది.’’

Updated Date - 2023-05-15T03:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising