Chat GPT : కుక్కను కాపాడిన చాట్ జీపీటీ
ABN, First Publish Date - 2023-03-31T23:03:24+05:30
సాంకేతిక అభివృద్ధి అద్భుతాలకూ తోడ్పడుతుందనటానికి ఉదాహరణ ఈ శునక వృత్తాంతం. ఒక్కసారిగా వార్తల్లో ప్రధానాంశంగా మారిన చాట్ జీపీటీ ఏకంగా ఒక శునకాన్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది.
సాంకేతిక అభివృద్ధి అద్భుతాలకూ తోడ్పడుతుందనటానికి ఉదాహరణ ఈ శునక వృత్తాంతం. ఒక్కసారిగా వార్తల్లో ప్రధానాంశంగా మారిన చాట్ జీపీటీ ఏకంగా ఒక శునకాన్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది. కూపర్ అనే వ్యక్తి చాట్ జీపీటీ సహకారంతో తన కుక్కను కాపాడుకున్నట్టు ట్వీట్ చేశారు. మొదట్లో తన కుక్క నీరసంగా ఉండటాన్ని కూపర్ గమనించారు. సాధారణంగా ఎర్ర రక్తకణాల లేమితో ఇబ్బంది పడుతోందని భావించి వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించారు. ఆయన కుక్కకు రక్త పరీక్ష జరిపి తీవ్రమైన ఎనీమియాతో ఇబ్బంది పడుతోందని తేల్చారు. ఆపై టిక్-బార్న్ వ్యాధి అనుకుని పరీక్షిస్తే నెగెటివ్ అని తేలింది. రెండో అభిప్రాయం కోసం మరో వెటర్నేరియన్‌ను కలిసినప్పటికీ ప్రయోజనం కలుగలేదు.
ఆప్పుడు కూపర్ చాట్ జీపీటీని ఆశ్రయించారు. వివిధ పరీక్షల ఫలితాల్ని బట్టి ఎనీమియాకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అదేమిటి అడిగితే ఇమ్యూన్ మీడియేటెడ్ హెమోలిటిక్ ఎనీమియా(ఐఎంహెచ్‌ఎ) అని కూడా తెలిపింది. రెండో వెటర్నేరియన్‌కు ఇదే విషయాన్ని కూపర్ చెప్పారు. మరికొన్ని టెస్టులు జరిపి చాట్ జీపీటీ వెలికితీసిన ఆనుమానాన్ని ధ్రువీకరించుకున్నారు. అందుకు తగ్గ మందులు వాడటంతో కుక్క తేరుకోవడంతో కథ సుఖాంతమైంది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణలో చాట్ జీపీటీ సహకారానికి కూపర్ సహజంగానే ఆనందించారు. అంతే కాదు ట్వీట్‌తో విషయాన్ని లోకానికి వెల్లడించారు.
Updated Date - 2023-03-31T23:03:24+05:30 IST