Apple : విదేశాల్లో ‘యాపిల్’ కొంటే జాగ్రత్త సుమా
ABN, First Publish Date - 2023-09-29T23:52:23+05:30
విదేశీ వస్తువులపై మనోళ్ళకు ఉండే మోజు తెలిసిందే. టూరిస్టులుగా వేరే దేశాలను సందర్శించినప్పుడో, మరో సందర్భంలోనో ఐఫోన్ల నుంచి మేక్‌బుక్స్,
విదేశీ వస్తువులపై మనోళ్ళకు ఉండే మోజు తెలిసిందే. టూరిస్టులుగా వేరే దేశాలను సందర్శించినప్పుడో, మరో సందర్భంలోనో ఐఫోన్ల నుంచి మేక్‌బుక్స్, యాపిల్ వాచీలు వరకు వివిధ యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
విదేశాల్లో యాపిల్ ఉత్పత్తుల రేటు తక్కువ అనే అభిప్రాయం ఉంది. అయితే అది నిజం కాదు. దేశాన్ని బట్టి అనేకానేక కారణాల రీత్యా ధరలో తేడాలు ఉంటాయి. దిగుమతి పన్నులు, మారకం రేట్లు, స్థానికంగా ఉన్న డిమాండ్ తదితరాలన్నీ ఈ రేటుపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు మన దేశంలో ఐఫోన్ 15 ప్రొ రేటు రూ.1,34,900. ఇది బేసిక్ వేరియంట్ కాగా టర్కీలో దీని రేటు ఇండియన్ మనీలో దాదాపుగా రూ.రెండు లక్షలు. విదేశాల్లో ఎక్కడైనా చౌక కాదు అని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ.
అమెరికాలోని ఐఫోన్లు మాత్రమే ఈసిమ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్ అమెరికన్ వెర్షన్ ఇండియన్ కేరియర్లు అంటే ఎయిర్‌టెల్, జియో, విఐతో కంపాటిబుల్ అయినప్పటికీ లోకల్ నెట్‌వర్క్ టెక్నాలజీ విషయంలో చెక్ చేసుకోవడమే మంచిది.
కాల్స్, డేటా కోసం యాపిల్ వాచీ సెల్యులార్ కనెక్టివిటీని ఆఫర్ చేస్తోంది. ఇది అన్ని దేశాల్లో పనిచేయదు. కొనుగోలు సమయంలోనే అది మన దేశంలోని బ్యాండ్స్‌ని సపోర్ట్ చేస్తుందా, లేదా అన్నది చూడాలి. జీపీఎస్ వెర్షన్ యాపిల్ వాచీని తీసుకోవడం ఉత్తమం. కీడెంచి మేలెంచడం అంటే ఇదే మరి.
యాపిల్ స్టోర్ లేదంటే ఆథరైజ్డ్ స్టోర్ నుంచి యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. వేరేచోట లభ్యమయ్యేవి నకిలీవి కూడా కావచ్చు. అదే జరిగితే ఇండియాకు వచ్చిన తరవాత వాటిని మార్చుకునే వీలు ఉండదు.
దుబాయ్ సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో విక్రయించే యాపిల్ ఉత్పత్తులు ఫేస్‌టైమ్‌ని సపోర్ట్ చేయవు. ప్రాంతీయ అనుమతులతో వచ్చే సమస్య ఇది. ఫేస్‌టైమ్ అవసరం అనుకుంటే మాత్రం అందులో ఎలాంటి ఆంక్షలు లేని ప్రదేశంలో యాపిల్ డివైజ్‌ను కొనుగోలు చేయాలి.
అర్హత కలిగిన కొనుగోళ్ళ విషయంలో టూరిస్టులకు చాలా దేశాలు వ్యాట్‌ను రిఫండ్ చేస్తాయి. అందువల్ల కొనడానికి ముందే ఈ విషయమై వాకబు చేయాలి. విదేశాలనుంచి బయలుదేరడానికి ముందే అవసరమైన డాక్యుమెంట్లను తీసుకోవాలి. తద్వారా గణనీయ మొత్తాన్ని ఒక దేశాన్ని అనుసరించి ఆదా చేసుకోవచ్చు.
అమెరికాలో ఐఫోన్ 15 బేస్ మోడల్ రేటు 799 డాలర్లు కాగా పన్నులు అదనం. ఇండియాలో మాదిరిగా పన్నులు కలగలిసి ఉండవు. కొనుగోలు చేసే దేశంలో ఈ విషయం కూడా తెలుసుకోవాలి.
చౌకగా ఉన్నాయని ఎక్కువ సంఖ్యలో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దు. బల్క్ కొనుగోళ్ళపై ఇంపోర్ట్ ఆంక్షలు, కస్టమ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పరిమితి ఎలా ఉందన్న విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా న్యాయ పర్యవసానాలనూ తెలుసుకోవాలి.
అన్‌లాక్డ్ ఐఫోన్‌లను కొనుగోలు చేయాలి. వీటితో స్పెసిఫిక్ కేరియర్స్ ఉండవు. కేరియర్-లాక్డ్ అయితే మాత్రం మరో కేరియర్‌తో పనిచేయదు. అది ఉన్న దేశంలోనూ అదే ఇబ్బంది ఎదురవుతుంది.
యాపిల్ ఇంటర్నేషనల్ వారెంటీ ఇవ్వదు. ఎక్కడ అమ్ముతోందో ఆ దేశం మేరకే వారెంటీని అనుమతిస్తుంది. ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
Updated Date - 2023-09-29T23:52:23+05:30 IST