Bathukamma : బతుకమ్మలో జ్ఞానమెంతో...
ABN, First Publish Date - 2023-10-17T23:37:28+05:30
‘సంప్రదాయాల్లోని పరమార్థాన్ని భావితరాలకు తెలియజేయాలన్నదే’ బతుకమ్మ పండుగ మీద తన పరిశోధన ప్రధాన ఉద్దేశం అంటారు ద్యాప విజితారెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా వెల్దండకు చెందిన ఆమె
‘సంప్రదాయాల్లోని పరమార్థాన్ని భావితరాలకు తెలియజేయాలన్నదే’ బతుకమ్మ పండుగ మీద తన పరిశోధన ప్రధాన ఉద్దేశం అంటారు ద్యాప విజితారెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా వెల్దండకు చెందిన ఆమె ఆ ప్రాంతంలోని బతుకమ్మ పాటల మీద ఇరవై ఏళ్ల కిందట పరిశోధన చేశారు. బతుకమ్మ సంబురం సందర్భంగా తన పరిశోధనలోని విశేషాలను విజితారెడ్డి ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘ప్రకృతిని స్త్రీ ప్రతిరూపంగా ఆరాధించడమే బతుకమ్మ. సాధారణంగా దేవుడిని పూలతో పూజిస్తారు. ఆ పూలనే ఆరాధించే సంస్కృతి ఒక్క బతుకమ్మ పండుగలోనే చూస్తాం. ఆడవాళ్ల జీవితానికి కావాల్సిన జ్ఞానమంతా బతుకమ్మలో ఉందని పరిశోధన ద్వారా తెలుసుకున్నాను. ‘బతుకమ్మ’ ఉద్యమంగా రూపు దాల్చడానికి ముందు, అంటే సుమారు పాతికేళ్ల కిందట ఉమ్మడి పాలమూరు జిల్లా వెల్దండ మండలంలోని బతుకమ్మ పాటల మీద పరిశోధన ప్రారంభించాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఎం.ఫిల్ పూర్తి చేసి, 2002లో పట్టా అందుకున్నాను. ఆనాడు ఎవరికి వారుగా భక్తి శ్రద్ధలతో పూలను పూజిస్తూ, బతుకమ్మ ఆడటమే కానీ ఇంత అస్తిత్వ స్పృహ లేదు. దాంతో నా పరిశోధన అంత సులువుగా సాగలేదు. ఒక్కొక్కరి దగ్గర గంటల తరబడి కూర్చొని, పాటలు సేకరించాను. అక్షరం ముక్క రాని ఆడవాళ్లు అలవోకగా పాటలు అల్లి లయబద్ధంగా పాడుతుంటే ఆశ్చర్యపోయాను. పండితులకు ఏమాత్రం తీసిపోని విధంగా వారంతా కొన్ని వందల పాటలు పుక్కిట పట్టడం అసాధారణ విషయం. ఇది మహిళల మేధస్సుకు నిదర్శనం. ఇక ‘మూడు కొప్పులు ఒక దగ్గర కలవలేవు’ లాంటి పురుషాధిక్య సామెతలు, నానుడుల్లో నిజం లేదని ‘బతుకమ్మ’ నిరూపిస్తుంది. ఈ తొమ్మిది రోజులూ ఆడవాళ్లంతా కలిసి సాధకబాధకాలను పాటగా అల్లి పాడుకోవడం ఈ పండుగలో చూస్తుంటాం. అత్తా కోడళ్లు, యారాళ్లు, అన్నాచెల్లెళ్లు ఇలా... నిత్య జీవితంలో తాము ఎదుర్కొనే కడగండ్ల మీదా బోలెడు బతుకమ్మ పాటలున్నాయి. నా పరిశోధనలో భాగంగా వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి, బర్కత్‌పల్లి, చెరుకూరు, బైరాపురంతో పాటు మరికొన్ని గ్రామాలు తిరిగి ఆ పాటలన్నింటినీ నమోదు చేశాను.
స్త్రీల కళారూపాల మీద...
నేను పుట్టి, పెరిగిందంతా కల్వకుర్తిలో. నా చిన్నతనంలో... ఏటా భాద్రపద అమావాస్య మొదలు దసరాకు రెండు రోజుల ముందు వరకు మా నాయనమ్మ, అమ్మ... అంతా కలిసి పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ఆడటం, పాడటం నాకు బాగా గుర్తు. పుట్టి, పెరిగిందంతా దొరల కుటుంబంలో అయినా, కలుపు పాటలు, దంపుడు పాటలు, పెళ్లి పాటలు, ఉయ్యాల పాటలు, బతుకమ్మ పాటలు లాంటి మౌఖిక సాహిత్యాన్ని వింటూ పెరిగాను. ఇంటర్ తర్వాత నాకు పెళ్లయింది. జానపద కళలు, సాహిత్యం పట్ల నాకున్న ఆసక్తిని గమనించిన నా భర్త ఆనంద్‌రెడ్డి చదువు కొనసాగించమన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఎంఫిల్‌లో బతుకమ్మ పాటల మీద, పీహెచ్‌డీలో తెలంగాణ స్త్రీల కళారూపాల మీద పరిశోధన చేయగలిగాను.
ఊరంతా కలిసి ఎదుర్కోళ్లు...
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బతుకమ్మ పండుగ లేదని కొందరు అంటారు. కానీ అందులో నిజం లేదు. కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటారు. కల్వకుర్తి ప్రాంతంలో ‘ఎంగిలి బతుకమ్మ’ నాడు వెంపలి చెట్టుకు పూజ చేయడం ఆనవాయితీ. పెళ్లిలో మగ పెళ్లివారిని ఆడ పెళ్లివారు మేళతాళాలతో ఎదురెళ్లి స్వాగతం పలికే ఎదుర్కోళ్ల సంప్రదాయం బతుకమ్మ పండుగలోనూ భాగం అవ్వడం ఒక్క మా వెల్దండ మండలంలో మాత్రమే చూస్తాం. ఊళ్లోని రెడ్డి కులస్థులను మగ పెళ్లివారిగా, మిగతా వర్గాల వారందరినీ ఆడ పెళ్లివారిగా భావిస్తూ, సద్దుల బతుకమ్మకు ముందు రోజున అంతా కలిసి ఒకచోట చేరి గులాల్ చల్లుకొంటారు. కొంటె, వ్యంగ్య పాటలతో ఒకరినొకరు ఆట పట్టిస్తూ... కుల మత భేదాలు లేకుండా ఊరంతా కలిసి మెలిసి ‘ఎదుర్కోళ్లు’ వేడుక చేసుకొంటాం. ‘సద్దుల బతుకమ్మ’ను సాగనంపేప్పుడు కూడా అన్ని మతాలవారూ పాల్గొంటారు. అమ్మకు నైవేద్యంగా కొబ్బరి, నువ్వులు, పుట్నాలు, చింతపండుతో వేర్వేరుగా వండిన పులిహోర, దద్దోజనం... ఈ ఐదు రకాల సద్దులను ఒకరికొకరు పంచుకొంటారు. సమాజంలో సమతా మమతలను పెంపొందించేందుకే ఇలాంటి ఆచారాలను మన పెద్దలు ప్రారంభించారేమో!
బతుకమ్మ పాటల్లో...
ఇదొక నృత్య ప్రధానమైన వేడుక. అందుకే ‘బతుకమ్మ ఆడారా’... అంటాం కానీ, ‘చేశారా... చూశారా’ అనం కదా! బతుకమ్మలో ఆడవాళ్లు అంతా వలయాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ... ఒక పెద్ద గాథను కూడా ఒకే పాటగా కట్టి పాడతారు. అందులో మహిళల భావాలు, స్వభావాలు, రామాయణ, మహాభారత గాథలు, స్థానిక చరిత్ర, ఇంట, బయట వారికి ఎదురయ్యే ఒడుదొడుకులను, వాటిని ఎదుర్కొనే ఉపాయాలు, ఉయ్యాల పాటలు... ఇలా బోలెడు ఇతివృత్తాల మీద క్లిష్టమైన పదాలతో కూడిన కొన్ని వందల పాటలను గుక్క తిప్పుకోకుండా పాడతారు. ప్రతి పాటలో భాషా విలువలు, పాండిత్యం తొణికిసలాడతాయి. అలాంటి విలువైన పాటలు కొన్నిటిని నా పరిశోధనలోనూ ప్రస్తావించాను. అందులో గౌరమ్మ పుట్టుక, వలలో ఊత పదంతో మొదలయ్యే పాట లాంటివి కూడా ఉన్నాయి. భట్టు నరసింహ కవి రాసిన బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలను తెలిపే ‘శ్రీలక్ష్మీదేవియ చందమామ’ పాట కూడా నా పరిశోధనలో పొందుపరిచాను.
ఆచారం వెనుక ఆరోగ్యం...
‘బతుకమ్మ’ చారిత్రక నేపథ్యం మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇది ప్రధానంగా 19వ శతాబ్దంలో అవతరించిందని నా పరిశోధనలో వెల్లడించాను. దారిద్య్రం, కలరా, మశూచి లాంటి అంటు వ్యాధులతో ఆ నాటి ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్న సమయంలో, వారి ఊహలకు ప్రతిరూపంగా అంకురించింది బతుకమ్మ. ‘నీ బిడ్డల్ని బతికించు అమ్మా’ అని వేడుకుంటూ ప్రకృతి ఆరాధకులైన జానపదులు బతుకమ్మను సృష్టించారు. అందుకే ఇది తొలినాళ్లలో పూర్తిగా శ్రమజీవుల పండుగ. తంగేడు, గునుగు, బీర, గుమ్మడి, రుద్రాక్ష, కట్ల, బంతి మొదలైన ఔషధ గుణాలు కలిగిన పూలతో బతుకమ్మను పేరుస్తారు. పూజ అనంతరం వాటిని చెరువులు లేదా బావులు, కుంటల్లో వదులుతారు. గ్రామస్తుల ఆరోగ్యం కోసం నీటి కాలుష్యాన్ని నివారించడానికి ఈ ఆచారం మొదలైంది. ఇది మన పెద్దల దార్శనికతకు నిదర్శనం.
పరమార్థాన్ని మార్చేస్తున్నారు...
బతుకమ్మ కంటే ముందు... భాద్రపద బహుళ దశమినాడు కన్నెపిల్లలు పుట్ట మన్ను తెచ్చి ఒక పీట మీద బొడ్డెమ్మ చేస్తారు. పసుపు, కుంకుమతో బంతి, రుద్రాక్ష, గోరెంక పూలతో ఆరాధిస్తారు. అయితే ఇప్పుడు ఎక్కడో ఒకరు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఆటలోనూ చాలా మార్పులు వచ్చాయి. బతుకమ్మ పాటల్లోనూ, నృత్యంలోనూ ఒక లయ ఉంటుంది. అది సమష్టి తత్వానికి ప్రతీక. ఆటలోనూ పదేపదే వంగి లేవడం శరీరానికి మంచి వ్యాయామం. చప్పట్లు కొట్టడంతో నరాలు ఉత్తేజితం అవుతాయి. ఈ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని చోట్ల డీజేలు పెట్టి ఇష్టానుసారంగా పిచ్చి గంతులేస్తున్నారు. బతుకమ్మ పండుగ పరమార్థాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఇది సరికాదు.
సాంత్వన్
ఫొటోలు: రాజ్‌కుమార్
Updated Date - 2023-10-17T23:37:39+05:30 IST