ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

K. Ramalakshmi: ఎవరి భుజాలో ఎక్కి మనం ఊరేగలేం కదా!

ABN, First Publish Date - 2023-03-03T22:43:55+05:30

తన మనసులోని అభిప్రాయాలను స్వేచ్ఛగా.. నిక్కచ్చిగా.. నిర్భయంగా చెప్పిన అతి కొద్ది మంది రచయిత్రులలో కె. రామలక్ష్మి ఒకరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తన మనసులోని అభిప్రాయాలను స్వేచ్ఛగా.. నిక్కచ్చిగా.. నిర్భయంగా చెప్పిన అతి కొద్ది మంది రచయిత్రులలో కె. రామలక్ష్మి ఒకరు. ఏడు తరాల జీవితాలను, సినీ సాహిత్య రంగాలను అత్యంత సన్నిహితంగా చూసిన వ్యక్తి ఆమె. తెలుగు సాహిత్య సంద్రాన్ని మదించి... ప్రజలకు ఎంతో ప్రియతముడైన రచయిత ఆరుద్రతో జీవితాన్ని పంచుకున్న ఆమె శుక్రవారం మరణించారు. గతంలో ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఆసక్తికరమైన భాగాలు ‘నవ్య’ పాఠకుల కోసం...

ముళ్లపూడి రమణతో...

రచయిత ఎప్పుడూ ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఎవరి భుజాలో ఎక్కి మనం ఊరేగలేం కదా! ఆత్మగౌరవం లేకుండా ఎన్నాళ్లు బతగ్గలరు? నేను ముళ్లపూడి వెంకటరమణకే చెప్పాను ఈ సంగతి. ‘నువ్వు ఎప్పటికి నిలబడతావు? నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు? ఏంటయ్యా ఇది అర్థంలేకుండాను! నీ ఇల్లేమో మమ్ముట్టికి అమ్ముకున్నావు. ఇప్పుడు చిన్న పాకలాగా బాపు గారి మేడ మీద వేసుకున్నావు. అంటే నీ భార్య, పిల్లలు ఏమీ అనుకోరనుకుంటున్నావా? వాళ్లకు భావోద్వేగాలు ఉండవా’ అని రమణను అడిగాను... అలాగే నేను కృష్ణంరాజును కూడా అడిగా... ‘ఏంటండీ... ఒక రచయితను పట్టుకుని మీరు అలా ముంచేయడం’ అని. ‘నాది మటుకు డబ్బు కాదా’ అన్నాడు తను. ఆయనకు గ్యారెంటీగా ఉన్నందుకే రమణ దెబ్బతిన్నారు. పాపం ఆయన్ని ముంచేశారు.

దేవదాసు చాలెంజ్‌

కృష్ణ ‘దేవదాసు’కు ఆత్రేయ మాటలు, ఆరుద్ర పాటలు రాశారు. నిజానికి ఆ సినిమా బాగుంటుంది. అయితే నేను అప్పుడు అడిగాను కృష్ణ గారిని... ‘అంత కష్టపడి ఈ సినిమా తీయాలా’ అని. ఇంకో కొత్త కథ రాసుకోవచ్చు కదా! కొంపలు ముంచుకొనే చాలెంజ్‌లు ఎందుకు?

చెస్‌ అంటే విసుగు!

ఆరుద్రకు సంగీతం, నృత్యం, చదరంగం, రచనలు ఇలా అనేకం వచ్చు. ఆయన రాసిన చెస్‌ పుస్తకం ఎన్ని ఎడిషన్స్‌ వెళ్లిందో! కానీ నాకు చెస్‌ అంటే విసుగు. సమయం వృథా. ఆయన విశ్వనాథన్‌ ఆనందన్‌తో ఆడేవారు కూర్చొని. అతన్ని ఆరుద్రే ముంబయి పంపించారు. ఆయన పిల్లలతో బాగా చనువుగా ఉండేవారు.

చలం భజన

నేను రమణాశ్రమానికి వెళ్లినప్పుడు చలంఅక్కడ భజన చేస్తున్నారు. ‘సార్‌... నాకు భజనలు అవీ రావు’ అంటే, ‘విను’ అన్నారు. అసలు అలా మారిపోతారా? ఇంతమంది సన్యాసులను చూస్తున్నాం. వాళ్లు మారారా? అంతకుముందు ఆరుద్రకు ఆయనకు పరిచయం లేదు. తరువాత అలా తరచూ ఆశ్రమానికి వెళ్లినప్పుడు కలిసేవాళ్లం.

ఫైల్‌ విసేరేశాడు

‘జీవనజ్యోతి’, ‘గోరింటాకు’ సినిమాలు నాకు బాగా పేరు తెచ్చాయి. ‘జీవనజ్యోతి’ వాణిశ్రీ కోసం రాశాను. కె.విశ్వనాథ్‌ దర్శకుడు. ఆయన శుద్ధశ్రోత్రియ జంధ్యం బ్రాహ్మణుడు. అతను చక్కటి డైనింగ్‌ టేబుల్‌ ఉంటే పక్కన ఆకు వేసుకుని తింటాడు. ఆస్వాదించడం అనేది ఆయనకు లేదు. నేను అలా ఉండలేను. ‘జీవనజ్యోతి’ సమయంలో విశ్వనాథ్‌ ఫైల్‌ నా ముఖం మీద విసిరేశారు. స్ర్కిప్ట్‌ బాలేదని. నేను జోళ్లేసుకుని కిందకు వచ్చేశాను. తరువాత బెజవాడలో వేదికపై ‘నేను ఇకమీదట ఇంకొకళ్లు రాసిన కథను సినిమాగా తీయను’ అన్నాడు విశ్వనాథ్‌. అందుకు శోభన్‌బాబు.. ‘విశ్వనాథ్‌ గారు... మీరు అన్నమాట ఏమాత్రం బాలేదు. చాలాకాలం తరువాత చాలా మంచి పేరు తెచ్చిందీ చిత్రం. ఈ ఘనత ఆమెది. వాణిశ్రీ ఆమె కోసం చేసింది. మీరిస్తే చేయదు’ అన్నాడు.

శ్రీశ్రీకి పిచ్చి..

శ్రీశ్రీకి పిచ్చెత్తినప్పుడు డాక్టర్‌ తిరుమలరావును పిలిచి చూపించాను... శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ నేను చదవలేదు. చదవను. ‘పదండి ముందుకు పదండి...’ అని నేనూ రాస్తా. అదొక గొప్ప కవిత్వం అని నేనెప్పుడూ అనుకోలేదు. ‘ది బర్డ్‌’ అన్న కవిత్వం చదివారా? ఆ బర్డ్‌ తీసుకొచ్చి డాడీకి నేను ఇచ్చాను. ‘ఇదేమిటి చూడు... శ్రీశ్రీ పద్యం ఎక్కడిద’ని! శ్రీశ్రీ, ఆరుద్ర మంచి సన్నిహితులు. కలిసి కవిత్వం కూడా రాశారు. పిచ్చిగా తాగేసి, ‘కాసేపు లైబ్రరీలో పడుకుని వెళ్లిపోతాడు’ అని ఆరుద్ర అనేవారు. ‘మీ లైబ్రరీలో మీ నాన్నను కూర్చోనివ్వలేదు. చుట్ట కాలుస్తాడని. మరి ఈయన అక్కడ ఉంటాడా?’ అన్నాను. ఒకసారి సంఘటన చెబుతా. అప్పుడు ప్రొహిబిషన్‌ ఉండేది. ‘రిక్షా ఎక్కించి, వాడికి చెప్పి, ఆయన ఎక్కడ దిగిపోతానంటే అక్కడ దింపేయ్‌. ప్రొహిబిషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జార్జి. వాడు అడిగితే ‘రామలక్ష్మి పంపింది’ అని చెప్పమను’ అని పంపించేశాను.

పరిమితి లేని తాగుడు..

చాలామంది తాగుతారు. నేను తాగుతాను. మా ఆయనా తాగుతాడు. అందులో తప్పులేదు. కానీ దానికీ ఒక పరిమితి ఉంటుంది. కానీ మరీ అంత తాగుతారా? పెళ్లాన్ని కొడుతున్నారో, కూతుర్ని కొడుతున్నారో తెలియనంతా? శ్రీశ్రీ నన్ను అత్తగారంటాడు. ఆ తరువాత ‘తాటకేశ్వరి’ అని కూడా అన్నాడనుకోండి. అయితే తరువాత మా అమ్మాయి రౌద్రి కవిత్వానికి ముందు మాట రాయించుకోవడానికి శ్రీశ్రీ దగ్గరకు వెళ్లాను. ఆరుద్రను వెళ్లమంటే వెళ్లనన్నాడు. వెళ్లకపోతే నా కూతురుకు నేను చెడ్డదాన్ని అవుతాను కదా! అందుకే చచ్చినట్టు వెళ్లా. మా ఇంట్లో అందరూ శ్రీశ్రీని ప్రేమిస్తారు.. నేను తప్ప. ‘నా పుస్తకానికి శ్రీశ్రీ ముందు మాట రాయాలి మమ్మీ’ అంది నా కూతురు. నాకు సుదీర్ఘ కాలంపాటు విరోధాలు, కోపాలు పెట్టుకొనే రకం కాదని తనకు చెప్పి, తీసుకువెళ్లాను. నాకు మహాపతివ్రతలాగా అంత ఓర్పు, సహనం లేవు. చీపురు తిరగేస్తే బాగుంటుందనిపిస్తుంది ఒక్కక్కప్పుడు. మహాకవి అయితే ఏమైనా చేస్తాడా?

జయలలితతో అనుబంధం..

జయలలిత తెలివిగల పిల్ల. ఇలా ముట్టుకొంటే మాసిపోతున్నట్టు ఉంటుంది. నన్ను ఒకసారి శోభన్‌బాబు ఇంటికి పిలిచాడు. ‘మా గురువు గారి కూతురు. ఆయన పెళ్లి చేయలేరు. అందుకే చేసుకున్నా’నని నాతో చెప్పాడు. నేను చెప్పాను... ‘అది విధి’ అని. నాలాంటి గయ్యాళి ఆరుద్రకు వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? అప్పుడు నేను ‘చిన్ని ఓ చిన్ని...’ పాట రాస్తున్నా. శోభన్‌బాబు ‘మీరు కథా ఆడవాళ్ల కోణంలోనే రాస్తారు. టైటిల్సూ ఆడవాళ్లకు చెందినవే పెడతారు. కనీసం ఒక టైటిల్‌ అయినా ఇవ్వరేంటి’ అనేవాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. జయలలిత విషయానికి వస్తే తను అద్భుతమైన ప్రతిభ ఉన్న నటి. మంచి అమ్మాయి. ఆమెపై బురద చల్లడం సరికాదు. ‘గోరింటాకు’ షూటింగ్‌ జయలలిత ఇంట్లో తీశారు. ‘మీరంతా ఇక్కడ భోజనం చెయ్యండి’ అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. ‘ఎందుకు... వెళ్లిపోతాం. ఇవాళ ఫుల్‌ డే షూటింగ్‌ లేదు’ అన్నాడు శోభన్‌బాబు. ‘లేదు... నేనువడ్డిస్తా’ అంది. శోభన్‌బాబును ఆమె ప్రేమించింది. అతను తనను పెళ్లిచేసుకోవాల్సింది. కానీ తన భార్యను మోసం చేయదలుచుకోలేదు. అందుకే జయను పెళ్లి చేసుకోలేదు. అతను చాలా సిన్సియర్‌. అతని కొడుకు బానే ఉంటాడు. కానీ ఎందుకో ‘సినిమాల్లోకి రావద్దు’ అని చెప్పాడు.

స్టాలిన్‌ అంటే భయం.. భయం

ఇప్పుడు అసెంబ్లీలో స్టాలినే గొప్పవాడు. ఒకప్పుడు స్టాలిన్‌ వీధిలో నుంచి వెళ్లడానికి అమ్మాయిలు భయపడేవారు. మా విద్యాలతారెడ్డి చెబుతుండేది... ‘స్టాలిన్‌ ఉంటే ఇలా ముసుగు వేసుకొని వెళ్లిపోతాం’ అని.. ఇక వాళ్ల నాన్న కరుణానిధి బ్యాడ్‌ ఫెలో కాదు. నేను ‘శిలప్పధికారం’ తెలుగు రైట్స్‌ ఇమ్మని అడిగా. చాలా బాగుంటుంది. ‘చేస్తావా’ అన్నాడు. ‘ఇంగ్లిష్‌ తీసుకొంటాను. మీరు రాసి ఇవ్వండి’ అంటే ‘ఎంతిస్తారు’ అన్నాడు. ‘ఎంత అడిగితే అంతిస్తాను. కావాలనుకున్నప్పుడు ఇవ్వాలి కదా’ అన్నాను. రైట్స్‌ ఇచ్చాడు. నేను నూట పదహార్లు ఇచ్చాను. కానీ బాగా రాశాడు.

Updated Date - 2023-03-04T11:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!