Sunita Achyuta : మన మనసులు అంతగా బండబారాయా?
ABN, First Publish Date - 2023-07-21T23:54:56+05:30
‘‘మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించడం, లైంగిక దాడులకు తెగబడటం ఈ దేశానికి కొత్తేమీ కాదు. కులోన్మాద, మతోన్మాద ఆధిపత్య ఘర్షణలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బల ప్రదర్శనలో భాగంగా ఆడవాళ్ల మీద సామూహిక అత్యాచారాలు, హత్యలు ఇక్కడ సర్వసాధారణం. అది గుజరాత్ అల్లర్లలోనూ చూశాం.
మణిపూర్‌లో వెలుగు చూసిన అమానవీయ ఘటన
యావత్ దేశాన్ని కలవరపరిచింది. ‘ఇదీ ఈ దేశ ముఖచిత్రం’ అంటూ కొందరు సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. ‘మణిపూర్ హింసను రెండు సమాన
వర్గాల మధ్య సాగుతున్న ఘర్షణగా చూడరాదు’ అంటారు స్త్రీల హక్కుల
ఉద్యమకారిణి సునీత అచ్యుత. తన అభిప్రాయాన్ని
ఆమె ఇలా చెబుతున్నారు...
‘‘మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించడం, లైంగిక దాడులకు తెగబడటం ఈ దేశానికి కొత్తేమీ కాదు. కులోన్మాద, మతోన్మాద ఆధిపత్య ఘర్షణలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బల ప్రదర్శనలో భాగంగా ఆడవాళ్ల మీద సామూహిక అత్యాచారాలు, హత్యలు ఇక్కడ సర్వసాధారణం. అది గుజరాత్ అల్లర్లలోనూ చూశాం. మణిపూర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రెండు నెలలుగా వార్తలొస్తున్నాయి. అక్కడి పర్వత, మైదాన ప్రాంతాలవారి మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయని వింటున్నాం. ఆ నేపథ్యంలోనే కుకీల మీద మెయితేయిలు జరిపిన ఉన్మాద చర్య తాలుకూ వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చింది. దాన్ని మనమంతా చూసి గుండెలు బాదుకుంటున్నాం. అంటే ఆ దుర్మార్గం దృశ్యంగా కళ్లముందు కదలాడేంత వరకు మనం స్పందించలేకపోయాం. మన మనసులెంతగా బండబారిపోయాయో కదా! ఇక హింసాత్మక పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యులు కేవలం బాధను వ్యక్తం చేసేందుకే పరిమితం అవడానికి మించిన అన్యాయం మరొకటి ఉందా? పాలకుల తీరు చూస్తుంటే మణిపూర్ మంటలతో చలికాచుకోవాలన్న డబుల్ ఇంజన్ సర్కారు ద్వంద్వ వైఖరి స్పష్టమవుతుంది. దీన్నిలానే కొనసాగిస్తే, రాబోయే కాలానికి దీన్నొక విన్నింగ్ ఫార్ములాగా కూడా మార్చుకునే ప్రమాదం లేకపోలేదు. కనుక త్వరగా మేల్కొనకపోతే ప్రమాదమే.
ఎలా చూడాలంటే...
మణిపూర్‌లో కుకీ, మెయితేయిల మధ్య ఘర్షణలో ఇరు వర్గాలూ బాధితులైనప్పటికీ, దీన్ని రెండు సమానమైన వర్గాల మధ్య నడుస్తున్న పోరులా చూడలేం. అక్కడి రాజకీయ, వ్యాపార తదితర రంగాలలో మెయితేయిలదే పైచేయి. ఆర్థికంగానూ బలమైన శక్తిగా కొనసాగుతున్న వాళ్ల చూపు ఇప్పుడు పర్వత శ్రేణుల్లోని భూమి, ఇతర వనరుల మీద పడింది. దాన్ని గిరిజనులైన కుకీలు సమ్మతించకపోవడంతో ఆధిపత్య వర్గమైన మెయితేయిలు దాడులు మొదలుపెట్టారు. కుకీల ప్రార్థనాలయాలను కూలొగొట్టారు. ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఆడవాళ్ల మీద సామూహిక అత్యాచారాలకు తెగబడ్డారు. కుకీలు కూడా హింసకు పాల్పడ్డారు. పర్యవసానంగా కొన్ని వందల మంది చనిపోయారు. వేలమంది నిరాశ్రయులయ్యారని కూడా స్థానిక నివేదికలు చెబుతున్నాయి. ఒకవైపు ఇంతటి నరమేధం కొనసాగుతున్నా పాలకులు మౌనంగా ఉన్నారంటే... దాని వెనుక పెద్ద వ్యూహమే ఉండుండాలి. బహుశా ఈ ఆటలో మెయితేయిలు కూడా తర్వాత కాలంలో పావులుగా మిగిలే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, దీని వెనుక ఏలికలకు ఇష్టమైన పెద్ద పారిశ్రామికవేత్తల వ్యాపార ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు.
ఈ సమస్య మీద హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ఆచార్య ఖామ్ ఖాన్ సువాన్ హౌసింగ్ కొన్ని రోజులుగా పలు వ్యాసాలు రాస్తున్నారు. అందుకు ఆయన మీద మణిపూర్ ప్రభుత్వంలోని మెయితేయిలు క్రిమినల్ కేసు దాఖలు చేయడమేగాక ఇంఫాల్ కోర్టు నుంచి సమన్లు కూడా పంపారు. దీన్నిబట్టి అవతలి వర్గం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.
శాంతి నెలకొల్పాలి...
మణిపూర్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని మనమంతా కోరుకుంటాం. కానీ ఇదే అదనుగా విద్వేష ముఠాలు విశ్వరూపం చూపిస్తాయి. ఆధిపత్య పోరును మతకల్లోలంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తాయి. కుకీలు పరాయి దేశస్తులు అనే వాదనలను ముందు పెడతాయి. వాళ్ల జీవన శైలి, సంస్కృతి మీద దష్ప్రచారాల వరద వాట్సప్ గ్రూపుల్లో పారుతుంది. సీఏఏ, ఎన్నార్సీ లాంటి చట్టాలు అమలు చేయాలనే డిమాండ్లు ముందుకొస్తాయి. ఇలా ఒకటా, రెండా... సామాన్యులు ఉమ్మడి సమస్యలు మరిచిపోయి ఒకరినొకరు ద్వేషించుకోడానికి, దూషించుకోడానికి అవసరమైన అబద్ధాలను వండి వార్చేందుకు బలమైన శక్తులు నిరంతరం పని చేస్తుంటాయని తెలిసిందే. నిజానికి కుకి వర్గానికి చెందిన చాలామంది భారత స్వాతంత్ర్యోద్యమంలో పని చేశారు. కనుక ఇప్పుడు సాగాల్సిన చర్చ వాళ్లు ఈ దేశ పౌరులా కాదా అని కాదు... మణిపూర్‌లో శాంతి నెలకొల్పడమే ప్రధానం. సుదీర్ఘ పోరాటం ద్వారా కుకీలు సాధించుకున్న అటానమస్ కౌన్సిల్‌కు నిధులు కేటాయించి, దాని స్వతంత్రతను కాపాడటం. ఎవరి గ్రామాలకు వారిని పంపించడం, ధ్వంసమైన వసతులను పునర్‌నిర్మించడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలి. ఇవన్నీ జరిగితే తప్ప భవిష్యత్తులో ఈ సమూహాల మధ్య సయోధ్య కుదర్చడం అసాధ్యం. దీనికి ఎంతో రాజకీయ పరిణతి, ధైర్యం అవసరం’’
విస్మయానికి గురిచేసింది ఏమిటంటే...
మెయితేయిల దాడులను కొన్నిచోట్ల కుకీలు ప్రతిఘటించిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలో కొంత నష్టం తలెత్తి ఉండచ్చు. అయితే, దాన్ని ఆత్మరక్షణలో భాగంగా చూడాలి గానీ ప్రతిదాడిగా భావించలేము. అన్నింటికన్నా విస్మయానికి లోనుచేస్తున్న విషయం ఏమిటంటే... పారామిలటరీ, సాయుధ దళాల దాష్టీకాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పోరాడిన ‘మెయిరా పైబిస్’ (మెయితేయి వర్గానికి చెందిన సంఘటిత స్త్రీలు) మహిళలు కూడా కుకీల మీద దాడిని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రోత్సహిస్తు న్నారని సమాచారం. ఇదే విషయాన్ని సామాజిక ఉద్యమకారిణి కవితాకృష్ణన్ కూడా రాశారు. అందులో నిజం లేకుంటే, మరి పౌరహక్కుల కోసం పోరాడుతున్న వారు ఈ దాష్టీకాలను వ్యతిరేకించినట్టు ఇంత వరకు ఒక్క వార్త కూడా రాలేదు. ఒకవేళ వారు స్పందించినా బయటకు రావడంలేదా? ఈ విషయాలు తెలియాలి. ఆధిపత్య వర్గాలకు చెందిన ఆడవాళ్ల మీద కులం కూడా బలంగా పని చేస్తుంది. కనుక ఘర్షణల సందర్భంలో ఇతర సమూహాల మహిళల పట్ల సహానుభూతి కానీ, సానుభూతి కానీ వారిలో వ్యక్తపరచడం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఏదేమైనా ఇరు వర్గాల మధ్య ఘర్షణలో అంతిమంగా నష్టపోయేది మహిళలు, పిల్లలే అనే స్పృహ ఆధిపత్య వర్గాల స్త్రీలకు ఉండాలి.
సాంత్వన్
Updated Date - 2023-07-21T23:54:56+05:30 IST