ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోలేం: మోదీ
ABN, First Publish Date - 2023-06-26T01:32:22+05:30
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి రోజులను మరిచిపోలేమంటూ ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఓ కుటుంబం అహంకారంతో దేశ ప్రయోజనాలను బలిపెట్టిందని
న్యూఢిల్లీ, జూన్ 25: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి రోజులను మరిచిపోలేమంటూ ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఓ కుటుంబం అహంకారంతో దేశ ప్రయోజనాలను బలిపెట్టిందని, రాత్రికి రాత్రి లక్షలాది మందిని జైళ్లలో బంధించిందని దుమ్మెత్తిపోశారు. ఎమర్జెన్సీకి 48 ఏళ్లు నిండిన సందర్భంలో మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ తదితరులు కాంగ్రెస్ లక్ష్యంగా ట్విటర్‌లో విమర్శలు సంధించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసినవారందరికీ అంజలి ఘటిస్తున్నానని ప్రధాని మోదీ ఆదివారం ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీని మరిచిపోలేని చీకటి కాలంగా అభివర్ణించారు. నాటి ఎమర్జెన్సీ కాంగ్రెస్ నియంతృత్వ మనస్తత్వానికి ఇప్పటికీ నిదర్శనంగా నిలుస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారి వల్లే నేడు దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-06-26T01:32:22+05:30 IST