Gujarat's Morbi Bridge: ముందే సగం తీగలు తెగిపోయాయి
ABN, First Publish Date - 2023-02-21T04:02:13+05:30
గుజరాత్‌లోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి (వేలాడే వంతెన) కూలిపోవడానికి కారణం అప్పటికే దాదాపు సగం తీగలు తుప్పుపట్టి ఉండడం, పాత సస్పెండర్లను కొత్తవాటితో కలిపి వెల్డింగ్ చేయడమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది.
గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ఘటనపై ‘సిట్’ నివేదిక
మోర్చి, ఫిబ్రవరి 20: గుజరాత్‌లోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి (వేలాడే వంతెన) కూలిపోవడానికి కారణం అప్పటికే దాదాపు సగం తీగలు తుప్పుపట్టి ఉండడం, పాత సస్పెండర్లను కొత్తవాటితో కలిపి వెల్డింగ్ చేయడమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల సిట్ ఇచ్చిన నివేదికను పట్టణాభివృద్ధి శాఖ ఇటీవలే మోర్బీ మునిసిపాలిటీకి అందజేసింది. గతేడాది అక్టోబరు 30న చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 135 మంది మరణించారు. 1887లో బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఈ వంతెనకు రెండు ప్రధాన కేబుళ్లు ఉంటాయి. ఒక్కో కేబుల్‌లో ఏడు ఉపతీగలు ఉంటాయి. ఒక్కో ఉపతీగ... ఏడు తీగల పోగు. మొత్తం 49 తీగల్లో దాదాపు సగం ప్రమాదానికి ముందే తెగిపోయాయని సిట్ పేర్కొంది. మిగతావి ప్రమాదం సమయంలో తెగిపోయాయని తెలిపింది. గతేడాది మార్చిలో ఈ వంతెనకు మరమ్మతులు చేపట్టారు. అప్పుడు కొత్తగా వేసిన సస్పెండర్లను పాతవాటితో కలిపి వెల్డింగ్ చేశారు. ఇది కూడా ప్రమాదానికి దారితీసిందని సిట్ వివరించింది.
Updated Date - 2023-02-21T04:02:14+05:30 IST