Setu Samudram: ఏమి‘సేతు’
ABN, First Publish Date - 2023-01-13T09:03:28+05:30
‘సేతుసముద్రం’ ప్రాజెక్టు(Sethusamudram project)ను అమలు చేయాలన్న డిమాండ్ తమిళనాట సుదీర్ఘకాలంగా వుంది. కొంతమంది
- మళ్లీ తెరపైకి ‘సేతు సముద్రం’
- తక్షణం పూర్తి చేయాలని అసెంబ్లీలో డీఎంకే ప్రభుత్వం తీర్మానం
- ఇరుకున పడిన బీజేపీ?
- పార్లమెంటులో కాషాయదళానికి చిక్కే!
‘సేతుసముద్రం’ ప్రాజెక్టు మరోమారు తెరపైకి వచ్చింది. సుమారు పదేళ్ల తరువాత ఈ ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ రాజకీయ వేడి రాజేస్తోంది. సేతుసముద్రం ప్రాజెక్టును ఆది నుంచి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డీఎంకే.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని ద్వారా తన సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చుకునే యత్నంతో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఇరుకున పెట్టనుందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. సేతుసముద్రం ప్రాజెక్టు పూర్తి చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా డీఎంకే రెండు విధాలుగా లబ్ధి పొందే వ్యూహం కనిపిస్తోంది. అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించి కేంద్రప్రభుత్వం.. ఈ ప్రాజెక్టు చేపడితే అది తమ ఘనతేనని చెప్పుకోవచ్చని డీఎంకే పాచిక విసిరింది. ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తమిళనాడు జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది. దీంతో ప్రజల్లో డీఎంకే ప్రతిష్ఠ పెరుగుతుందని అంచనా వేస్తోంది.
చెన్నై, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘సేతుసముద్రం’ ప్రాజెక్టు(Sethusamudram project)ను అమలు చేయాలన్న డిమాండ్ తమిళనాట సుదీర్ఘకాలంగా వుంది. కొంతమంది సంప్రదాయవాదులు, పర్యావరణ వేత్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ద్రావిడ భావజాలం కలిగిన అత్యధికులు ఈ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారు. అందుకే ప్రజానాడి గ్రహించిన డీఎంకే.. ఆది నుంచి ఈ ప్రాజెక్టు పూర్తికి కట్టుబడి వుంది. అందుకే గత 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం తాము అధికారంలోకి వస్తే సేతుసముద్రం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఆ మేరకు సీఎం స్టాలిన్(CM Stalin) చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే గురువారం అసెంబ్లీలో ఈ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని తీర్మానం ఆమోదించారు.
ఏమిటీ ప్రాజెక్టు?
పాక్ జలసంధి - గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను అనుసంధానించే ఈ ప్రాజెక్టు భారత్ శ్రీలంక మధ్య నౌకా వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం తమిళనాడు నుంచి బయలుదేరే నౌకలు శ్రీలంక చుట్టూ తిరుగుతూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోంది. ‘రామవారధి’గా పిలవబడే వంతెనను తొలగిస్తే, సేతు సముద్రం ప్రాజెక్టు పూర్తయితే నౌకలు శ్రీలంక చుట్టూ తిరగాల్సిన అవసరం వుండదు. అదే జరిగితే కొన్ని వందల కోట్ల రూపాయల వ్యయం తగ్గుతుందని, నౌకావాణిజ్యం పెరగడం ద్వారా తమిళనాడుకు ఆర్థిక లబ్ది చేకూరుతుందని డీఎంకే భావిస్తోంది. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వెళ్లేందుకు నిర్మించబడిన ‘రామ వారధి’ని ధ్వంసం చేయడం ఏమాత్రం సరి కాదని, ఇది ఏమాత్రం శ్రేయస్సు కాదని భక్తులు, సంప్రదాయవాదులు, బీజేపీ శ్రేణులు గట్టిగా వాదిస్తున్నారు. అదే సమయంలో పర్యావరణవేత్తలు సైతం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ డ్యాంను తొలగిస్తే సముద్రంలో జలసంపద సర్వనాశనమవుతుందని, తద్వారా పర్యావరణానికి ముప్పువాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
150 ఏళ్ల నుంచే సన్నాహాలు
పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను కలిపే ఈ ప్రాజెక్టుకు 150 ఏళ్ల క్రితమే బీజం పడింది. 1860లో కమాండర్ టేలర్ ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.50 లక్షలు కేటాయించారు. అనంతరం 1955లో ఇంజనీరింగ్ నిపుణుడు డాక్టర్ ఎ.రామస్వామి ముదలియార్ నేతృత్వంలోని కమిటీ ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘకాలం అధ్యయనం చేసింది. 1963లో దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా వూపింది. 1964లో ఏర్పాటైన డాక్టర్ నాగేంద్రసింగ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇంజనీరింగ్ నిపుణులచే అనేక సంవత్సరాలు పరిశోధన, రూపకల్పన చేసింది. ఈ మార్గాన్ని అధ్యయనం చేసి పర్యావరణానికి ముప్పువాటిల్లని రీతిలో పనులు చేపట్టేందుకు నివేదికలు కూడా రూపొందించింది. ఆ తరువాత ఆ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోగా 1998లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఆమోదం తెలిపింది. అప్పుడే సేతుసముద్రం ప్రాజెక్టు ప్రణాళికల్ని కూడా ఖరారు చేసింది. అనంతరం వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,427 కోట్లుగా అంచనా వేసి, తగిన నిధులు కేటాయించింది. ఆ మేరకు 2005 జూలై 7వ తేదీన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కరుణానిధి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. మధ్యలో కొన్నిమార్లు అవాంతరాలు ఏర్పడినప్పటికీ సగం పనులు పూర్తయినట్లు నాటి కేంద్రప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అయితే 2014లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి మళ్లీ తీర్మానం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది.
ఒక తీర్మానం.. రెండు లాభాలు!
సేతుసముద్రం ప్రాజెక్టు పూర్తి చేయాలని తీర్మానం చేయడం ద్వారా డీఎంకే రెండు విధాలుగా లబ్ది పొందే వ్యూహం కనిపిస్తోంది. అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించి కేంద్రప్రభుత్వం.. ఈ ప్రాజెక్టు చేపడితే అది తమ ఘనతేనని చెప్పుకోవచ్చన్నది డీఎంకే భావనగా కనిపిస్తోంది. అంతేగాక ఈ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదట లబ్దిపొందేది తమిళనాడే. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేలాదిమంది యువతకు ఉపాధి లభించడంతో పాటు భారీగా ఆర్థిక లబ్ది పొందడం ఖాయం. అంతేగాక దక్షిణాది జిల్లాలకూ ఆర్థిక వనరులు ఒనగూరుతాయి. ప్రాజెక్టు పూర్తయిన తరువాత కూడా దక్షిణాది జిల్లాలు భారీగా లబ్ది పొందుతాయి. నౌకావాణిజ్యం పెరగడం ద్వారా రాష్ట్ర ఖజానా కూడా బలోపేతమవుతుంది. ఇదంతా తమ ఘనతేనని చెప్పుకునేందుకు డీఎంకేకు అవకాశముంటుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్రానికి లబ్ది చేకూర్చే ప్రాజెక్టును బీజేపీ నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లవచ్చు. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో ప్రధారి నరేంద్రమోదీ రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల నుంచి కూడా పోటీ చేసే అవకాశముందని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ వ్యవహారం ఆయనకు కొంత ఇబ్బంది కలిగించే అంశమే అవుతుంది. తద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీని ఇరుకున పెట్టవచ్చన్నది స్టాలిన్ వ్యూహంగా కనిపిస్తోంది.
Updated Date - 2023-01-13T09:03:30+05:30 IST