స్టడీ లీవ్‌లో సర్వీసు రూల్స్ పాటించాల్సిందే
ABN, First Publish Date - 2023-06-14T05:26:21+05:30
ఉన్నత విద్యాభ్యాసం కోసం స్టడీ లీవ్ తీసుకునే ఆల్ ఇండియా సర్వీసు అధికారులు తప్పనిసరిగా సర్వీసు రూల్స్‌ను పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లేకుంటే క్రమశిక్షణ
● సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త
● సివిల్ సర్వెంట్లకు కేంద్రం మార్గదర్శకాలు
● ఉల్లంఘించబోమంటూ బాండు ఇవ్వాలని సూచన
న్యూఢిల్లీ, జూన్ 13: ఉన్నత విద్యాభ్యాసం కోసం స్టడీ లీవ్ తీసుకునే ఆల్ ఇండియా సర్వీసు అధికారులు తప్పనిసరిగా సర్వీసు రూల్స్‌ను పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లేకుంటే క్రమశిక్షణ చర్యలు, తదనంతర పరిణామాలు ఉంటాయని పేర్కొంది. ఈ సెలవు తీసుకునే వారంతా ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్–1968ను తప్పకుండా పాటిస్తామంటూ బాండును సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అందరు ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్టు సర్వీసు అధికారులకు తెలియజేయాలంటూ కేంద్ర సిబ్బంది శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను పంపించింది. వీటిని ఉల్లంఘించిన వారిని మధ్యలోనే వెనక్కి పిలిపించే అవకాశం ఉంది. ఇంకెప్పుడూ స్టడీ లీవ్‌లు ఇవ్వకపోవచ్చు. ఈ సౌకర్యం పొందిన వారు విదేశీయులు, సోషల్ మీడియాతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. సివిల్ సర్వీసు ఉన్నతాధికారులమన్న సంగతిని గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. తాను నిర్వహిస్తున్న విధులు, కెరీర్ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని భావించినప్పుడు మాత్రమే స్టడీ లీవ్ తీసుకోవాలి. వీటిన్నింటిని గమనించిన తరువాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. స్టడీ లీవ్ ఆవశ్యకత గురించి తొలుత సంబంధిత అధికారి నుంచి వివరణ తీసుకోవాలంటూ సూచనలు ఇచ్చింది. స్టడీ లీవు తీసుకున్న కొంతమంది అధికారుల ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో తాజాగా ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
Updated Date - 2023-06-14T05:26:21+05:30 IST