Sadashiva Commission: సదాశివ కమిషన్ నివేదిక అమలు వద్దే వద్దు
ABN, First Publish Date - 2023-01-11T10:30:10+05:30
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డు న్యాయమూర్తి సదాశివ కమిషన్(Sadashiva Commission) సమర్పించిన
- నగరంలో డీఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- గంటలకొద్దీ స్తంభించిన ట్రాఫిక్
బెంగళూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డు న్యాయమూర్తి సదాశివ కమిషన్(Sadashiva Commission) సమర్పించిన నివేదికను తిరస్కరించాలని దళిత సంఘర్ష సమితితోపాటు పలు కులసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక రిజర్వేషన్ సంరక్షణ సమాఖ్య పేరిట మెజస్టిక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఫ్రీడంపార్కు వరకు చేరుకుంది. దీంతో గంటలకొద్దీ మెజస్టిక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రప్రభుత్వానికి ఈ నివేదికను సిఫారసు చేయరాదని ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద లింబావళి డిమాండ్ చేశారు. సదాశివ కమిషన్ నివేదిక అశాస్త్రీయంగా ఉందన్నారు. హడావుడిగా నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారని, దీన్ని ఆమోదించే విషయంలోనూ, కేంద్రానికి సిఫారసు చేసే అంశంలోనూ రాష్ట్రప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలన్నారు. తాము అధికారంలోకి వస్తే సదాశివ కమిషన్ నివేదికను అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేతల ప్రకటనపై స్పందించిన ఆయన రానున్న ఎన్నికల్లో దీని పర్యవసానం ఎదుర్కొనక తప్పదని కాంగ్రె్‌సను హెచ్చరించారు. సదాశివకమిషన్ సిఫారసులు అమలైతే దళితులైన బోవి, బంజార, కొరమ, చలవాది, సంచార జాతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో బోవి గురుపీఠానికి చెందిన ఇమ్మడి సిద్దరామేశ్వర స్వామిజీ, కర్ణాటక చెన్నదాసరు, హొలెయదాసరు, మాలదాసరు సంఘాలకు చెందిన వేలాదిమంది రాష్ట్రం నలుమూలల నుంచి సదాశివ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
Updated Date - 2023-01-11T10:30:12+05:30 IST