Ramdas: ఈరోడ్ ఉప ఎన్నికకు పీఎంకే దూరం!
ABN, First Publish Date - 2023-01-22T10:20:47+05:30
ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేయడం లేదని, అదే సమయంలో ఏ పార్టీకి మద్దతు ప్రకటించబోమని పీఎంకే అధ్యక్షుడు
- అన్బుమణి రాందాస్ ప్రకటన
పెరంబూర్(చెన్నై), జనవరి 21: ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేయడం లేదని, అదే సమయంలో ఏ పార్టీకి మద్దతు ప్రకటించబోమని పీఎంకే అధ్యక్షుడు డా. అన్బుమణి రాందాస్(Dr. Anbumani Ramdas) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికలతో డబ్బు, సమయం వృథా అని, శాసనసభ ఎన్నికల్లో గెలిచిన పారీకే ఈ సీటును కేటాయించాలని తమ పార్టీ అభిప్రాయపడుతుందన్నారు. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా అనారోగ్యంతో మృతిచెందడంతో ఈ ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.అధికార డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రె్‌సకే మళ్ళీ సీటును కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని డీఎంకే మిత్రపక్షాలన్నీ స్వాగతించాయి. ఇక, గతంలో ఆ నియోజకవర్గంలో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీచేసిన తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) మళ్లీ పోటీచేస్తుందని అందరూ భావించారు. చివరకు టీఎంసీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీనితో ఆ నియోజకవర్గంలో అన్నాడీఎంకే పోటీ చేయనుంది.
కూటమి నుంచి వైదొలిగినట్టేనా?
అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే వైదొలిగినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో 23 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం అన్నాడీఎంకే నెలకొన్న ఏకనాయకత్వ పోరు తీవ్రస్థాయికి చేరుకోవడంతో కొంతకాలంగా పీఎంకే మౌనంగా ఉంటోంది. అలాగే, ఇటీవల కాలంలో ఇరుపార్టీలకు చెందిన పరస్పర ఆరోపణలకు పాల్పడి ప్రకటనలు జారీచేశారు. ఈ నేపథ్యంలో, ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తాము పోటీచేయం, ఎవరికీ మద్దతు ఇవ్వం అని పీఎంకే తేల్చి చెప్పింది. అదే సమయంలో ఉప ఎన్నికల్లో పోటీచేసి సత్తాచాటి, రాబోయే పార్లమెంటు ఎన్నికలకు తమతో పాటు కూటమి పార్టీలను సిద్ధం చేయాలనే అన్నాడీఎంకే ఆశలు అడియాశలుగా మారాయి. అలాగే, అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే వైదొలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-01-22T10:20:48+05:30 IST