Rajinikanth: సన్యాసులకు పాదాభివందనం.. నా అలవాటు
ABN, First Publish Date - 2023-08-22T02:50:47+05:30
వయసులో తనకంటే చిన్నవాడైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేయడంపై రజనీకాంత్ స్పందించారు.
అందుకే యోగి ఆదిత్యనాథ్ కూ చేశా: రజనీ
చెన్నై, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వయసులో తనకంటే చిన్నవాడైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేయడంపై రజనీకాంత్ స్పందించారు. సన్యాసులు, యోగులు మనకంటే వయసులో చిన్నవారైనప్పటికీ వారికి పాదాభివందనం చేయడం తనకు అలవాటని చెప్పారు. ఉత్తర భారత ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి తిరిగి చెన్నైకి చేరుకున్న రజనీ.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తాను నటించిన ‘జైలర్’ చిత్రానికి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన అభిమానులకు, తనను పెంచి పోషిస్తున్న తమిళ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కళానిధి మారన్, ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలచిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్లకూ ధన్యవాదాలు తెలిపారు. యోగి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లను కలవడంలో రాజకీయం లేదని, స్నేహ పూర్వకంగానే కలిశానని చెప్పారు. రాజకీయాల గురించి విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్స్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Updated Date - 2023-08-22T02:50:47+05:30 IST