India-Bharat Row: 'ఇండియా' కూటమి పేరు భారత్‌గా మారిస్తే.. మీరేం చేస్తారు?: కేజ్రీవాల్ సూటిప్రశ్న
ABN, First Publish Date - 2023-09-05T18:37:49+05:30
ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. విపక్ష కూటమి పేరు ఇండియాను భారత్‌గా మార్చుకుంటే వాళ్లు కూడా భారత్ పేరును బీజేపీ అని మార్చుకుంటారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: జీ-20 సదస్సుకు హాజరయ్యే విదేశీ అతిథులకు రాష్ట్రపతి కార్యాలయం పంపిన ఆహ్వాన పత్రంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని పేర్కొనడానికి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ఉండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 28 పార్టీల విపక్ష పార్టీల కూటమి పేరు ఇండియా (I.N.D.I.A.) కావడంతో దేశం పేరు మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ఇండియా అనే పేరు బ్రిటిష్ కాలంనాటి బానిసత్వానికి ప్రతీక అని, భారత్ అని పేర్కొనడమే సరైనదని అధికార పక్ష నేతలు అంటున్నారు. ఈ పేరు మార్పు వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
''పేరు మార్పు జరిగినట్టు నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. విపక్ష పార్టీలన్నీ కలిసి 'ఇండియా' కూటమి అని పెట్టుకున్నందున దేశం మేరును కేంద్రం మార్చి ఉండవచ్చని అనుకోవచ్చా? ఈ దేశం 140 కోట్ల ప్రజలది, ఏ ఒక్క పార్టీదో కాదు'' అని కేజ్రీవాల్ అన్నారు. విపక్ష కూటమి పేరు (I.N.D.I.A.)ను భారత్‌గా మార్చుకుంటే వాళ్లు కూడా భారత్ పేరును బీజేపీ అని మార్చుకుంటారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ పార్టీ సహచరుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సైతం ఆసక్తికరంగా ఇదే తరహాలో ప్రశ్నించారు. మన జాతీయ గుర్తింపు బీజేపీ వ్యక్తిగత ఆస్తి కాదని, అది తమ ఊహలకు అనుగుణంగా మార్చదగినది కాదని అన్నారు. ఈ దేశం 135 కోట్ల మంది ప్రజలదని చెప్పారు.
Updated Date - 2023-09-05T18:37:49+05:30 IST