Marriage Age: సమాన వివాహ వయసుపై పిటిషన్ కొట్టివేత
ABN, First Publish Date - 2023-02-21T03:45:52+05:30
స్త్రీ, పురుషులకు సమాన వివాహ వయసు ఉండేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను స్వీకరించడానికి సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది.
చట్టాలు చేయడం మా పనికాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: స్త్రీ, పురుషులకు సమాన వివాహ వయసు ఉండేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను స్వీకరించడానికి సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. వివాహానికి ప్రస్తుతం మహిళలకు కనీస వయసు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లుగా ఉంది. ఇది వివక్ష పూరితమని, మత, ఇతరత్రా భేదభావాలు లేకుండా అందరికీ ఒకే తరహా వివాహ వయసును నిర్ధారించాలని న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు. దీంతో పాటు ఇదే విషయమై ఢిల్లీ, రాజస్థాన్ హైకోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలను కూడా సుప్రీంకోర్టు తనకు బదిలీ చేయించుకొంది. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఇది తమ పరిధిలోకి రాదని, అందువల్ల ఈ విషయమై చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించలేమంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ చేసిన వ్యాఖ్య ధర్మాసనానికి చికాకు కలిగించింది. తన పిటిషన్ హైకోర్టు నుంచి వచ్చినందున అక్కడికే వెళ్తానని అన్నారు. ‘‘మీ పొగడ్తలేమీ మాకు అవసరం లేదు. మిమ్మల్నో, ఓ వర్గాన్నో సంతృప్తి పరచడానికి మేమిక్కడ లేం. చట్టాలు చేయడం మా పని కాదు’’ అని వ్యాఖ్యానించింది.
Updated Date - 2023-02-21T03:45:52+05:30 IST