తుపాకీతో కాల్చుకుని డీఐజీ ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-07-08T01:37:31+05:30
కుంగుబాటుకు గురైన పోలీస్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
● తమిళనాడు కోయంబత్తూరులో ఘటన
చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కుంగుబాటుకు గురైన పోలీస్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు సర్కిల్‌లో డీఐజీగా పనిచేస్తున్న సీ విజయ్‌కుమార్ (45) శుక్రవారం ఉదయం 5:30 గంటలకు కొద్దిసేపు వాకింగ్ చేశారు. అనంతరం తన సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న రివాల్వర్ తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత లోపలి నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించింది. సెక్యూరిటీ గార్డులు లోనికెళ్లి చూడగా... డీఐజీ విగత జీవిగా పడి ఉన్నారు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. చేతిలో తుపాకీ ఉంది. తుపాకీ శబ్ధం విని ఉలిక్కిపడి లేచిన డీఐజీ భార్య.. హడావుడిగా అక్కడకు వచ్చారు. అప్పటికే విజయకుమార్ మృతిచెందారు. డీఐజీ మృతి పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. విజయకుమార్ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, విజయ్‌కుమార్ కొన్ని రోజులుగా కుంగుబాటు (డిప్రెషన్)కు చికిత్స తీసుకుంటున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
Updated Date - 2023-07-08T01:37:31+05:30 IST