ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court Telugu judge : సుప్రీంకు మరో తెలుగు జడ్జి

ABN, First Publish Date - 2023-02-05T03:40:24+05:30

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మరో తెలుగు జడ్జి నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌, మరో నలుగురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ సర్వోన్నత కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నియామకం

మరో నలుగురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదం.. న్యాయమంత్రి రిజిజు ట్వీట్‌

జస్టిస్‌ సంజయ్‌.. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ పి.రామచంద్రారెడ్డి కుమారుడు

ప్రస్తుతం మణిపూర్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు

రేపు ప్రమాణ స్వీకారం.. సుప్రీంలో రెండుకు చేరిన తెలుగు జడ్జిల సంఖ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మరో తెలుగు జడ్జి నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌, మరో నలుగురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టులో తెలుగు జడ్జిల సంఖ్య రెండుకు చేరుకుంది. కాగా, తాజా నియామకాలతో గత ఏడాది డిసెంబరు 13న కొలీజియం సిఫారసు చేసిన అన్ని పేర్లను కేంద్రం ఆమోదించినట్లయింది. జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌ ప్రస్తుతం మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌(రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌(పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్‌ అసనుద్దీన్‌ అనాముల్లా(పట్నా హైకోర్టు జడ్జి), జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా(అలహాబాద్‌ హైకోర్టు జడ్జి) సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరంతా సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వారితో ప్రమాణం చేయిస్తారు. దీంతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 32కు పెరగనుంది. ఇక సుప్రీంలో ఉండే జడ్జిల ఖాళీల సంఖ్య రెండుకు తగ్గనుంది. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. ఆయన కుటుంబం అనేక సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడింది. 1963 ఆగస్టు 14న జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ జన్మించారు.

ఆయన తండ్రిపి.రామచంద్రా రెడ్డి 1969-82 మధ్యకాలంలో ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లో అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. నిజాం కాలేజీలో కామర్స్‌ చదువుకున్న జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌.. 1988లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. తన తండ్రి కార్యాలయంలోనే న్యాయవాదిగా చేరారు. ఉమ్మడి ఏపీ హైకోర్టుతో పాటు వివిధ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌), హైదరాబాద్‌ పట్టణ భూ సీలింగ్‌ ప్రత్యేక అధికారి తరఫున హైకోర్టులో వాదించారు. 2000-03 వరకు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2008లో ఉమ్మడి ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 అక్టోబరు 10న పంజాబ్‌-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 14 నుంచి మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన నియామకంతో సుప్రీం కోర్టులో తెలుగు న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరింది. సుప్రీంలో ఉన్న మరో తెలుగు జడ్జి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ.

మమ్మల్ని బెదిరించలేదు: రిజిజు

న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం చేస్తున్న సిఫార్సులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుండడం ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. ఈ జాప్యాన్ని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎ్‌స.ఓకాల ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ‘‘మేము ఒక వైఖరిని తీసుకునే అవకాశం ఇవ్వొద్దు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. శనివారం ప్రయాగరాజ్‌లో జరిగిన అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తమను బెదిరించలేదన్నారు. ‘‘ప్రజలే మాకు యజమానులు. మార్గదర్శిలా వ్యవహరించేందుకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం చేసే మార్గదర్శనం, ప్రజల ఇష్టం మేరకు దేశంలో పాలన సాగుతుంది. ఎవరూ ఎవరికి హెచ్చరికలు ఇవ్వలేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-05T03:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising