70 years: ఫలించిన 70 ఏళ్ల నిరీక్షణ
ABN, First Publish Date - 2023-01-31T09:18:33+05:30
ఏడు దశాబ్ధాల చిరకాల వాంఛ నెరవేరిన తరుణంలో ఆ గ్రామంలోని దళిత కుటుంబాలన్నీ ఆనందంతో పరవశిస్తున్నాయి.
- ముత్తుమారియమ్మన్ ఆలయ ప్రవేశం
- పరవశించిన దళితులు
పెరంబూర్(చెన్నై), జనవరి 30: ఏడు దశాబ్ధాల చిరకాల వాంఛ నెరవేరిన తరుణంలో ఆ గ్రామంలోని దళిత కుటుంబాలన్నీ ఆనందంతో పరవశిస్తున్నాయి. తిరువణ్ణామలై జిల్లా తెన్‌ముడియనూర్ గ్రామంలోని ప్రాచీన ముత్తుమారియమ్మన్ ఆలయాన్ని కలెక్టర్, ఎస్పీ(Collector, SP) సమక్షంలో సోమవారం దర్శనం చేసుకున్న దళితులు, 70 ఏళ్ల కోరిక నెరవేర్చుకున్నారు. ఈ ఆలయంలోకి దళితులు ప్రవేశించి పూజలు చేసేందుకు కొన్ని వర్గాలు అభ్యంతరం తెలిపాయి. పండుగ, విశేష రోజుల్లో జరిగే పూజలకు సైతం వీరిని అనుమతించడం లేదు. తమకు కూడా ఆలయంలోకి అనుమతించి స్వామివారిని దర్శించి పొంగళ్లు పెట్టేందుకు అవకాశమివ్వాలని దళితులు కోరుతున్నా, అగ్రవర్ణాలు వారిని ఆలయ దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. దళితులకు అండగా వామపక్షాలు, డీపీఐ, ప్రజా సంఘాలు పులు పోరాటాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆలయంలో ప్రారంభమైన తైపూస ఉత్సవాల్లో ఒకరోజు తమను అనుమతించేలా చర్యలు చేపట్టాలని దళితులు జిల్లా కలెక్టర్ మురుగేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ ఉత్తర్వులతో తహసీల్దార్ మందాకిని నేతృత్వంలో అధికారులు గ్రామంలోని అన్ని వర్గాలతో చర్చించారు. హిందూ దేవాదాయ శాఖ ఆధీనంలోని ఈ ఆలయంలో జాతి, మత బేధం లేకుండా అందరినీ అనుమతించాలని, అడ్డుకున్న వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అధికారులు చర్చలు జరిపినా దళితుల ఆలయ ప్రవేశానికి కొందరు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో, మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అంటరానితనం నిర్మూలన ప్రతిజ్ఞకు న్యాయం చేకూర్చేలా దళితులను సోమవారం ఆలయ ప్రవేశం చేయించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. దీంతో, శనివారం రాత్రి నుంచే గ్రామానికి పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. సోమవారం ఉదయం వేలూరు డీఐజీ ముత్తుస్వామి, కలెక్టర్ పి.మురుగేష్, జిల్లా ఎస్పీలు కార్తికేయన్ (తిరువణ్ణామలై), బాలకృష్ణన్ (తిరుపత్తూర్), హిందూ దేవాదాయ శాఖ మండల జాయింట్ కమిషనర్ అశోక్‌కుమార్, తహసీల్దార్ మందాకిని నేతృత్వంలో దళితులు పూజా సామగ్రి తీసుకొని తమ ప్రాంతం నుంచి ఊరేగింపుగా ఆలయంలో ప్రవేశించి, పూజలు చేసి పొంగళ్లు పెట్టారు.
హద్దుమీరితే కఠినచర్యలు...
ఈ విషయమై కలెక్టర్ మురుగేష్ మాట్లాడుతూ, తెన్‌ముడియూర్‌లో ప్రాచీన ముత్తుమారియమ్మన్ ఆలయ 15 రోజులు నిర్వహించే పొంగల్ వేడుకల్లో ప్రతిరోజు వేర్వేరు వర్గాలకు చెందిన వారు పొంగళ్లు పెట్టి స్వామివారికి పూజలు చేయడం జరుగుతుందన్నారు. కానీ, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతించడం లేదనే దళితుల విజ్ఞప్తితో వారి దీర్ఘకాలిక కోర్కె తీర్చామన్నారు. రాజ్యాంగ శాసనసంలో అందరూ సమానమేనని, జాతి, మత బేధాలు లేకుండా అందరూ కలసి మెలిసి ఉండాలన్నారు. కులవివక్షకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు.
Updated Date - 2023-01-31T09:18:35+05:30 IST