కూలిన 2 యుద్ధ విమానాలు
ABN, First Publish Date - 2023-01-29T02:40:47+05:30
భారత వాయుసేన (ఐఏఎ్‌ఫ)కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోయాయి. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలి
- మధ్యప్రదేశ్‌లో ఘటన.. పైలట్ మృతి.. మరో ఇద్దరు పైలట్లు సురక్షితం
భోపాల్/జైపూర్, జనవరి 28: భారత వాయుసేన (ఐఏఎ్‌ఫ)కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోయాయి. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి శిక్షణలో భాగంగా బయలుదేరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు మోరైనా సమీపంలో కూలిపోయాయి. సుఖోయ్ విమానంలో ఇద్దరు, మిరాజ్‌లో ఒకరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సుఖోయ్‌లోని పైలట్లు ఇద్దరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారని, వారిని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా ఆస్పత్రికి తరలించామని వాయుసేన ట్విటర్‌లో వెల్లడించింది. మిరాజ్‌లో ఉన్న పైలట్-- వింగ్ కమాండర్ హన్మంత్‌రావ్ సారథి చనిపోయారని రక్షణశాఖ వర్గాలు ప్రకటించాయి. వింగ్ కమాండర్ మృతదేహాన్ని పహర్‌గఢ్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. కూలిపోయిన రెండు విమానాల నుంచి డేటారికార్డన్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించాయి. మోరైనా అటవీ ప్రాంతంలోని మహాదేవ్ ఆలయ సమీపంలో గాల్లో ఓ విమానానికి మంటలు అంటుకుని కాలిపోతూ.. కూలిపోయిందని ఈశ్వర్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ రెండు విమానాల ప్రమాదాలకు కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని కూలాయా? అనే కోణంపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని వివరించాయి. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. కాగా.. మోరైనాలో ప్రమాదానికి గురైన మిరాజ్ విమన శకలాలు కొన్ని రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో పడ్డాయి. మోరైనాకు భరత్‌పూర్‌కు మధ్య 112 కిలోమీటర్ల దూరం ఉంది.
Updated Date - 2023-01-29T02:40:48+05:30 IST