NASA: చరిత్ర సృష్టించిన నాసా రోవర్.. అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. లక్ష్యం కంటే రెట్టింపు!
ABN, First Publish Date - 2023-09-08T15:06:46+05:30
ఇతర గ్రహాలపై కూడా మానవ మనుగడ సాధ్యమవుతుందా? భూమిపై ఉన్న సహజ వనరులు ఇతర గ్రహాల్లోనూ ఉన్నాయా? కనీసం ఉత్పత్తి చేయడానికైనా వీలవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం...
ఇతర గ్రహాలపై కూడా మానవ మనుగడ సాధ్యమవుతుందా? భూమిపై ఉన్న సహజ వనరులు ఇతర గ్రహాల్లోనూ ఉన్నాయా? కనీసం ఉత్పత్తి చేయడానికైనా వీలవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కోసం అంతరిక్ష సంస్థలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇప్పుడు తాజాగా నాసా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతం అయ్యింది. అంగారకుడు గ్రహంపై ప్రాణవాయువు (ఆక్సిజన్)ను ఉత్పత్తి చేసేందుకు గాను చేపట్టిన ఒక మిషన్ సక్సెస్ అయినట్లు నాసా వెల్లడించింది. పర్స్‌వరెన్స్ రోవర్‌లోని మాక్సీ అనే పరికరం ఆ గ్రహంపై ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేసిందని బుధవారం ప్రకటించింది.
అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం సాధ్యమా? కాదా? అనే విషయంపై ప్రయోగం చేసేందుకు గాను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2021లో పర్స్‌వర్సెన్ రోవర్‌లో మాక్సీ (మార్స్ ఆక్సిజన్ ఇన్-ఎస్ఐటీయూ రిసోర్స్ యూటిలైజేషన్) అనే పరికరాన్ని అమర్చి ఆ గ్రహంపైకి పంపింది. అక్కడ ల్యాండ్ అయినప్పటి నుంచి తన ప్రయోగం ప్రారంభించిన మాక్సీ.. ఆ గ్రహంపై ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని, 122 గ్రాముల ఆక్సిజన్‌ని విడుదల చేసినట్టు తాజాగా నాసా తెలిపింది. ఈ ఆక్సిజన్‌ను పరీక్షించగా.. అది 98 శాతం స్వచ్ఛమైనదిగా తేలిందని నాసా వెల్లడించింది. తాము నిర్దేశించిన లక్ష్యం కంటే ఇది రెట్టింపు ఫలితాల్ని రాబట్టిందని.. ఈ ఆక్సీజన్ ఇంధనం, శ్వాస ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. మాక్సీ అద్భుతమైన పనితీరు కనబర్చిందని.. అక్కడి వాతావరణంలో ఇది ఒక్కొక్క కార్బన్ అణువుని తీసుకొని ఆక్సిజన్‌ని విజయవంతంగా ఉత్పత్తి చేస్తోందని చెప్పుకొచ్చింది.
ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో.. నాసా సంస్థ ట్విటర్ మాధ్యమంగా తన ఆనందాన్ని పంచుకుంది. భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవ అన్వేషణలకు ఇది దోహదపడుతుందని నాసా చెప్పింది. ఆ గ్రహం ఉపరితలంపై లభ్యమయ్యే మెటీరియల్స్ సహాయంతో మానవుడు జీవించేందుకు వీలుగా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నాసా తెలిపింది. ఇక తదుపరి దశలో భాగంగా.. మాక్సీ లాంటి ఆక్సిజన్ జనరేటర్, ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు గాను మరో ప్రయోగాన్ని చేపడుతున్నట్టు నాసా వెల్లడించింది. అంగారక గ్రహంపై ఇతర సాంకేతికతలను ధృవీకరించడంపై కూడా దృష్టి సారించినట్లు ఈ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.
Updated Date - 2023-09-08T15:06:46+05:30 IST