అనవసరమైన దీర్ఘాలు ఎందుకు?
ABN, First Publish Date - 2023-02-27T01:53:16+05:30
మాట్లాడింది మాట్లాడినట్టు ధ్వనులను యథా తథంగా అక్షరాల్లో పెట్టగలిగిన అవకాశం ఎక్కువగా ఉన్న భాషగా తెలుగు ఇతర భాష లకన్న విశిష్టమైనది. కొన్ని ఇతర భాషా పదాల ధ్వనులను అక్షరీకరించడంలో...
మాట్లాడింది మాట్లాడినట్టు ధ్వనులను యథా తథంగా అక్షరాల్లో పెట్టగలిగిన అవకాశం ఎక్కువగా ఉన్న భాషగా తెలుగు ఇతర భాష లకన్న విశిష్టమైనది. కొన్ని ఇతర భాషా పదాల ధ్వనులను అక్షరీకరించడంలో సమస్య ఉన్నప్పటికీ, దాదాపుగా మానవ కంఠధ్వనులన్నిటికీ అక్షరాలున్న భాష తెలుగు. కొన్ని యూర పియన్ భాషల లాగ ఒకటి రాసి మరొకటి పలకవలసిన అవసరం మనకు దాదాపుగా లేదు. మన భాషా పదాల, లేదా అరువు తెచ్చుకున్న సంస్కృత భాషా పదాల ధ్వనిని అక్షరాలలోకి అనువదించడం వరకూ మనకు సమస్య లేదు. కాని ఇతర భాషా పదాలను తెలుగు అక్షరాల్లో రాస్తున్న ప్పుడు ఆ భాషా వ్యవహర్తల ఉచ్చారణకు తగినట్టుగా కచ్చి తంగా రాస్తున్నామా, అనవసరమైన వర్ణాలు రాస్తున్నామా, ఆ భాషా పదాల ధ్వనులను యథాతథంగా పాటిస్తున్నామా అనే సమస్యల గురించి ఆలోచిస్తే చిత్రమైన సందర్భాలు కనబడతాయి.
చాలమంది తెలుగువాళ్లు, పండితులు, మేధావులు, విద్యా వంతులతో సహా, ఇతర భాషల పదాలను ఆయా భాషా వ్యవహర్తల ఉచ్చారణ కన్న భిన్నంగా రాస్తున్నారు. నిజానికి ఏ భాషా పదానికైనా ఆ భాషల నిఘంటువులలో ఫొనెటిక్స్ రూపంలో ఉచ్చారణ సూచనలుంటాయి. లేదా, ఆ భాష మాతృభాష అయినవారినుంచి ఆ ఉచ్చారణ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ యుగంలో ఏ భాషా పదానికైనా ఉచ్చారణ ఏమిటో ధ్వని రూపంలోనే తెలుసుకునే అదనపు సాంకేతిక అవకాశం కూడా వచ్చింది. కాని ఇప్పటికీ తెలుగులో పర భాషా పదాల వర్ణక్రమం పొరపాట్లతోనే ఉంటున్నది.
పరభాషా పదాలను ఎక్కువగా ఇంగ్లిష్ వర్ణక్రమం ద్వారానే తెలుసుకుంటున్నాం గనుక ఇంగ్లిష్ ధ్వనులకూ అక్షరాలకూ ఉండే వ్యత్యాసం మన రాతలో యథాతథంగా రావడం ఒక ప్రధాన సమస్య. దీనికి అత్యంత ప్రాథమికమైన, సాధారణ మైన ఉదాహరణ చెప్పుకోవాలంటే ఉచ్చారణ ప్రకారం ఇంగ్లిష్, బ్రిటిష్ అని రాయవలసిన పదాలను తెలుగులో ఇంగ్లీష్ (లేదా ఇంగ్లీషు), బ్రిటీష్ (బ్రిటీషు) అని మధ్య అక్షరానికి అనవసర మైన, లేని దీర్ఘం తగిలించడం ఆధునిక తెలుగు సాహిత్యం, పత్రికా భాష మొత్తంలోనూ వంశ పారంపర్యంగా సాగిపోతున్నది. హలం తాలుగా ఉన్న పదాలను అజంతా లుగా మార్చుకోవడం భాషా సంప్ర దాయం ప్రకారం అంగీకారయోగ్యమే కావచ్చు. కాని పదం మధ్యలోని అక్షరాలను మార్చడం ఎందుకు?
బహుశా దీనికి మూలం ఉచ్చా రణ-అక్షరీకరణలో ఇంగ్లిష్‌కూ తెలు గుకూ ఉన్న తేడా కావచ్చు. ఇంగ్లిష్ భాషలో అచ్చు ధ్వనులన్నిటినీ రాయ డానికీ ఐదు అక్షరాలు మాత్రమే ఉండగా, తెలుగులో మనకు పన్నెండు అచ్చులు ఉన్నాయి. ఐదు అచ్చు ధ్వనులకు హ్రస్వమూ దీర్ఘమూ ఉన్నాయి, రెండు అచ్చులు కలిసిన ధ్వనికి కూడ అక్షరాలున్నాయి. కనుక ఇంగ్లిష్ పదంలో ఒక అచ్చు ఉప యోగించి ఉంటే అది హ్రస్వంగా పలకాలా, దీర్ఘంగా పలకాలా మనకు సమస్య వస్తుంది. ఆ భాషా వ్యవహర్తల ఉచ్చారణ వింటే తప్ప లేదా డిక్షనరీలో ఫొనెటిక్స్ చూస్తే తప్ప తేల్చు కోలేం. అందువల్ల ఇంగ్లిష్ అనే మాటలో మధ్యలో ఉన్న ‘ఐ’ అనే అచ్చును ‘ఇ’ (గుడి)గా పలకాలా, ‘ఈ’ (గుడిదీర్ఘం)గా పలకాలా అనే సందేహం రావచ్చు. చాల తొలిరోజుల్లో, బహుశా రెండు మూడు వందల ఏళ్ల కింద పొరపాటున దాన్ని దీర్ఘంగా రాసి ఉండవచ్చు. ఫొనెటిక్ ఉచ్చారణను సూచించే ప్రామాణిక నిఘంటువులు వచ్చిన తర్వాతనైనా ఆ తప్పు సవరించుకుని ఉండవలసింది. ఆ తర్వాత ఇంగ్లిష్ విద్యా శిక్షణల క్రమంలోనో, అంతర్జాతీయ సంబంధాలు పెరిగి ఇంగ్లిష్ భాషా వ్యవహర్తలతో సంపర్కం పెరిగిన తర్వాతనో, ఇంటర్నెట్ మీద ఉచ్చారణ వినే అవకాశం వచ్చిన తర్వాతనో ఆయా కాలాల్లో దాన్ని సవరించుకుని ఉండవలసింది. కాని ఆ పని జరగలేదు.
అంతకన్న విచిత్రమైన స్థితి ‘బ్రిటిష్’ అనే మాటది. ఇందులో మొదటి అక్షరంలోనూ, రెండో అక్షరంలోనూ ఇంగ్లిష్ అచ్చు ‘ఐ’ ఉంది. అటువంటి ఒకే పదంలోని ఒకే రకమైన అచ్చును తెలుగులో రాస్తున్న ప్పుడు మొదటిదాన్ని హ్రస్వంగా, రెండోదాన్ని దీర్ఘంగా రాయాలని అనిపించిన మొదటివారు ఎవరో, అదే ఎట్లా విస్తృత ప్రచారంలోకి వచ్చి, ఇవాళ ‘బ్రిటీష్’ అనేదే రూఢ్యంగా మారిపో యిందో చరిత్ర తవ్వి తీయవలసిందే.
అలాగే ‘ఫొటో’లో హ్రస్వంగా ఉండవలసిన ‘ఫొ’ను ‘ఫో’ అని దీర్ఘం చేయడం, కమిషన్‌లో హ్రస్వపు ‘మి’ రాయ వలసిన చోట ‘మీ’ అనే దీర్ఘం రాయడం వంటి పొరపాటు అచ్చు అక్షరక్రమాలు కొన్నిడజన్ల పదాల విషయంలో యథా విధిగా జరిగిపోతున్నాయి. పరభాషా పదాన్ని మన అక్షరాల్లో రాసేటప్పుడు దాని ఉచ్చారణ ఏమిటో ఒక్కసారి నిఘం టువులో ఫొనెటిక్స్‌లో చూస్తే ఈ సమస్య ఉండదు.
ఇదంతా అచ్చుల హ్రస్వ దీర్ఘాల సమస్య మాత్రమే కాదు, హల్లుల సమస్య కూడ. ఇంగ్లిష్ లోనే చూస్తే ఒక్క ‘డి’ తోనే మన డ, ఢ, ద, ధ ధ్వనులు, ఒక్క ‘టి’ తోనే ట, ఠ, ద, ధ ధ్వనులు రాయవలసి వస్తుంది. పక్కన ‘ఎచ్’ కలిపి మహా ప్రాణం చేయడానికి ప్రయత్నిస్తున్నాం గాని ప్రామాణిక వినియోగం ఇంకా కుదరలేదు. అలాగే, ఇంగ్లిష్‌లో, ఇతర యూరపియన్ భాషల్లో హల్లుల రాతకూ ఉచ్చారణకూ తేడా ఉంది. కొన్ని భాషల్లో కొన్ని అక్షరాలు కొన్ని సందర్భాలలో ధ్వనికీ లిపికీ ఊహించలేనంత తేడా సంతరించుకున్నాయి. ‘ఆక్సెస్’, ‘ఆక్సెప్’్ట అనే అందరికీ తెలిసిన ఇంగ్లిష్ మాటలో పక్కపక్కనే ఉన్న రెండు ‘సి’లలో ఒకటి ‘క’గానూ, మరొకటి ‘స’ గానూ పలుకుతాయి. ఇవి ఎక్కువగా వాడకంలో చారిత్రికంగా రూపొందినవే గనుక, సూత్రబద్ధమైన వివరణ ఏమీ లేదు గనుక, ఆ భాషా వ్యవహర్తల ఉచ్చారణ వినడం, ఫొనెటిక్స్ తెలుసుకోవడం, ఇంటర్నెట్‌లో వినడం తప్ప సవరించుకోవడానికి మరొక మార్గం లేదు.
భాషలోని సాధారణ పదాలు అలా ఉంచి, నామవాచకాలను తప్పుగా రాయడం మరింత పెద్ద సమస్య. భావనల పేర్లు, వస్తువులు పేర్లు ఎంత తారుమారు చేసినా అవి వచ్చి పోట్లాడవు. కాని మనుషుల పేర్లు వారి వారి సొంతం. పేర్లు ఆయా సంస్కృతుల చారిత్రక సంప్రదాయంలో రూపొంది ఉంటాయి. ఎవరి పేరునైనా మార్చడానికి, అందులోని అక్షరాలను వంకర టింకర చేసి తమ ఇష్టం వచ్చినట్టు పలకడానికి మరొకరికి హక్కు లేదు.
కాని పరభాషా నామవాచకాలను ఇంగ్లిష్ వర్ణక్రమం ద్వారా నేర్చుకుంటున్న తెలుగువాళ్లం, ఆ ఇంగ్లిష్ వర్ణక్రమాన్నే మన ఉచ్చారణలోకి అనువదించుకుని అలాగే రాస్తున్నాం. ఆయాభాషలలో ఆ వర్ణక్రమంలో కొన్ని వర్ణాల ఉచ్చారణ వేరుగా ఉండడమో, అసలు ఉచ్చరించకపోవడమో కొన్ని సందర్భాలలో జరుగుతుంది గనుక తెలుగులో రాసిన ఆ పేర్లు వాటి సొంతదారులు, ఆ భాషా వ్యవహర్తలు గుర్తు పట్టలేనంతగా మారిపోతున్నాయి. ఉదాహరణకు సాల్వడార్ అలెండీ అని తెలుగులో సుప్రసిద్ధమైన చిలే మాజీ అధ్య క్షుడి పేరు మనం రాసుకుంటున్నట్టుగా పలికితే లాటిన్ అమెరికాలో ఎవరూ గుర్తించలేరు. ఆయన పేరు వాళ్ల ఉచ్చారణలో సల్వదోర్ అయెందె. అలాగే ఆగస్టో పినోచెట్ కాదు, పినోషె. సైమన్ డి బవర్ కాదు, సిమాఁ ద బువా, మారియో వార్గాస్ లోసా కాదు యోసా. విక్టర్ జారా కాదు, యారా. ఒట్టొ రెనె కాస్టిలో కాదు కస్తియో. రోమేన్ రోలాండ్ కాదు రోమా రోలా... అలా వందలాది.
స్థూలమైన కొన్ని సూచనలు చెప్పాలంటే ఫ్రెంచి నామ వాచకాల్లో, అసలు పదాల్లోనే చివరి ఒకటి రెండు అక్షరాలు సాధారణంగా ఉచ్చారణలో లోపిస్తాయి. స్పానిష్ నామవాచ కాల్లో, పదాల్లో పక్కపక్కన రెండు ‘ఎల్’లు వచ్చినప్పుడు అది ‘య’గా పలుకుతుంది. చాల యూరపియన్ భాషల్లో ‘జె’ అనే అక్షరం ‘య’ అని పలుకుతుంది. ఇటువంటి సూత్రాలు చెప్పుకున్నప్పటికీ వీటికి మినహాయింపులు కూడ ఉన్నాయి. ఆయా భాషల్లో కూడ ఇతర భాషలతో సంపర్కం పెరిగిన కొద్దీ రెండు రకాల ఉచ్చారణలను-సాంప్రదాయిక ఉచ్చారణనూ, ఇంగ్లిష్ వర్ణక్రమం ప్రకారం ఉచ్చారణనూ-ఆమోదించే అల వాటు కూడ పెరుగుతున్నది.
అయితే ఇంగ్లిష్ వంటి అక్షర క్రమానికీ, ఉచ్చారణకూ తేడా ఉండే యూరపియన్ భాషల విషయంలో మాత్రమే కాదు, దాదాపు ఉచ్చారణకూ, రాతకూ మనలాగనే దగ్గరి సంబంధం ఉండే భారతీయ భాషల విషయంలో కూడ తెలుగు లిపిలో పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. బహుశా భారతీయ భాషా పదాల మధ్య కూడ వారధిగా ఇంగ్లిష్ ఉండడం వల్ల, ప్రధా నంగా అచ్చుల సమస్య, కొంతవరకు హల్లుల సమస్య తలె త్తుతూ ఉండవచ్చు. ఉదాహరణకు ‘కశ్మీర్’ను ఎంతో కాలంగా మనం ‘కాశ్మీర్’ అని ‘క’కు లేని దీర్ఘం ఇచ్చి రాస్తున్నాం. గణిత శాస్త్రవేత్త, చరిత్రకారుడు దామోదర్ ధర్మానంద్ కోసంబి పేరు పెద్దలెందరో కోశాంబి అని రాయడం వల్ల అదే స్థిరపడిపో యింది. భారతీయ భాషల నామవాచకాలను ఆయా భాషల్లో ఎలా రాస్తారో, లేదా దేవనాగరిలో ఎలా రాస్తారో గమనిస్తే ఈ పొరపాటు దిద్దుకోవచ్చు. అయితే, దేవనాగరి ద్వారా ఇతర భాషా పదాల అక్షరక్రమాన్ని గుర్తిస్తే కొన్ని ప్రమా దాలు కూడ ఉన్నాయి. హిందీలోకూడ దాదాపుగా ప్రతి ధ్వనికీ అక్షరం ఉన్నప్పటికీ, ఇంగ్లిష్ పదాలు దేవనాగరిలో రాసినప్పుడు కొన్నిసార్లు తప్పు అక్షరక్రమాలు రాస్తున్నారు. ఉదాహరణకు, ‘ఎయిర్ ఇండియా’కు ‘ఏఅర్ ఇండియా’, ‘వెజిటేరియన్’కు ‘వ్హెజిటేరియన్’ అని రాస్తారు. హిందీ అచ్చుల్లో తెలుగులో లాగ ‘ఎ’, ‘ఏ’, ‘ఐ’ మూడు కాక ‘ఏ’, ‘ఐ’ (‘ఒ’, ‘ఓ’, ‘ఔ’ మూడు కాక ‘ఓ’, ‘ఔ’) రెండే ఉండడం ఒక సమస్య.
ఇతర భాషా పదాలు, ప్రత్యేకంగా నామవాచకాలు, రాసేటప్పుడు ఆ భాషా వ్యవహర్తలు ఎలా ఉచ్చరిస్తారో అలానే రాసే జాగ్రత్త తీసుకోవాలని కోరడం అసందర్భ మవుతుందా?
ఎన్ వేణుగోపాల్
Updated Date - 2023-02-27T01:53:18+05:30 IST