ఉత్తుంగ తరంగం.. విమానరంగం!
ABN, First Publish Date - 2023-02-18T00:20:08+05:30
‘హవాయీ చెప్పులు వేసుకునే వారూ హవాయీ జహాజ్ (విమానం)లో ప్రయాణం చేసే రోజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వప్నించారు....
‘హవాయీ చెప్పులు వేసుకునే వారూ హవాయీ జహాజ్ (విమానం)లో ప్రయాణం చేసే రోజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వప్నించారు. ఆ స్వప్న సాకారానికై ఆయన కృషి ఫలితంగా ఇవాళ సామాన్యులు విమాన ప్రయాణం చేస్తున్నారు. చిన్న పట్టణాలకూ విమానయాన సదుపాయాలను కల్పించేందుకు ‘ఉడాన్’ పథకాన్ని 2017లో ప్రవేశపెట్టారు. 2026 నాటికి వెయ్యి ‘ఉడాన్’ రూట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు.
మనదేశంలో తొలి అధికారిక కమర్షియల్ ఎయిర్‌మెయిల్ విమానం ఎగిరిన రోజు ఫిబ్రవరి 18, 1911. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (నాటి అలహాబాద్)లో పారిశ్రామిక, వ్యవసాయ ప్రదర్శన సందర్భంగా ప్రయాగ్‌రాజ్–నైని మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో 23 ఏళ్ల ఫ్రెంచ్ పైలట్, హెన్రీ పెకేట్ యమునా నది పైనుంచి ఈ విమానాన్ని నడిపారు. ఇది భారతదేశంలో వాణిజ్య విమానాల ప్రస్థానానికి తొలి అడుగు.
నాటి ఆ ఘట్టానికి 112 ఏళ్లు పూర్తయిన సందర్భంలో నేడు భారతదేశం పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా నిలిచింది. చైనా, అమెరికాల తర్వాత భారత్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. 2014 వరకు భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య ఆరు కోట్లుండగా, 2020లో (కరోనా ముందు వరకు) 14.3 కోట్లకు చేరుకుంది. ఇందులో విదేశీ పర్యాటకుల సంఖ్య 2.3 కోట్ల నుంచి 3.5 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం, కరోనానంతర పరిస్థితుల నుంచి కోలుకుని మళ్లీ పూర్వస్థితికి మన విమాయాన రంగం చేరుకుంటోంది.
విమానయానం ఒక లగ్జరీ, ఒక హోదా, ఒక వర్గానికే పరిమితం అనే రోజుల నుంచి అన్ని వర్గాల ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కారణంగా.. ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో దేశ పౌర విమానయాన రంగంలో ఎన్నో సానుకూల మార్పులు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక రంగం అభివృద్ధి చెందాలంటే దాన్ని కొద్దిమందికి పరిమితం చేసేకంటే.. మెజారిటీ ప్రజలను భాగస్వాములుగా చేసినప్పుడే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఈ ఫార్ములాను మోదీ ప్రభుత్వం పలుమార్లు విజయవంతంగా నిరూపించింది. దేశంలో పౌర విమానయాన రంగం సాధిస్తున్న పురోగతి కూడా ఈ ఫార్ములాకు ఓ ఉదాహరణ.
‘హవాయీ చెప్పులు వేసుకునే వారు కూడా హవాయీ జహాజ్ (విమానం)లో ప్రయాణం చేసే రోజులు తీసుకురావాలి’ అని ప్రధానమంత్రి స్వప్నించి, దాన్ని సాకారం చేసే దిశగా కృషి చేస్తున్న ఫలితంగానే ఇవాళ సామాన్యులు విమాన ప్రయాణం చేస్తున్నారు. తద్వారా మౌలికవసతుల కల్పన జరగడంతోపాటు, ఇంజనీర్లు, టెక్నిషియన్లు, ఎయిర్‌లైన్ స్టాఫ్ మొదలైన వారికి ప్రత్యక్షంగా, మరెందరికో పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతోంది. ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా భారతదేశ మధ్యతరగతిని వాణిజ్య విమానాల్లో ప్రయాణింపజేసేందుకు వివిధ ఆఫర్లను, తక్కువ ధరలకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరింపజేసేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తోంది. దీని కారణంగా భారత విమానయాన రంగం ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లుగా దినదిన ప్రవర్థమానమవుతోంది.
ఇందులో భాగంగా వచ్చిందే ప్రాంతీయ అనుసంధానత పథకం (రీజనల్ కనెక్టివిటీ స్కీమ్) – ఉడాన్ (ఉడే దేశ్ కీ ఆమ్ నాగరిక్). 2017లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా దేశీయ విమానయానాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో రూ.4,500 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దీని ద్వారా మెట్రో నగరాలు కాని ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు, విస్తృతమైన అవకాశాలు ఉన్నప్పటికీ, గుర్తింపునకు నోచుకుని ప్రాంతాల్లో విమానయాన సదుపాయాలను కల్పించేందుకు బాటలు పడ్డాయి.
2026 నాటికి వెయ్యి ‘ఉడాన్’ రూట్లను లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 73 విమానాశ్రయాల్లో దాదాపు 475 ఉడాన్ రూట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఉడాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2.16 లక్షల ఫ్లయింగ్స్ నమోదవగా, 1.14 కోట్ల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఇందుకోసం ఉడాన్ విమానాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) అందజేసింది. ఫలితంగా 2014కు ముందు దేశంలో ఉన్న 74 విమానాశ్రయాల సంఖ్య ఇవాళ 147కు పెరిగింది.
దాదాపు 750విమానాలు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. విమానాలు నడపటం ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్‌ఓ) విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విమానాల ఎంఆర్‌ఓ కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడటం, ఖర్చు తడిసి మోపెడవడం వంటి అంశాలపైనా కేంద్రం దృష్టిసారించింది. భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న విమానాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటూ మన దేశంలోనే ఎంఆర్‌ఓ రంగానికి ప్రోత్సాహాన్ని కల్పించేలా చర్యలు చేపట్టింది. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ఎంఆర్‌ఓ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు నియమ–నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతోపాటు, ఈ రంగంలో ఆటోమేటిక్ రూట్లో 100శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఈ రంగంపై ఉన్న జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించింది. వీటి ద్వారా దేశీయంగా ఎంఆర్‌ఓ రంగం అభివృద్ధి చెంది, మన విమానాలతోపాటు విదేశీ విమానాలకు కూడా మన వద్దే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ చేసేందుకు వీలుంటుంది.
వ్యవసాయ రంగంలోనూ విమాన సేవలను విస్తరించేందుకు కేంద్రం విశేషమైన కృషిచేస్తోంది. ‘కృషి ఉడాన్’ పథకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మరీ ముఖ్యంగా ఈశాన్యప్రాంతాల, గిరిజన ప్రాంతాల రైతుల కష్టానికి సరైన గుర్తింపు దక్కేలా వాటిని అక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
దేశీయంగా విమాన సేవలను అందించడం ఒక ఎత్తయితే ‘నేషనల్ డ్యూటీ’లోనూ భారత విమానయాన రంగం మొదటి వరసలో నిలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులను కాపాడేందుకు కదనరంగంలోకి దూకుతోంది. 2015లో యెమెన్‌లో యుద్ధవాతావరణంలో చిక్కుకుపోయిన భారతీయులను (ఇందులో ఎక్కువగా మన నర్సులు ఉన్నారు), విదేశీయులను కాపాడేందుకు చేపట్టిన ‘మిషన్ రాహత్’ను విజయవంతంగా పూర్తిచేసింది.
కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన 1.83 కోట్ల మంది భారతీయులను కాపాడేందుకు ‘వందేభారత్ మిషన్’ను కూడా అదే స్ఫూర్తితో మన విమానయాన సంస్థలు పూర్తిచేశాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి 22,500 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ గంగ’ను కూడా విజయవంతంగా ఈ సంస్థలు పూర్తిచేశాయి.
సాంకేతికత ప్రగతి, సాంస్కృతిక పునరుజ్జీవనం, సమాజ సాధికారత కలబోతే అసలైన అభివృద్ధికి నిర్వచనంగా భావిస్తూ... మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఘనమైన వారసత్వ కట్టడాలు కేంద్రంగా భారతదేశ పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనూ మన పౌర విమానయాన రంగం ఎంతో తోడ్పాటును అందిస్తోంది. భారతదేశ పర్యాటక శక్తిసామర్థ్యానికి సరైన గుర్తింపును అందించేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలకు విమానాలను నడుపుతూ ఆ ప్రాంతాల్లో దేశ, విదేశీ పర్యాటకులకు ఆ ప్రాంతంలోని సంస్కృతిని, అక్కడి వంటకాలను, అక్కడి సంప్రదాయాలను పరిచయం చేయడంతోపాటు.. అక్కడి ప్రజలకు ఉపాధి కల్పనకు పరోక్షంగా సహకారం అందిస్తోంది. 2021లో కుశీనగర్ (ఉత్తరప్రదేశ్)లో విమానాశ్రయాన్ని ప్రారంభించి అంతర్జాతీయగా బౌద్ధమతస్తులకు ఈ ఎయిర్‌పోర్టును అంకితం చేస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఎలాంటి భేదభావాలు లేకుండా మన వారసత్వ సంపదకు, ఆధునిక వసతులు జోడించినపుడే పర్యాటకులను ఆకర్షించగలమని నాడు ప్రధాని మోదీ చేసిన సూచన ఆధారంగా.. కేంద్ర పర్యాటక శాఖ, అమృత కాలంలో పర్యాటకాభివృద్ధికి ఉడాన్ రూట్లలో 50 పర్యాటక రూట్లను జోడించి వాటికి నిధులు అందిస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో దేశ, విదేశీ పర్యాటకులకు అపూర్వమైన అనుభూతిని అందించేందుకు ‘వికాస్ భీ విరాసత్ భీ’ నినాదంతో మనసా, వాచా, కర్మణా కృషిచేస్తోంది.
జి. కిషన్‌రెడ్డి
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖామాత్యులు
Updated Date - 2023-02-18T00:20:09+05:30 IST