Shoyabullah Khan: సంకెళ్ళు మోస్తున్న మీడియాకు షోయబ్ స్ఫూర్తి
ABN, First Publish Date - 2023-08-22T03:46:43+05:30
పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలు కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ జర్నలిస్టు యోధుడు షోయబుల్లాఖాన్.
పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలు కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ జర్నలిస్టు యోధుడు షోయబుల్లాఖాన్. ఆయన హత్యకు గురయి ఈ ఆగస్టు 22 నాటికి సరిగ్గా 75 ఏండ్లు. మతోన్మాదం దేశమంతటా మరోసారి ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన పోరాటాన్ని, త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన బోధించిన సమభావన స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రభుత్వోద్యోగంలో చేరకుండా ఆదాయం తక్కువైన్నప్పటికీ జర్నలిస్టు వృత్తిని ఎంచుకున్నాడు. జీ హుజూర్ అనకుండా స్వేచ్ఛగా బతకడమే గాకుండా పదిమందిని చైతన్యపరిచేందుకు ఈ రంగమే గొప్పదని తలిచిండు. మొదట ‘తేజ్’ అనే పత్రికలో పనిచేసిండు. అయితే ఆ పత్రిక నిజాం ప్రభుత్వాన్ని, అధికార వర్గాన్ని విమర్శించడంతో దాన్ని నిషేధించారు. ఈ పత్రికలో ఉప సంపాదకుడిగా పదునైన భాషలో, ఘాటైన విమర్శలు, వ్యాసాలు రాసాడు షోయబ్. ఆ తరువాత కాంగ్రెస్ నాయకులు మందుముల నరసింగరావు నడిపిస్తున్న ‘రయ్యత్’ (రైతు) పత్రికలో చేరిండు.
ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఆ పత్రిక కూడా నిషేధానికి గురయింది. దీంతో షోయబ్ సొంతంగానే ‘ఇమ్రోజ్’ (ఉర్దూలో ‘ఈనాడు’) అనే దిన పత్రికను స్థాపించాడు. ఈ పత్రిక మొదటి ప్రతి 1947 నవంబర్ 15న వెలువడింది. హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలంటూ ధైర్యంగా రాసిండు. కాసిమ్ రజ్వీ, ఆయన నేతృత్వం వహిస్తున్న సంస్థ ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ ప్రచారంలో పెట్టే రెచ్చగొట్టే ప్రసంగాలను ఎండగడుతూ వ్యాసాలు, సంపాదకీయాలు, వ్యాఖ్యలు రాసిండు. మత విద్వేషాలకు తావులేదన్నాడు. దీంతో కక్షగట్టిన ఇత్తెహాదుల్ ఉన్మాదులు ఆయన్ని పొట్టన బెట్టుకున్నారు. ఆనాటి పరిస్థితులే ఇవ్వాళ దేశమంతటా కనబడుతున్నాయి.
ఇవ్వాళ పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్‌ల్లో మొత్తం 180 దేశాల్లో ఇండియా 161వ స్థానంలో ఉన్నది. ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ అనే సంస్థ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జర్నలిస్టు రాణా అయూబ్ పోస్టులను ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి ‘ట్విటర్’ సంస్థ తొలగించింది. జర్నలిస్టు రవీష్‌కుమార్, తులసి చందు ఇట్లా వందలాది ప్రశ్నించే వారిని ట్రోలింగ్ చేయడం, కొన్ని చోట్ల భౌతిక దాడులకు గురి చేయడం నిత్యకృత్యమయింది. ఇట్లా మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్న ప్రస్తుత తరుణంలో దేశ ఐక్యత, లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసే, నిజాల్ని వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల హక్కుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడిన హైదరాబాద్ వీరుడు షోయబుల్లా ఖాన్‌ని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాలి.
తనకు ఉపాధి కల్పిస్తున్న ‘రయ్యత్’ పత్రిక మూతపడడంతో ఉపాధి కన్నా, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి సరైన వేదిక లేదే అని షోయబ్ బాధపడ్డాడు. ఈ దశలో చింతాక్రాంతుడైన షోయబ్‌కు ధైర్యం నూరిపోస్తూ మందుముల నరసింగరావు తన ముద్రణా యంత్రాలను వాడుకునేందుకు అవకాశం కల్పించడమే గాకుండా, తన దగ్గరి బంధువు హైదరాబాద్ రాజ్య తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో మాట్లాడి కొంత పెట్టుబడి అందేలా చేసిండు. వీరిచ్చిన ప్రోత్సాహంతో, ధైర్యంతో షోయబ్ 1947లో ‘ఇమ్రోజ్’ పేరిట ఉర్దూ దిన పత్రికను ప్రారంభించాడు. భార్య, తల్లి కూడా తమ నగలమ్మి పత్రిక స్థాపనలో తోడ్పడ్డారు.
‘ఇమ్రోజ్’ తొలి సంచిక 1947 నవంబర్ 15 నాడు వెలువడింది. అప్పటికే హైదరాబాద్ అంతటా ఉద్రిక్త వాతావరణం ఉండింది. ఒక వైపు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. మరోవైపు హైదరాబాద్ అంతటా రజకార్ల దారుణాలు నిత్యకృత్యమైనాయి. మతోన్మాద ప్రకటనలు జోరందుకున్నాయి. ఎర్రకోటపై ‘అసఫ్‌జాహీ’ జెండా ఎగరేస్తామని కాసిమ్ రజ్వీ బీరాలు పలికిండు. మరోవైపు ఆర్యసమాజీయులు కొందరు 1947 డిసెంబర్‌లో నిజాంపై హత్యాయత్నం చేసిండ్రు. ఈ దశలో కాంగ్రెస్ నాయకులెవ్వరూ హైదరాబాద్‌లో లేరు. అందరూ తమ నివాసాన్ని మద్రాసు, విజయవాడ ప్రాంతాలకు మార్చిండ్రు. కొందరు సరిహద్దుల్లో క్యాంపులు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎదిరించిండ్రు. ఇట్లా ఇంటా బయటా నిజాం ప్రభుత్వం సమస్యలను ఎదుర్కొన్నది. హింసాకాండ రోజు రోజుకు పెచ్చరిల్లూతూ ఉండింది. ఈ సంక్షుభిత కాలంలో ప్రారంభమైన ‘ఇమ్రోజ్’ ప్రజల గొంతుకగా మారింది. ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో భాగం కావాలని కూడా సంపాదకీయాలు రాసిండు షోయబ్. అట్లా విలీనం కానట్లయితే అది నిజాం ప్రభువుకు ఆత్మహత్యా సదృశంగా మారుతుందని కూడా హెచ్చరించాడు. అటు ‘రాత్‌కి సర్కార్ – దిన్‌కి సర్కార్’ పేరిట పగలు నిజాం ప్రభుత్వం, రాత్రి కమ్యూనిస్టుల రాజ్యం తెలంగాణ/ హైదరాబాద్ రాజ్యంలో నడుస్తున్నదని విమర్శించిండు.
ఏ మతమౌఢ్యమైనా ప్రజలకు వీసమెత్తు మేలు చేయదని షోయబ్ నమ్మిండు. అందుకే ఇత్తెహాదుల్ సంస్థ, దాని నాయకులు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలను ఎండగడుతూ వ్యాసాలు రాసిండు. బాకర్ అలీ మీర్జా మరికొంత మంది మత సామరస్యాన్ని కాపాడాలని జారీ చేసిన కరపత్రాన్ని ధైర్యంగా పత్రికల్లో ప్రచురించిండు. ఇవన్నీ ఉన్మాదంతో కండ్లు మూసుకుపోయిన మూకను మరింత రెచ్చగొట్టినట్లయింది. రెచ్చిపోయిన మతోన్మాదులు షోయెబుల్లాఖాన్‌ని కాచిగూడా ప్రాంతంలో హతమార్చిండ్రు. హైదరాబాద్‌పై భారత ప్రభుత్వం పోలీసు చర్య పేరిట సైన్యాన్ని పంపి పాలనను తమ అధీనంలోకి తీసుకోవడానికి ఈ సంఘటన ప్రధాన కారణాల్లో ఒకటి.
షోయబ్ మరణం ఒక ఎత్తయితే ఆయన అంతిమయాత్రకు ప్రభుత్వం అనుమతించకపోవడం మరో ఎత్తు. అట్లాగే ఖననం చేయడానికి ఏ మసీదు/ శ్మశాన వాటికా అంగీకరించలేదు. ఇట్లా భారీ బందోబస్తు, భయాందోళనల మధ్యన జరిగిన ఖనన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన దగ్గరి మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. కాచిగూడాలోని ఆయన ఇంటికి దగ్గరలోని మసీదులో గాకుండా గోషామహల్ కుంటకు దగ్గరలోని ముస్లిం శ్మశానంలో ఖననం చేశారు. షోయబ్‌కు భార్య అజ్మలున్నీసా బేగమ్, ఇద్దరు కూతుళ్ళున్నారు. షోయబ్ 1920 అక్టోబర్ 17వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శుబ్రవీడులో జన్మించిండు. తండ్రి హబీబుల్లాఖాన్ ఆ కాలంలో అక్కడ పోలీసు అధికారిగా పనిచేసేవారు.
షోయబ్ హత్య కేసులో హైదరాబాద్ పీనల్ కోడ్ ప్రకారం మొదట కేసు నమోదు చేసినప్పటికీ ‘పోలీసు చర్య’ తర్వాత గానీ దర్యాప్తు ముమ్మరం కాలేదు. ‘ప్రత్యేక కోర్టు’ని ఏర్పాటు చేసి సత్వర న్యాయవిచారణకు అప్పటి హైదరాబాద్ మిలిటరీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కింది కోర్టులో అబ్దుల్ మునీమ్‌ఖాన్‌ని దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ శిక్ష విధించారు. అయితే అతను అప్పీల్ చేసుకోవడంతో మళ్ళీ కేసుని మొదటి నుంచి పునర్విచారించారు. ‘క్రిమినల్ అప్పీల్ నెం. 1403/6 ఆఫ్ 1950, తేది. 17–09–1951. అబ్దుల్ మునీమ్ ఖాన్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్’గా ప్రత్యేక ట్రిబ్యునల్‌లో కేసు విచారణ జరిగింది. దీని ప్రకారం హత్యకు చాలా ముందునుంచే కుట్ర పన్నారనీ కేసు రుజువయింది. కాసిమ్ రజ్వీ, మొయిన్ ఖాన్‌ల తరపున బ్రిటన్‌కు చెందిన లాయర్ డి.ఎ.గ్రాంట్, మొహమ్మద్ దావూద్ ఖాన్ వాదించగా, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వి.రాజారామ్ అయ్యర్ కేసుని వాదించారు. కుట్ర రుజువయినప్పటికీ నిందితులను దోషులుగా నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో ఒక్క మునీమ్ ఖాన్‌కు మాత్రమే యావజ్జీవ శిక్ష పడింది.
షోయబుల్లా ఖాన్ హత్య ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు, పత్రికా స్వేచ్ఛకు పెద్ద విఘాతం. ఆయన చనిపోయి 75 ఏండ్లయిన తర్వాత కూడా ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదాన్ని మీడియా ఎదుర్కొంటున్నది. రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19(1)ఎ లో కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో మనం మరింతగా షోయబుల్లాఖాన్ లాంటి త్యాగధనుల స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి. ఇది సెక్యులర్ శక్తులు ప్రస్తుత మతోన్మాద సందర్భంలో చేయాల్సిన అవసరమైన పని.
ప్రస్తుతం దేశమంతటా రగులుస్తున్న చిచ్చును చల్లార్చాలన్నా, షోయబ్ ఆశయాలు సదా ప్రచారంలో ఉండాలన్నా ఆయన స్మారకంగా ప్రతియేటా ‘హిందూ–ముస్లిం’ ఐక్యతను కాపాడి, పెంపొందించే ఒక ఉత్తమ జర్నలిస్టుకు తెలంగాణ ‘మీడియా అకాడెమి’ తరపున అవార్డు ఇవ్వాల్సిన అవసరమున్నది. అంతేగాదు ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరమున్నది.
షోయబుల్లా ఖాన్ హత్య ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు, పత్రికా స్వేచ్ఛకు పెద్ద విఘాతం. ఆయన చనిపోయి 75 ఏండ్లయిన తర్వాత కూడా ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదాన్ని మీడియా ఎదుర్కొంటున్నది. రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19(1)ఎ లో కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో మనం మరింతగా షోయబుల్లాఖాన్ లాంటి త్యాగధనుల స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి.
-l డా. సంగిశెట్టి శ్రీనివాస్
(షోయబుల్లాఖాన్ హత్యకు గురై నేటికి 75 ఏండ్లు)
Updated Date - 2023-08-22T03:46:43+05:30 IST