ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర ఖాళీలెన్నో పూరించిన ‘శాసనాల శాస్త్రి’!

ABN, First Publish Date - 2023-04-17T03:45:02+05:30

చరిత్ర ఒక నిత్య చెలిమె! తవ్విన కొద్దీ ఊటలా ప్రవహించే జీవ నది! గోండ్వానా ల్యాండ్‌లో భాగంగా ఆదిమానవుడి (Primitive Man) సంచార జ్ఞాపకాల నెలవుగా, ఆ తర్వాత గొప్ప సామ్రాజ్యాలకు ఆలవాలంగా షోడశ మహాజనపదాల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చరిత్ర ఒక నిత్య చెలిమె! తవ్విన కొద్దీ ఊటలా ప్రవహించే జీవ నది! గోండ్వానా ల్యాండ్‌లో భాగంగా ఆదిమానవుడి (Primitive Man) సంచార జ్ఞాపకాల నెలవుగా, ఆ తర్వాత గొప్ప సామ్రాజ్యాలకు ఆలవాలంగా షోడశ మహాజనపదాల కాలంలో, శాతవాహన కాలంలో, కాకతీయ కాలంలో, ఆ తర్వాత వివిధ ముస్లిం రాజుల పాలనా కాలాలలో తెలంగాణ నేల తనదైన ప్రత్యేకతతో భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సాధించింది.

ప్రాచీన, మధ్య యుగాలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడంలో, ఆనాటి కాలపు సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక అంశాలను విశ్లేషించడంలో ఆధారాలుగా నిలుస్తున్నవి శాసనాలే! శాసనాలను అధ్యయనం చేయడం అనేది బహుళ నైపుణ్యాలతో కూడిన విషయం. శాసన పరిశోధనకు చారిత్రక జ్ఞానంతో పాటు, భాషా జ్ఞానం, లిపి పరిణామం వంటి ఎన్నో అంశాలపై గట్టి పట్టు ఉండాలి. కష్టమైన, క్లిష్టమైన శాసన శాస్త్ర అంశాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా చరిత్రని నిర్మించే ప్రక్రియని సుసంపన్నం చేసిన పురాచరిత్ర పరిశోధకుడు, ప్రాతఃస్మరణీయుడు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి.

తెలుగువారి చరిత్రను, తెలంగాణ చరిత్రను వారు చేసిన పరిశోధనలు ఎంతో సుసంపన్నం చేశాయి. తెలుగు నేల మీద విరాజిల్లిన చరిత్రకారులలో ఆదిరాజు వీరభద్రరావు, చిలుకూరి వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు, మల్లంపల్లి సోమ శేఖర శర్మ, నేలటూరి వెంకటరమణయ్య లాంటి మహనీయుల కోవలో నిలిచే శాశ్వత కీర్తిని సాధించిన పరిశోధకులు పరబ్రహ్మ శాస్త్రి గారు! వారు చేసిన పరిశోధనలను లోతుగా పరిశీలించిన తర్వాత- వారి తల్లిదండ్రులు వారికి పెట్టిన పేరు పరంగా పరబ్రహ్మ శాస్త్రే అయినా, వారు చేసిన పనులు, సేవల దృష్ట్యా ‘శాసనాల శాస్త్రి’గా, ‘నాణాల శాస్త్రి’గా, ‘సామాజిక చరిత్ర శాస్త్రి’గా, ‘లిపి శాస్త్రి’గా ఆయనలోని భిన్న కోణాలు నాకు అర్థమయ్యాయి.

పరబ్రహ్మ శాస్త్రి గారు గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, పెద్ద కొండూరు గ్రామంలో 1921 ప్రాంతంలో జన్మించినప్పటికీ 1948లో తెలంగాణ ప్రాంతానికి వచ్చేశారు. 1959లో పురా వస్తు శాఖలో చేరినప్పటి నుంచి మొదలుకొని 1977 మధ్య కాలంలో తెలుగు ప్రాంతాల్లోని వేర్వేరు ప్రదేశాలను సందర్శించి దాదాపు రెండు వేలకు పైగా శాసనాలను సేకరించి, ఆ శాసనాలలోని విశేషాలన్నీ పరిష్కరించి ప్రపంచానికి వెల్లడి చేశారు. బహు భాషలలో పాండిత్యం ఉండటంవల్ల ప్రాకృత శాసనాలని, సంస్కృత, తెలుగు, కన్నడ భాషలలో ఉండే శాసనాలని కూడా చదివి వాటిని పరిష్కరించడమే కాకుండా, చరిత్రకు తెలియని ఎన్నో విషయాలను ఆ శాసనాల ఆధారంగా లోకానికి చాటి చెప్పారు. ఆయన కృషిలో కొన్ని కీలక ఘట్టాలను పరిశీలిస్తే మన చరిత్రను ఆయన పరిపుష్టం చేసిన తీరు అర్థమవుతుంది:

11వ శతాబ్దం నుంచి 1323 వరకు దక్షిణాపథాన్ని పరిపాలించిన కాకతీయ చక్రవర్తులకు సంబంధించిన చాలా విషయాలు పరబ్రహ్మశాస్త్రి కంటే పూర్వం అంతగా వెలుగులోకి రాలేదు. కాకతీయ గణపతి దేవుడు వేయించిన ‘బయ్యారం’, ఇతర శాసనాల ఆధారంగా కాకతీయుల వంశ వృక్షాన్ని ఆధారసహితంగా పరబ్రహ్మశాస్త్రి నిరూపించటంతో కాకతీయ చక్రవర్తుల పాలనాకాలాల గురించిన వివరాలు తొలిసారిగా తెలిసాయి. కాకర్త్య గుండన నుంచి మొదలుకుని ప్రతాపరుద్రుడి వరకు కాకతీయ చక్రవర్తుల వంశ క్రమణికని సాధికారికంగా ప్రకటించడం గొప్ప విశేషం. అలాగే ‘రాయగజకేసరి’ అనే బిరుదు ఏ కాకతీయ చక్రవర్తికి చెంది నది అనే విషయంలో అప్పట్లో చరిత్రకారులలో సందిగ్ధత నెలకొని ఉండేది. పరబ్రహ్మశాస్త్రి శాసన పరిశోధనల ఆధారంగా కాకతీయ మహారాణి రుద్రమదేవికే ‘రాయగజకేసరి’ అనే బిరుదు వుందనే విషయాన్ని నిరూపించారు. చందుపట్ల శాసనాన్ని పరి ష్కరించి రుద్రమదేవి మరణం తన 80వ ఏట 1289లో సంభవించిందని నిర్ధారించ గలిగారు ఇంకా కాకతీయ చక్రవర్తుల వాస్తు శిల్ప రీతులను, దేవాలయ నిర్మాణ శైలి రీతులను, చెరువుల నిర్మాణాన్ని, నగర నిర్మాణాన్ని, కోట నిర్మాణానికి సంబంధించిన వ్యూహాలను పరబ్రహ్మ శాస్త్రి పరిష్కరించి కాకతీయ చరిత్రకు సంపూర్ణతను తెచ్చారు.

శాతవాహన చక్రవర్తుల వంశానుక్రమణికను మొదటిసారిగా పరిష్కరించి సాధికారికంగా వ్యక్తం చేసింది కూడా పరబ్రహ్మ శాస్త్రి గారే! కోటిలింగాలలో లభించిన శాతవాహన కాలపు నాణాలను, ఇతర శాసనాలను ఆధా రంగా చేసుకొని వారు శాతవాహనుల వంశానుక్రమణికని రూపొందించారు.

అలాగే తనకు దొరికిన శాసనాలను పరిష్కరించి వాటన్నిటినీ జిల్లాల వారీగా సంపుటాల్లాగా ప్రచురించి శాసనాలలోని అంతర్గత విశేషాలను ఎన్నింటినో గ్రంధస్థం చేసి భావితరాలకు కరదీపికలుగా అందించారు.

సామాజిక కోణం నుంచి చరిత్రని వ్యాఖ్యానించడమనే అరుదైన ప్రయత్నాన్ని చేసి చరిత్ర రచనలో కొత్త ద్వారాలు తెరిచిన మేధావి - పరబ్రహ్మశాస్త్రి. ఆయన రాసిన ‘ప్రాచీనాంధ్ర గ్రామీణ జీవనం’ అనే గ్రంథం ప్రాచీన కాలంలో తెలుగు నేలపై విలసిల్లిన వివిధ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన శైలి, విధానాలు, సామాజికత ఎలావుందో వివరించింది.

శాసనాల్లో, కావ్యాల్లో, తాళపత్ర గ్రంథాలలో ఉన్న భాషను ఆధారంగా చేసుకొని తెలుగు భాషలో లిపి, పదాలు, అక్షరాలు, వర్ణాలు, ఉచ్చారణ కాలక్రమంలో ఎలాంటి మార్పులు చెందినవో చక్కగా వివరిస్తూ ‘తెలుగు లిపి పరిణామ క్రమం’ అనే పరిశోధనా గ్రంథాన్ని శాస్త్రిగారు రాశారు.

పరబ్రహ్మ శాస్త్రి కృషి ఆధారంగానే తదనంతర కాలపు చరిత్రకారులు పరిశోధనలు కొనసాగించి తెలుగుజాతి చరిత్రకు సంబంధించి మరెన్నో విశేషాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారు. ఆయన శతజయంతి సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ‘శాసనదర్శి’ పేరిట ప్రత్యేక సంచికను, ‘శాసనోపాసన’ పేరిట శాస్త్రి గారి జీవన ప్రస్థా నాన్ని తెలిసే రెండు పుస్తకాలను ప్రచురించటం విశేషం.

మామిడి హరికృష్ణ

Updated Date - 2023-04-17T03:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising