ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆత్మగౌరవమే తెలంగాణ అస్తిత్వం

ABN, First Publish Date - 2023-09-07T03:02:01+05:30

‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో దున్నేవారికి భూమి దక్కింది. బంజరు, పోరంబోకుల, ప్రభుత్వ భూములు పేదలపరమైనాయి. భూస్వాములు పట్టణాలకు పోయారు.

‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో దున్నేవారికి భూమి దక్కింది. బంజరు, పోరంబోకుల, ప్రభుత్వ భూములు పేదలపరమైనాయి. భూస్వాములు పట్టణాలకు పోయారు. జాగిర్దారీ విధానం రద్దయ్యింది. భూ స్వాముల భూ కేంద్రీకరణ రద్దు అయింది. వెట్టి చాకిరి రద్దయ్యింది. కానీ భూములు –వనరులు సమ పంపిణీ లేకపోతే తెలంగాణాలో మళ్లీ మళ్లీ ఉద్యమాలు పుడతాయి. ఈ ప్రాంతమెప్పుడూ రణభూమిగానే మిగులుతుంది’’

రావి నారాయణరెడ్డి (‘వీర తెలంగాణ: నా అనుభవాలు–జ్ఞాపకాలు’ పుస్తకంలోనుంచి)

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి యాభై ఏళ్ల క్రితమే తెలంగాణ ఆత్మను ఈ వాక్యాల్లో విప్పి చెప్పారు. తమ కుటుంబానికి ఉన్న మూడు వేల ఎకరాల భూమిలో తన వంతు వాటాగా వచ్చిన 500 ఎకరాలను పేదలకు పంచి, జనగామ తాలూకాలో ఏకంగా 10వేల ఎకరాలను గుప్పిట్లో పెట్టుకున్న విస్నూర్‌ రామచంద్రారెడ్డి వంటి దేశ్‌ముఖ్‌లు, జాగిర్దార్ల పీచమణచి మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రాజరికాన్ని పారదోలింది తెలంగాణ సాయుధ పోరాటం. భూమితో పాటు దోపిడి, అరాచకం, ఏక వ్యక్తి పరిపాలనపై రైతు కూలీలు తిరగబడి నాలుగువేల మంది వీరుల రక్త తర్పణతో హైదరాబాద్‌ సంస్థానం నిజాం నిరంకుశ పాలనను పతనం చేసింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దేశంలోనే అత్యధిక జనాలు ఓటేసిన పార్లమెంటేరియన్‌ రావి నారాయణరెడ్డి చెప్పినట్లుగా తెలంగాణలో ప్రతి ఇరవై ఏళ్లకో మారు ఉద్యమాలు తప్పటం లేదు. సాయుధ పోరాటం మొదలుకుని ఇరవై ఐదేళ్ల క్రితం ప్రారంభమైన మలి దశ తెలంగాణ పోరాటంలోనూ భూమి, అణిచివేత, నియంతృత్వ పాలనలనే తెలంగాణా సమాజం ప్రశ్నిస్తూ వస్తోంది. తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత కూడా వనరులు, సంపద పంపిణీతో పాటు రాజ్యాధికారం, కీలక నిర్ణయాధికారంలో అన్ని వర్గాల ప్రాతినిథ్యం ఇప్పుడు మరో ప్రశ్నగా మారింది. నాడు నిజాం హయాంలోనూ డెమాక్రటిక్‌గా కనిపించేందుకు ఒక లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఉండేది. అయినా, అందులో సభ్యులంతా జాగిర్దార్ల ప్రతినిధుల నుండే వచ్చేవారు. పేరుకు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఉన్నా, నిర్ణయాధికారమంతా నిజాం నిర్ణయించిన మేరకు ప్రధానమంత్రి తూచ తప్పకుండా అమలు చేసేవారు. ఎలాంటి ప్రజాభిప్రాయం, మేధోమథనం లేకుండానే నిజాం నోటి నుండి ఆ క్షణానికి ఏం మాట వస్తే అదే ఫర్మానాగా హైదరాబాద్‌ కునారిల్లింది. హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు ఆకలి, అవసరాల కంటే ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చేవారు. అందుకే నిజాం పాలన కూలిన ఇరవై ఐదేళ్ల అనంతరం మళ్లీ పరాయి పాలనపై ప్రత్యేక రాష్ట్రం నినాదంతో ముందుకొచ్చారు. ఉమ్మడి పాలనలో దోపిడీ, పీడనను వ్యతిరేకంగా 1997లో భువనగిరి కేంద్రంగా మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అధికారంలో ఉన్నది ఎవరైనా, ఎప్పుడైనా, ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం, అందరికీ చెందాల్సిన భూమి, వనరులను గుప్పిట్లో పెట్టుకోవటం, సంపద పంపిణీ సక్రమంగా చేయకపోతే సహజ సిద్ధంగానే తెలంగాణ ఆగ్రహిస్తుందని దీనర్ధం.

సాయుధపోరాటం – హైదరాబాద్‌ సంస్థానంపై భారత సైన్యాల అపరేషన్‌ పోలో– నిజాం లొంగుబాటు అనంతరం హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటు అయింది. అనంతరం ఆచార్య వినోభాబావే దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి కోసం గుండెనెత్తురులు తర్పణ చేసిన తెలంగాణను భూదానం కోసం ఎంచుకుని వేల ఎకరాలను సేకరించారు, నిరుపేదలకు పంచారు. కానీ నేడు అవే భూములు మళ్లీ కార్పొరేట్‌ కంపెనీలు, నయా భూస్వాముల కౌగిళ్లలోకి వెళ్లిపోయాయి. దశలవారీగా పేదలకు చెందిన భూములన్నీ మళ్లీ పేదల చేతుల నుండి పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నేడు తెలంగాణలో భూమి లేని నిరుపేదల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పేదల అభివృద్ధి, సంక్షేమం కేంద్రంగా సాగాల్సిన కమ్యూనిస్టుల ఉద్యమకార్యాచరణలు బలహీనపడిన కారణంగా తెలంగాణలో ధనిక –పేద తారతమ్యం మళ్లీ నెలకొంది. భూమి కోసం 1946 నుండి 1951 వరకు నాలుగువేల మంది రైతాంగ పోరాట యోధుల ఆత్మ బలిదానం, సమన్యాయం కోసం 1969లో తెలంగాణ ఉద్యమం, ప్రాంతీయ అసమానతలపై మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలమంది యువత ఆత్మ బలిదానాలు జరిగాయి. తెలంగాణ సామాజిక, రాజకీయ క్షేత్రాన్ని అతి దగ్గరగా చూసిన రావి నారాయణరెడ్డి చెప్పినట్లుగా తెలంగాణను ప్రయోగాల కేంద్రంగా మార్చకుండా జనాభా దామాషా మేరకు భూ పంపిణీ, ఇతర వనరుల పంపిణీ జరుగాల్సిందే. రాజకీయ నిర్ణయాధికారంలో అన్ని వర్గాలకు ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఏది అవసరం, ఎలా అవసరం అన్న అంశాలను విశదీకరించి చెప్పిన రావి నారాయణరెడ్డి స్పూర్తిని భావితరాలకు అందించే దిశగా ఆయన పోరాట చరిత్ర, ఆశయాలను ప్రాథమిక పాఠశాల స్థాయిలో పాఠ్యాంశంగా, హైదరాబాద్‌లో స్మారక చిహ్నం ఏర్పాటు, ఆయన పుట్టిన ప్రాంతమైన భువనగిరి కలెక్టరేట్‌కు రావి నారాయణరెడ్డి పేరును పెట్టి, ప్రతియేటా జయంతి, వర్ధంతిలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలి. అదే ఆయనకు మనమివ్వగలిగే ఆత్మీయ నివాళి.

రావి ప్రతిభారెడ్డి

(రావి నారాయణరెడ్డి స్మారక ట్రస్ట్‌)

(నేడు రావి నారాయణరెడ్డి వర్ధంతి)

Updated Date - 2023-09-07T03:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising