ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోతన్న జీవితం పరిష్కృతమే!

ABN, First Publish Date - 2023-04-24T00:07:06+05:30

‘ఇంకా కంచికి చేరని పోతన జీవిత కథ’ పేరిట కొప్పరపు నారాయణమూర్తి ఆంధ్రజ్యోతి వివిధలో ఒక వ్యాసం ప్రకటించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇంకా కంచికి చేరని పోతన జీవిత కథ’ పేరిట కొప్పరపు నారాయణమూర్తి ఆంధ్రజ్యోతి వివిధలో ఒక వ్యాసం ప్రకటించారు (27.03.2023). ఇందులో నన్నే పలుమార్లు ఖండిస్తూ రాశారు.

వావికొలను సుబ్బారావు రాసిన ‘బమ్మెర పోతన రాజు విజయం’, ‘పోతన నికేతన చర్చ’, ‘ఆంధ్ర వాల్మీకి జీవిత చరిత్ర’, ‘పోతన చరిత్ర’ (వానమామలై రాసినది), ‘బమ్మెర పోతన’ (సి.పి.బ్రౌన్‌ అకాడమీ) నేను చదవలేదని, అందువల్ల ఎన్నో ఆమడల దూరంలో ఆగిపోయానని రాశారు. ‘‘సంగనభట్ల చెప్పుకొన్నట్లు ఆయనేమీ నూతన వాదాలు ప్రవేశపెట్టలేద’’న్నారు. ఇతరులు చెప్పిన ఓరుగల్లు వాదాన్ని ‘‘పునరుద్ఘాటించార’’న్నారు.

నేను పోతన రాసిన భోగినీ దండకాన్ని పరిష్కరించి, ప్రతిప దార్థవ్యాఖ్య రాసి స్వయంగా ముద్రించాను. దీనిలో పీఠికాంశంగా పోతన స్థలకాలాదులను స్థూలంగా వివరించాను. పోతన్నకు రాచ కొండతోగల సంబంధాలను విస్తారంగా వివ రించిన చారిత్రక పీఠిక అది. అంతకు ముందే ఈ అంశంలో వినిపించిన నా ఉపపత్తులను, వాదాలను, వాద సమన్వయాలను, పూర్వవివా దాలను గ్రంథవిస్తారం అవుతుందని రాయ లేదు. ఇది పోతనపై ఇప్పటివరకు నేను రాసిన ఆఖరు రచన. దీంట్లో కూడా మళ్లీ అవన్నీ తోడిపోయలేం. నా రచనల గూర్చి వీరికి తెలి యదు. వారు చూడలేదు. చూడక వావికొలను వారి రచనలను నేను చూడలేదన్నారు!

వావికొలనువారు తమ రచనల్లో పోతన ఒంటిమిట్టవాడేనన్న శఠత్వం ప్రకటించారు. వ్యతిరేకించిన కందుకూరి వీరేశలింగం గారిని కూడా తిట్టిపోశారు. కందుకూరివారు తొలుత పోతన ఓరుగల్లువాడు కాదనుకొని తర్వాత తన అభిప్రాయం తప్పని, పోతన ఓరుగల్లు వాడేనని నిర్ధారించడం వావికొలను వారికి కోపకారణమైంది. వావికొలను గ్రంథాలెన్ని చదివినా పోతన ఏకశిలానగరంవాడు (అంటే వరంగల్‌వాడు) అని సమర్థించడం, లేదా సమన్వయపరచడం అనేది ఉండదు. ఆయన వాదాలు ఉపబలకాలైనా కాకున్నా ఆయన దృష్టిలో పోతన ఒంటిమిట్టవాడే! అంతేకాదు, వావికొలను వారు ‘నారాయణ శతకం’, ‘భోగినీ దండకం’ పోతనవి కావని సమూలంగా ఖండించారు అని రాశారు కొప్పర్తి, వావికొలనే ఫైనల్‌ జడ్జిగారన్నట్టు. ఈ వాదాలు నేను చూడలేదనడం ఒక తప్పు ఐతే, పోతన ‘భోగినీ దండకం’ రాయలేదన్న వాదాన్ని విధిగా అంగీకరించాలనడం రెండో తప్పు.

కొప్పరపు వారు జయంతి రామయ్య పంతులు రాసిన లేఖలోని ప్రస్తావనలు-- బమ్మెర పేరు గల గ్రామం ఏదీ వరంగల్‌ దగ్గర లేదు, ...గంగైనా గోదావరి ఐనా రెండూ వరంగల్‌కు చాలా దూరంలో ఉన్నాయి, శ్రీనాథుడు పోతన్నల మధ్య మంత్రశక్తి ప్రదర్శన-- ఉటంకిస్తూ వాటిని ‘‘నరసయ్యగారు అంగీకరిస్తారా లేక తను అనుకుంటున్న దానికి దగ్గరగా ఉన్నదాన్నే అంగీకరిస్తారా అన్న ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది’’ అని వాపొయ్యారు. పై ప్రస్తావనలలో మొదటిదాన్ని నేనే కాదు, తెలుగువారందరూ ఖండిస్తారు. పోతన్న, శ్రీనాథులు తాతామనుమలంత ఎడం ఉన్న వారు అని నేను సోపపత్తికంగా ఐనవోలు శాసనం ఆధారంగా నిరూపించాను. కనుక ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయే ప్రశ్నేలేదు. పోతన్న ఓరుగంటివాదాన్ని ఎందరో పెద్దలు రాసిందాన్ని వావికొలను వారు ‘‘భాషాపరంగా, చరిత్రపరంగా, సాహిత్యపరంగా త్రిప్పిగొట్టా’’ రట! కొప్పరపువారు కాలాన్ని అమోఘంగా వందేళ్లు వెనక్కుతిప్పి, తమ చరిత్ర పరిశోధనా శక్తిని ప్రదర్శించారు. అలాగే కొప్పరపు నారాయణమూర్తి ఏకశిలానగరంలో రామాలయం, వైష్ణవాలయం ఎక్కడుందన్నారు. పోతన్నగారు ఏదో ఒక ఆలయంలో కూర్చొని రాశారని వీరి భావన కావచ్చు. పోతన రామ-కృష్ణ-శివాభేదభావనలు ఏవీ వీరికిపట్టవు. పైగా ఫలానా సంవత్సరంలో పోతన్న పుట్టా డన్న అర్థరహిత చర్చ చేశారు. పోతన్న పుట్టిన తేదీ చెప్పగలిగితే సాహిత్యలోకానికి మేలుచేసి నారాయణమూర్తిగారు ధన్యులౌతారు.

హరిహరరాయలు కడప ఒంటిమిట్ట సమీపం(?)లోని రఘు నాయకస్వామి గుడిని 1410-30ల మధ్య జాతికి అంకితం ఇచ్చి నట్లు కడప మాన్యువల్‌లో ఉందట. నేను ఒంటి మిట్ట ఆలయం వెళ్లి అక్కడి శాసనం సేకరిం చాను. అది సదాశివరాయలు వేయించినది. భోగినీ దండక వ్యాఖ్యా గ్రంథంలో శాసనం ఫోటో, పాఠం ఇచ్చాను. క్రీశ.1336 నాటి హరిహరరాయలకు (తొలి విజయనగర ప్రభువు), క్రీశ.1555 నాటి చివరి ప్రభువు సదాశివరాయలకు మధ్య 200 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఒంటిమిట్ట ఆలయ చరిత్ర రాయడంలో పరమ ప్రయోజనమేమిటో?

కూటమి పదాన్ని ఒంటిమిట్టవారిపై ప్రయోగిం చానని, అనేక తప్పుడు వాదాలు, సాక్ష్యాలు సృష్టించారని అన్నారు (నేను కాదు). పోతన్నకు పూర్వం కడపలో దేవాలయాలు లేవు, నాగరికత లేదు, కవులు లేరని రాశారన్నారు. వారు ప్రస్తావిస్తున్నది నా పుస్తకం కాదు. కనుక నేనేమీ మాట్లాడను. ఒంటిమిట్ట వాదుల సాక్ష్యాలు మాత్రం చరిత్రకు నిలువవన్నది వాస్తవం.

వానమామలై వరదాచార్యులు రాసింది ఒక కావ్యం. కథాపుష్టికి అనేక ఘట్టాలు కల్పించవచ్చు. వారే నాతో స్వయంగా ఒంటిమిట్టకు పోతన్నను తీసుకుపోవడం వెనుక చారిత్రకాధారాలు ఏమీ లేవని, తన కావ్యం అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యం కావాలని అలా కల్పించానని చెప్పారు. ఆ గ్రంథాన్ని చరిత్ర చర్చకు సాక్ష్యంగా స్వీక రించలేం. కాని కొప్పరపువారి ప్రకారం వరదాచార్యులు ‘‘సర్క్యుమె స్టెన్షియల్‌’’గా ప్రతిపాదించారట, ఈ ఉపపత్తులు ప్రామాణిక పరిశోధనా సూత్రాల ప్రకారం తప్పు కాదట. ఇది తప్పే! ఇలాంటి వాటిని స్వీకరిస్తే అది ప్రామాణిక పరిశోధన కాజాలదు. ఇంకా నయం, ఒంటిమిట్టవాదులు పోతన్న నవల రాయలేదుగాని, రాస్తే, దాన్నీ ప్రమాణంగా స్వీకరించాలని మూర్తిగారు భావిస్తారేమో!

మొత్తం మీద కొప్పరపు నారాయణమూర్తి ఓరుగల్లు వాదాన్ని అంగీకరించటం లేదని భావించవలసి వస్తుంది. దానికోసం వ్యాసం రాయబోయి, నన్ను ఖండించడానికి ఎక్కువ నిడివిని వాడినారని అనిపించింది. పోతన భాగవత రచన చేసిన ఏకశిలానగరం ఓరుగల్లే, ఒంటిమిట్ట ఎన్నటికీ కాదు. ‘‘కూర్చుని’’ చర్చించినా, నిలబడి చర్చించినా పోతన్నది ఓరుగల్లే. వివాదాలన్నీ పరిష్కృతాలే!

సంగనభట్ల నరసయ్య

- 94400 73124

Updated Date - 2023-04-24T00:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising