ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RK KOTHAPALUKU : కుల చిచ్చుతో ఓట్ల వేట!

ABN, First Publish Date - 2023-01-15T00:50:30+05:30

రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలను నిషేధించే విధంగా జారీ చేసిన జీవో నెంబర్‌–1కు వ్యతిరేకంగా దాఖలైన రిట్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ చేసిన వ్యాఖ్యలతో జగన్‌ అండ్‌ కో నైజం మరోమారు బయటపడింది. ఈ వ్యాజ్యాన్ని వెకేషన్‌ బెంచ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో అడుగడుగునా కుల విద్వేషం కనిపిస్తోంది. సినిమాలు, వాటిల్లో నటించే హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాకుండా పోయారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అంతే.. కులతత్వం జడలు విప్పి నృత్యం చేసింది. సోషల్‌ మీడియా వేదికగా అవతలివారిపై విషం కక్కారు.

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపై తెలంగాణలో కులాల రొచ్చు కనపడలేదు. సినిమా బావుందనుకున్నవాళ్లు చూశారు.

కులజాడ్యం ఇప్పుడు పాలనారంగానికీ విస్తరిస్తోంది. అధికారుల నియామకాన్ని కూడా కుల కోణంలోనే చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి కొత్తగా నియమితులయ్యారు. అంతే.. కొంతమంది కాపు సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ ప్రకటనలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఏకంగా తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి తమ కులానికి ప్రాధాన్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కుల కోణంలో చూడటమేమిటి? మునుపెన్నడూ ఇలా జరగలేదే? తెలంగాణలో కూడా ఈ తరహా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించిన కులాల కుంపట్లు తెలంగాణను కూడా పొగచూరేలా చేస్తాయి.

కులాలవారీగా విడిపోయి కొట్టుకుంటే ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే సినిమాను వినోదంగా మాత్రమే చూడాలి. అందులో నటించేవాళ్లు వినోదాన్ని మాత్రమే పంచుతారు. కులాలకతీతంగా సంక్రాంతి పండుగను జరుపుకొంటున్నట్టుగానే రాజకీయంగా కూడా కులాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలను నిషేధించే విధంగా జారీ చేసిన జీవో నెంబర్‌–1కు వ్యతిరేకంగా దాఖలైన రిట్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ చేసిన వ్యాఖ్యలతో జగన్‌ అండ్‌ కో నైజం మరోమారు బయటపడింది. ఈ వ్యాజ్యాన్ని వెకేషన్‌ బెంచ్‌ విచారించకూడదని, రిట్‌ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ మాత్రమే విచారించాలని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదించడంతో డివిజన్‌ బెంచ్‌ తీవ్రంగా స్పందించింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో జీవో నెంబర్‌–1 వంటి జీవో ఇంతవరకు ఎక్కడా రాలేదని కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. 1861లో తాము తెచ్చిన చట్టాన్ని బ్రిటిష్‌ పాలకులు కఠినంగా అమలుచేసి ఉంటే స్వాతంత్య్ర పోరాటం జరిగి ఉండేదే కాదన్న న్యాయమూర్తి అభిప్రాయంలో హేతుబద్ధత లేదా? అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే ప్రతిఘటన అంతకంటే తీవ్రంగా ఉంటుందన్న సత్యాన్ని బ్రిటిష్‌ పాలకులు తెలుసుకోగలిగారు. కానీ జగన్మోహన్‌ రెడ్డి తెలుసుకోలేకపోతున్నారు.

మీడియా అయినా, రాజకీయ పార్టీలు అయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించని పక్షంలో వాటికి మనుగడ ఉండదు. సుద్దులు చెప్పేవారికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. జగన్మోహన్‌ రెడ్డి తన పాలన భేషుగ్గా ఉందని నిజంగానే నమ్ముతుంటే తెలుగుదేశం–జనసేన ప్రతిపాదిత పొత్తులపై అంతగా కలవరం చెందాల్సిన అవసరం లేదు. ఆయన మదిలో కలవరమేర్పడిందంటే దాల్‌ మే కుచ్‌ కాలా హై అన్నట్టే కదా. 2019 ఎన్నికలకు ముందు పనిచేసిన ఎత్తగడలు 2024లో పనిచేయకపోవచ్చు. కులాల మధ్య విభజన ప్రయత్నాల మాయలో పడిపోతే ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సంక్షేమం మాటున జరుగుతున్న దోపిడీని గుర్తిస్తున్నారు. ప్రజలలో వ్యతిరేకత ఏర్పడి ఉండకపోతే అధికార పార్టీలో ఎన్నికలకు ఏడాదిన్నర వ్యవధి ఉండగానే అసమ్మతి స్వరాలు వినిపించి ఉండేవి కావు.

ఒకవేళ తెలుగుదేశం–జనసేన పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ సాఫీగా జరగకుండా నిరోధించడం కోసం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలను ముడిసరుకులుగా వాడటం మొదలుపెట్టారు. తమాషా ఏమిటంటే ఈ రెండు చిత్రాలను నిర్మించిందీ ఒకే సంస్థ. ఈ రెండింటిలో ఏది దెబ్బతిన్నా నష్టపోయే నిర్మాత ఒక్కరే. అయినా కులం కార్డును ప్రయోగించారు. రాజకీయాలలో పొత్తులు అవసరాన్ని బట్టి ఉంటాయి. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తమకు అవసరం అనుకుంటే పొత్తు పెట్టుకుంటారు. అవసరం లేదనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారు. గత ఎన్నికల్లో విడిగానే పోటీ చేశారు కదా. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ఓడించడానికి చేతులు కలపక తప్పదని ఆ ఇరువురు నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దాంతో జగన్‌ అండ్‌ కోలో కలవరం మొదలైంది. నిజానికి తెలుగుదేశం–జనసేన పార్టీలు చేతులు కలపక తప్పని పరిస్థితిని కల్పించింది జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే.

ఒక కులంపై మిగతా కులాల వారిలో విద్వేషాన్ని నింపి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అదే ఫార్ములాను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలైన సందర్భంగా కమ్మ–కాపుల మధ్య వైరాన్ని రగలించే ప్రయత్నాలను జగన్‌ అధీనంలోని సోషల్‌ మీడియా విభాగమే చేసిందని చెప్పుకుంటున్నారు. ఫేక్‌ ఖాతాలతో వేలాది పోస్టింగ్స్‌ పెట్టారు. చిరంజీవి సినిమాకు వ్యతిరేకంగా కమ్మవాళ్లు, బాలకృష్ణ సినిమాకు వ్యతిరేకంగా కాపులు పోస్టింగ్‌లు పెట్టినట్టుగా ఆయా కులాలవారిని నమ్మించే ప్రయత్నం చేశారు. గతానికి భిన్నంగా ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలు రాజకీయాలకు ముడిసరుకుగా ఎందుకు మారాయంటే అందుకు కారణం లేకపోలేదు. మరో ఏడాది తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని వార్తలు రావడంతో జగన్‌ అండ్‌ కో తమ వ్యూహాలకు పదును పెట్టింది. కమ్మ, కాపు కులాలను సమాజంలోని మిగతా వర్గాలకు దూరం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు.

లుగువారి నైజం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. బ్రిటిష్‌ కాలంలో బ్రిటిష్‌వాడి అభిప్రాయం ప్రకారం తెలంగాణ వ్యక్తికి తుపాకీ ఇస్తే పిట్టలు కొట్టి కాల్చుకుని తిని సంతృప్తి పడతాడు. రాయలసీమ వ్యక్తి తన ప్రత్యర్థులను కాల్చి చంపి జైలుకు వెళతాడు. కోస్తాంధ్ర వ్యక్తి ఆ తుపాకీని అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ విశ్లేషణకు కాలం చెల్లింది. తెలంగాణవాళ్లు ప్రగతికాముకులుగా ముందుకు సాగుతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర వాళ్లు తమ సహజ స్వభావానికి విరుద్ధంగా కుల, ప్రాంతీయతత్వంతో కొట్టుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా కుల విద్వేషం కనిపిస్తోంది. సినిమాలు, వాటిల్లో నటించే హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాకుండా పోయారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి, బాలకృష్ట నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అంతే.. కులతత్వం జడలు విప్పి నృత్యం చేసింది. సోషల్‌ మీడియా వేదికగా అవతలివారిపై విషం కక్కారు. చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటి తరం కూడా కాదు. ఎప్పటి నుంచో హీరోలుగా నటిస్తున్నారు. అన్ని కులాలవారు, అన్ని వర్గాలవారు సినిమా బాగుంటే ఆదరిస్తూ ఉండేవారు. అందరివాళ్లుగా ఉండాల్సిన సినిమా నటులను కూడా కొందరివాళ్లుగా మార్చేశారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య తెలంగాణలో కూడా విడుదలయ్యాయి. తెలంగాణలో మాత్రం కులాల రొచ్చు కనపడలేదు. సినిమా బావుందనుకున్నవాళ్లు చూశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రేక్షకులు కులాలవారీగా విడిపోయారు. తమ కులానికి చెందిన హీరోలకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో రెచ్చిపోయారు. కాపులు మాత్రమే ఆదరిస్తే చిరంజీవి ఈ స్థాయికి చేరుకుని ఉండేవారా? కమ్మవాళ్లు మాత్రమే ప్రోత్సహించి ఉంటే బాలకృష్ణ పరిస్థితి ఏమిటి? నిజానికి కమ్మవాళ్లు తక్కువగా ఉండే రాయలసీమలోనే బాలకృష్ణకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. సినిమా బాగోలేకపోతే ఏ కులంవాళ్లైనా కులం కారణంగా సినిమాను సక్సెస్‌ చేయరు, చేయలేరు కదా. అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ప్రతి విషయంలోనూ కులం కోణాన్నే చూస్తున్నారు. కళాకారులను కులాల ప్రాతిపాదికన చూడటాన్ని మించిన దౌర్భాగ్యం ఏమి ఉంటుంది? చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎన్నో ఫెయిల్‌ అయ్యాయి. హీరోలు ఏ కులానికి చెందినవారైనా సినిమా బాగోలేకపోతే దానికి ఆదరణ ఉండదు. ఒకప్పుడు సినిమా నటులను కళామతల్లి ముద్దుబిడ్డలుగా చూసేవారు.

సినిమా రంగంలో కులతత్వం ఉన్నా అది పైకి కనిపించేది కాదు. ఇప్పుడు ఈ జాడ్యం ప్రేక్షకులకు పాకింది. ఎస్వీ రంగారావు వంటి మహానటుడిని కూడా ఒక కులంవాళ్లు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ను కూడా అలానే చూడటం మొదలైంది. అందరివాడుగా ఎదిగిన చిరంజీవిని కొందరివాడుగా మార్చివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విషాదం ఏమిటంటే ఈ కులజాడ్యం ఇప్పుడు పాలనారంగానికి కూడా విస్తరిస్తోంది. అధికారుల నియామకాన్ని కూడా కుల కోణంలోనే చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతకుమారి కొత్తగా నియమితులయ్యారు. అంతే.. కొంతమంది కాపు సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ ప్రకటనలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఏకంగా తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి తమ కులానికి ప్రాధాన్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కుల కోణంలో చూడటమేమిటి? మునుపెన్నడూ ఇలా జరగలేదే? తెలంగాణలో కూడా ఈ తరహా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించిన కులాల కుంపట్లు తెలంగాణను కూడా పొగచూరేలా చేస్తాయి. సినిమా రంగానికి, రాజకీయ రంగానికి విడదీయలేని బంధం ఉంది. ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఈ బంధం మరింత బలపడింది. ఆ తర్వాత సినిమా రంగానికి చెందిన కొంతమంది రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సినిమా రంగంలోనైనా, రాజకీయ రంగంలోనైనా అన్ని వర్గాల వారు ఆదరిస్తేనే సక్సెస్‌ సాధ్యం. తెలంగాణలో సినిమా రంగానికి చెందినవారికి మొదటి నుంచీ అంత ఆదరణ ఉండేది కాదు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి 1983 ఎన్నికల్లో తెలం గాణలో ఎక్కువ సీట్లు లభించలేదు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో పార్టీకి ఆదరణ పెరిగింది. 1983లో ఆదరించి అందలం ఎక్కించిన ఆంధ్రావాళ్లు ఆ తర్వాత ఆయనలో కులాన్ని చూడటం మొదలుపెట్టారు. ఈ అవలక్షణం కారణంగా ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కూడా అందరివాళ్లుగా నిలదొక్కుకోలేకపోయారు.. పోతున్నారు. సమాజంలో వచ్చిన ఈ మార్పును రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మరింతగా ప్రేరేపిస్తున్నారు. కులాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో డాక్టరేట్‌ సాధించిందని చెప్పవచ్చు. ఒక కులంపై మిగతా కులాల వారిలో విద్వేషాన్ని నింపి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అదే ఫార్ములాను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలైన సందర్భంగా కమ్మ–కాపుల మధ్య వైరాన్ని రగలించే ప్రయత్నాలను జగన్‌ అధీనంలోని సోషల్‌ మీడియా విభాగమే చేసిందని చెప్పుకుంటున్నారు. ఫేక్‌ ఖాతాలతో వేలాది పోస్టింగ్స్‌ పెట్టారు. చిరంజీవి సినిమాకు వ్యతిరేకంగా కమ్మవాళ్లు, బాలకృష్ణ సినిమాకు వ్యతిరేకంగా కాపులు పోస్టింగ్‌లు పెట్టినట్టుగా ఆయా కులాలవారిని నమ్మించే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా చేసి లబ్ధి పొందారు. దీన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీవాళ్లు జాగ్రత్తలు తీసుకున్నారు.

గతానికి భిన్నంగా ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలు రాజకీయాలకు ముడిసరుకుగా ఎందుకు మారాయంటే అందుకు కారణం లేకపోలేదు. మరో ఏడాది తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని వార్తలు రావడంతో జగన్‌ అండ్‌ కో తమ వ్యూహాలకు పదును పెట్టింది. కమ్మ, కాపు కులాలను సమాజంలోని మిగతా వర్గాలకు దూరం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కొంతకాలం క్రితం విశాఖ పర్యటనకు వెళ్లినపుడు పోలీసులు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకుని హోటల్‌ గదికే పరిమితం చేశారు. దీంతో వెనక్కి తిరిగివచ్చిన పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలిసి సంఘీభావం ప్రకటించారు. తాజాగా కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు కూడా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. దాంతో వైసీపీ నాయకులకు కడుపునొప్పి ప్రారంభమైంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్నందున పొత్తు కుదరకుండా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకవేళ పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ సాఫీగా జరగకుండా నిరోధించడం కోసం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలను ముడిసరుకులుగా వాడటం మొదలుపెట్టారు. తమాషా ఏమిటంటే ఈ రెండు చిత్రాలను నిర్మించిందీ ఒకే సంస్థ. ఈ రెండింటిలో ఏది దెబ్బతిన్నా నష్టపోయే నిర్మాత ఒక్కరే. అయినా కులం కార్డును ప్రయోగించారు. రాజకీయాలలో పొత్తులు అవసరాన్ని బట్టి ఉంటాయి. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తమకు అవసరం అనుకుంటే పొత్తు పెట్టుకుంటారు. అవసరం లేదనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారు. గత ఎన్నికల్లో విడిగానే పోటీ చేశారు కదా. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ఓడించడానికి చేతులు కలపక తప్పదని ఆ ఇరువురు నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దాంతో జగన్‌ అండ్‌ కోలో కలవరం మొదలైంది. నిజానికి తెలుగుదేశం–జనసేన పార్టీలు చేతులు కలపక తప్పని పరిస్థితిని కల్పించింది జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే. ఎవరి రాజకీయాలు వారిని చేసుకోనిచ్చి ఉంటే ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్‌ అలానే ఉండేదేమో.

భయం సుస్పష్టం!

పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమాలకు కూడా జగన్‌ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించింది. అంతేకాదు, గతంలో ఎన్నడూ లేనివిధంగా పవన్‌ కల్యాణ్‌ను వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే 175 స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు విసిరారు. ఆయన ప్యాకేజీకి అమ్ముడుపోతారని, దత్తపుత్రుడని విమర్శించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ ముఖ్యమంత్రి జగన్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ను విమర్శించారు. జనసైనికులను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలన్న వ్యూహంతోనే ఇదంతా చేశారు. అయితే తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకుడేమీ కాదు పవన్‌ కల్యాణ్‌. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభలో మాట్లాడుతూ, ఒంటరిగా పోటీచేసి గెలిచే బలం తనకు లేదని, తన సభలకు వచ్చే జనాలను చూసి మోసపోలేనని చెప్పుకొచ్చారు. రెచ్చిపోయి ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని నిర్ణయించుకున్నట్టు స్పష్టంచేశారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. రెండు రాజకీయపార్టీల అధినేతలు కలిసినప్పుడు ఏమి మాట్లాడుకున్నారో చెప్పాలని మరో పార్టీ నాయకుడు కోరడం వింతగా ఉంది. ఈ కారణంగానే తామేం మాట్లాడుకున్నామో పవన్‌ కూడా వ్యంగ్యంగా చెప్పారు. తన వ్యక్తిత్వ హననానికి వైసీపీ నాయకులు పాల్పడటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కారణంగానే శ్రీకాకుళం సభలో ‘నా బతుకు చెడా..’ అని సినిమాటిక్‌గా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం సభ తర్వాత వైసీపీ నాయకులు, మంత్రుల భాష పీక్స్‌కు చేరింది. పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ‘‘ఏం పీకుతావురా.., రాజకీయ వ్యభిచారివి, పూజకు పనికిరాని పువ్వువి, టెర్రరిస్టువి, కామెడీ పీస్‌వి’’ అంటూ తిట్టిపోశారు. ఈ భాష చూస్తేనే అధికార పార్టీ ఎంతటి నిరాశా నిస్పృహలకు గురవుతున్నదీ అర్థమవుతోంది. చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌ సమావేశంతో వైసీపీలో ప్రకంపనలు పుట్టాయని స్పష్టమవుతోంది. తెలుగుదేశం – జనసేన మధ్య పొత్తు కుదిరేదో లేదో తెలియదు కానీ ఇప్పుడు జగన్‌ అండ్‌ కో కారణంగా విధిగా చేతులు కలపాల్సి వచ్చేట్టుగా ఉంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య అంతరం సృష్టించే ప్రయత్నాలు జగన్‌ అండ్‌ కో మున్ముందు ముమ్మరం చేయవచ్చు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల సందర్భంగా విష ప్రచారం చేసినట్టుగానే మున్ముందు ఏ రూపంలో ఎటువంటి కుయుక్తులు పన్నుతారో తెలియదు.

రాజకీయాలలో ఉన్నవాళ్లు ఆచితూచి మాట్లాడతారు. అదేమిటో కానీ వైసీపీకి చెందిన కొంతమంది ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని గురించి తెలిసిన వాళ్లు ఆయనేమిటి? ఇలా మాట్లాడటమేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ తర్ఫీదు అలా ఉంటుందన్న మాట! సహవాస దోషం అంటారు కదా! చెడ్డవాళ్లతో అంటకాగితే మంచివాళ్లు కూడా చెడిపోతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడదే జరుగుతోంది. వైసీపీలోనే కాదు–పోలీసు శాఖలో కూడా కొంతమంది సైకిక్‌గా ప్రవర్తిస్తున్నారు. కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చుక్కలు చూపించడం కోసం ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ పంపించారు. అలాంటి వారిలో జగన్‌ సామాజికవర్గానికి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తే మాత్రం మమ్మల్ని ఏం చేస్తుంది మహా అయితే పోస్టింగ్‌ ఇవ్వరు. అప్పడు ఇంట్లో కూర్చుని జీతం తీసుకుంటాం. అరెస్ట్‌ చేసి జైలుకు పంపితే పంపుకోనివ్వండి. ముఖ్యమంత్రి జగన్‌ను 16 నెలలు జైలుకు పంపారు కదా’’ అని అంటున్నాడంటే కొంతమంది పోలీస్‌ అధికారులు కూడా సైకోలుగా మారిపోయారని స్పష్టమవుతోంది. ఈ ధోరణి ఎవరికీ మంచిది కాదు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని కాదు కానీ, జగన్‌ పాలనలోనే ఈ ధోరణులు విజృంభిస్తున్నాయి. నిన్న మొన్నటివరకు రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకునేవారు. నోరు జారినవారిని ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపేవారు. అలాగే జరిగితే ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మంది మళ్లీ గెలవకూడదు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడం కోసం జగన్మోహన్‌ రెడ్డి పెడ ధోరణులకు ఆజ్యం పోస్తూండవచ్చు కానీ, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఏదీ జరగదు. సినిమాలను ముడిసరుకుగా మార్చుకుని విద్వేషాలు రగిలించాలనుకునే ప్రయత్నాలు ఎంతోకాలం సాగవు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ఎంత నీచంగా తిడితే అంతగా ఆయనను తెలుగుదేశం పార్టీకి సన్నిహితం చేస్తున్నామని తెలుసుకోలేకపోవడం వైసీపీ నాయకుల అవివేకం. రేపటి ఎన్నికల్లో ఓడిపోతే మన పరిస్థితి ఏమిటి? అని తెలుసుకుని మసలితే వారికే మంచిది.

బెంచ్‌ మాటలకు బదులేది?

ఈ విషయం అలా ఉంచితే హైకోర్టు రిజిస్ర్టీని తెర వెనుక శక్తులు ప్రభావితం చేస్తున్నాయని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాజాగా చేసిన వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితికి అద్దం పడుతోంది. న్యాయ వ్యవస్థను చంద్రబాబు అండ్‌ కో మేనేజ్‌ చేస్తున్నారని జగన్‌ అండ్‌ కో ఇప్పటిదాకా ప్రచారం చేసింది. ఆ తర్వాత న్యాయ వ్యవస్థను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఒత్తిడికి గురిచేసింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసే పిటిషన్లు ఏ బెంచ్‌ ముందు విచారణకు రావాలో నిర్ణయించే స్థితికి చేరుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలను నిషేధించే విధంగా జారీ చేసిన జీవో నెంబర్‌–1కు వ్యతిరేకంగా దాఖలైన రిట్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ చేసిన వ్యాఖ్యలతో జగన్‌ అండ్‌ కో నైజం మరోమారు బయటపడింది. ఈ వ్యాజ్యాన్ని వెకేషన్‌ బెంచ్‌ విచారించకూడదని, రిట్‌ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ మాత్రమే విచారించాలని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదించడంతో డివిజన్‌ బెంచ్‌ తీవ్రంగా స్పందించింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో జీవో నెంబర్‌–1 వంటి జీవో ఇంతవరకు ఎక్కడా రాలేదని కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. 1861లో తాము తెచ్చిన చట్టాన్ని బ్రిటిష్‌ పాలకులు కఠినంగా అమలుచేసి ఉంటే స్వాతంత్య్ర పోరాటం జరిగి ఉండేదే కాదన్న న్యాయమూర్తి అభిప్రాయంలో హేతుబద్ధత లేదా? అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే ప్రతిఘటన అంతకంటే తీవ్రంగా ఉంటుందన్న సత్యాన్ని బ్రిటిష్‌ పాలకులు తెలుసుకోగలిగారు. కానీ జగన్మోహన్‌ రెడ్డి తెలుసుకోలేకపోతున్నారు. ప్రతిపక్షాలను అణచివేయడం కోసం జీవో నెంబర్‌–1 జారీ చేయించి ఉండవచ్చు కానీ, రేపటి రోజు ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వస్తే ఆయన పరిస్థితి ఏమిటి? కేసుల కేటాయింపులో హైకోర్టు రిజిస్ర్టీని మేనేజ్‌ చేస్తున్నారని డివిజన్‌ బెంచ్‌ చేసిన వ్యాఖ్యలకు జగన్‌ అండ్‌ కో సమాధానం చెప్పాలి కదా? వీరసింహారెడ్డి సినిమాలో జగన్మోహన్‌ రెడ్డిని దృష్టిలో పెట్టుకున్నట్టుగా హీరో చెప్పిన డైలాగులకు థియేటర్లలో వచ్చిన స్పందనను పరిశీలిస్తే ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. అయినా జగన్‌కు అనుకూలంగా వ్యవహరించే కొంతమంది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను నమ్ముకుంటే అధికారంలోకి రాలేరు అంటూ ప్రతిపక్షాలకు సుద్దులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ మీడియా విషయంలో ఈ సుద్దులు ఎందుకు చెప్పలేదో తెలియదు. మీడియా అయినా, రాజకీయ పార్టీలు అయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించని పక్షంలో వాటికి మనుగడ ఉండదు. సుద్దులు చెప్పేవారికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.

జగన్మోహన్‌ రెడ్డి తన పాలన భేషుగ్గా ఉందని నిజంగానే నమ్ముతుంటే తెలుగుదేశం–జనసేన ప్రతిపాదిత పొత్తులపై అంతగా కలవరం చెందాల్సిన అవసరం లేదు. ఆయన మదిలో కలవరమేర్పడిందంటే దాల్‌ మే కుచ్‌ కాలా హై అన్నట్టే కదా. 2019 ఎన్నికలకు ముందు పనిచేసిన ఎత్తగడలు 2024లో పనిచేయకపోవచ్చు. కులాల మధ్య విభజన ప్రయత్నాల మాయలో పడిపోతే ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సంక్షేమం మాటున జరుగుతున్న దోపిడీని గుర్తిస్తున్నారు. ప్రజలలో వ్యతిరేకత ఏర్పడి ఉండకపోతే అధికార పార్టీలో ఎన్నికలకు ఏడాదిన్నర వ్యవధి ఉండగానే అసమ్మతి స్వరాలు వినిపించి ఉండేవి కావు. ఈ పరిస్థితులలో హైకోర్టు రిజిస్ర్టీని మేనేజ్‌ చేసినా ఫలితం ఉండదు. జీవో నెంబర్‌–1 ద్వారా అణచివేయాలనుకున్నా ప్రతిఘటన మరింతగా ఉంటుంది. సినిమాలను అడ్డుపెట్టుకుని కులాల కుంపట్లు రాజేయాలనుకున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతను అడ్డుకోలేరు. ఈ సంక్రాంతికి.. ఎన్నికలు జరిగేలోపు వచ్చే సంక్రాంతికి మధ్య కాలంలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ జీవితాలలో నిజమైన సంక్రాంతి వెలుగులు నింపుకొంటారో లేక ఇదే విధంగా భవిష్యత్తు అంధకారం చేసుకుంటారో వారిష్టం. కోస్తా ప్రాంతంలో సంక్రాంతికి కోడిపందేలు జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ పందేలలో పాల్గొనే కోడిపుంజులు చివరకు చనిపోయి ఆహారంగా మారిపోతాయి. చనిపోయిన తర్వాత ఫలానా కులం వాడికి మాత్రమే ఆహారంగా మారాలని కోరుకోవు. కోళ్లకు లేని పట్టింపులు మనుషులకు ఎందుకు? కులాలవారీగా విడిపోయి కొట్టుకుంటే ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే సినిమాను వినోదంగా మాత్రమే చూడాలి. అందులో నటించేవాళ్లు వినోదాన్ని మాత్రమే పంచుతారు. కులాలకతీతంగా సంక్రాంతి పండుగను జరుపుకొంటున్నట్టుగానే రాజకీయంగా కూడా కులాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Updated Date - 2023-01-15T03:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising