ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవతను మేల్కొల్పిన పైగంబరుడు

ABN, First Publish Date - 2023-04-27T01:31:04+05:30

పైగంబర కవులలో ఒకడిగా గుర్తింపు పొందిన కమలాకాంత్‌కి నిజానికి పైగంబర కవితా సంకలనం వెలువడే నాటికే ఒక మంచి కథారచయిత అనే గుర్తింపు ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పైగంబర కవులలో ఒకడిగా గుర్తింపు పొందిన కమలాకాంత్‌కి నిజానికి పైగంబర కవితా సంకలనం వెలువడే నాటికే ఒక మంచి కథారచయిత అనే గుర్తింపు ఉంది. ఒక కథా సంకలనం కూడా ప్రచురించాడు. 1968–69 నాకు చాలా గడ్డు సంవత్సరాలు. గుంటూరు ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యులైన నా మిత్రులందరూ శ్రీకాకుళంలో చనిపోయారు. కొందరు అజ్ఞాతవాసానికి వెళ్ళారు. ఆ దిగులు, బాధలలో ఉన్న నన్ను నా సహాధ్యాయి దేవీప్రియ సాహిత్య ప్రపంచంలోకి నడిపించి ఊరట కలిగించాడు. ఉత్సాహపరిచాడు. సుగమ్‌ బాబు, కమలాకాంత్‌, కిరణ్‌ బాబులను కూడా మా ఇంటికి తీసుకొచ్చాడు. అందరిలో పెద్దవాడు కమలాకాంత్‌ మూడు పదులలో ప్రవేశించబోతున్నాడు. వివాహమైంది. ఉద్యోగం చేస్తున్నాడు. నేను అతి సులువుగా కాంతన్నాయ్‌ అని పిలిచే చనువు ఇచ్చి, నన్ను తమాషాగా అక్కయ్యా అనేవాడు. నాతో మాట్లాడిన చివరిసారి కూడా అక్కయ్యా, అక్కయ్యగారూ అంటూ తమాషా చేశాడు రెండు నెలల క్రితం.

మేం పైగంబర కవులుగా రెండు సంకలనాలు తెచ్చేసరికి విరసం ఏర్పడింది. కమలాకాంత్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగం పోకూడదనే జాగ్రత్తతో విరసంలోకి రాలేదు. నేను సభ్యురాలినయ్యాను. మిగిలినవాళ్లు వాళ్లకు సరిపడిన విధంగా విరసంతో సంబంధ బాంధవ్యాలతో ఉన్నారు. ఏ ఉద్యోగం కోసం సాహిత్యానికి దూరమయ్యాడో ఆ ఉద్యోగం కోసం బొంబాయి వెళ్లిపోయాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు, నలుగురి పిల్లలనూ మంచి చదువులు చదివించటం, ఉద్యోగాలు, వివాహాలు వీటి చుట్టూనే జీవితం గడిచింది. అప్పుడొక కథ, ఇప్పుడొక కథ రాసినా ఆ ప్రపంచానికి దూరమే అయ్యాడు. ఐతే కమలాకాంత్‌ రచనలన్నీ ఒక సంకలనంగా రావడంతో (కెంపులు–మందారాలు) ఆయన సాహిత్యం ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ పుస్తకం కంటే ముందు 2012లో అనుకుంటాను వాళ్ల నాన్నగారు అనువదించిన శంకరాచార్యుల సౌందర్యలహరి, ఆనందలహరిలను ప్రచురించి నాకు పది కాపీలు పంపాడు. ఆ సమయంలో మేము మళ్లీ పూర్వపు స్నేహాన్ని పునరుద్ధరించుకున్నాం. ఎందుకన్నాయ్‌ సాహిత్యానికి ఇంత దూరమయ్యావు అంటే– ‘‘రాయదలచుకున్నది రాయవలసిన సమయంలో రాయలేకపోవటం వల్లనమ్మా. భద్రత కోసం అనుకున్నాను గానీ, రచయితగా నిలదొక్కుకునే స్వేచ్ఛను పోగొట్టుకున్నాను. జీవితంలో నిలదొక్కుకున్నాను’’ అని నవ్వేశాడు. అంతేకాదు, ఇంకా చాలా మాట్లాడాడు. ‘‘మీ చుట్టూ కష్టంగా, ఇష్టంగా లేదా సులభంగా, సాహిత్యంలో స్థిరపడినవారున్నారు వారి గురించే మీకు తెలుసు. సాహిత్యం మీద ఎంతో ప్రేమ ఉండీ దూరంగా ఉన్న నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ల సంగతి మీకు తెలియదు’’ అన్నాడు. ఈ వస్తువుతో ఓ కథో, నవలో రాయొచ్చుగదా అంటే గలగలా నవ్వేశాడు.

మా నలుగురితో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నా సాహిత్యానికి దూరమయ్యాననే దిగులు పెరిగింది. ఆయన నవలలు ‘శాంత పెళ్లి’, ‘ఆ కథ అంతే’, ‘బొమ్మా–బొరుసు’ కాపీలు పాతవి పంపాడు. ఆరు నెలల క్రితం ఆయన భార్య మరణించింది. ఈయన అనారోగ్యాలన్నీ ఆ సంఘటనతో పెరిగాయి. ఆరు నెలల నుంచి వాట్సప్‌ ఫోటోలు, మెసేజ్‌లు అనేకం ఆమె గురించే. మాట్లాడినా ఆమె గురించే. నాకు దేవీప్రియ గుర్తొచ్చి భయం వేసేది. దేవీప్రియ కూడా భార్య మరణం తరువాత ఆమెనే తల్చుకుంటూ మానసికమైన అనారోగ్యంతో శారీరక అనారోగ్యం పెంచుకుని వెళ్లిపోయాడు. చివరికి కమలాకాంత్‌కి కూడా అదే జరిగింది. ఫిబ్రవరి 18, 1941లో గుంటూరు సమీపంలోని చెరుకుపల్లిలో జన్మించిన వఝా సీతారామశర్మ అనే కమలాకాంత్‌ ముందే వెళ్లిన సాహితీకారులతో సన్నిహితంగా మెలగడానికి బయలుదేరి వెళ్లాడు.

మానవతా భావనలు సమాజంలో కవితలుగా వెదజల్లాలని కవిగా, రచయితగా మొదలైన కమలాకాంత్‌ రాసినవన్నీ మానవత్వాన్ని తట్టి లేపేవే. పైగంబర కవిగా ఆయన పేరు సాహిత్యంలో చిరకాలం నిలిచి ఉంటుంది.

– ఓల్గా

Updated Date - 2023-04-27T01:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising